చనిపోయినవారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పత్రికల్లో.. మీడియా వెబ్‌సైట్లలో ప్రకటనలు రావడం తెలిసిందే. మీరూ చూసే ఉంటారు. అయితే ఫ్రాన్స్‌లోని ఓ రేడియో సంస్థకు చెందిన మీడియా వెబ్‌సైట్.. ఇటీవల వంద మందికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఓ ప్రకటన ఇచ్చి వివాదంలో చిక్కుకుంది. ఎందుకంటే ఆ వందమంది జాబితాలో బతికున్న అనేకమంది ప్రముఖులు ఉన్నారు. వారంతా బతికుండానే శ్రద్ధాంజలి ప్రకటించడంతో పాఠకులు విస్తుపోయారు. రేడియో ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ (ఆర్‌ఎఫ్‌ఐ) అనే రేడియో సంస్థకు చెందిన వెబ్‌సైట్ సోమవారం వందమందికి శ్రద్ధాంజలి తెలిపే ప్రకటన ఇచ్చింది. ఈ జాబితాలో బ్రిటన్ రాణి ఎలిజబెత్, ఫ్రెంచ్ నటి బ్రిగిట్టె బర్డాట్, బ్రెజిల్‌కి చెందిన మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పేలీ, అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్, క్యూబా కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత రౌల్ కాస్ట్రో వంటి 80 నుంచి 90 మధ్య వయసున్న ప్రముఖులు ఉన్నారు. ఈ పొరపాటును గమనించి వాటిని తొలగించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నెటిజన్లతో పాటు ఆయా ప్రముఖుల అభిమానులు సదరు రేడియో సంస్థపై మండిపడ్డారు. దీంతో ఆ సంస్థ క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసింది. సాంకేతిక సమస్య వల్ల ఈ ప్రకటన వచ్చిందని, ఎందుకలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది. తమను విశ్వసించే పాఠకులకు క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొంది.
ఎలిజబెత్ రాణికి నివాళి
Related tags :