Editorials

సర్వం స్వరూపానందమయం

సర్వం స్వరూపానందమయం

వారి పూర్వాశ్రమంలో ప్రభాకర నామధేయులు..పేరు ఏదైనా…ఇవాళ ప్రతి హిందువు గుండె స్వరూప నామ జపం చేస్తున్నది.

సాధనతో సమకూరు ధరలోన..!

ఒక బోయవీరుడు వాల్మీకి గా మారినట్టు..!

నాస్తికుడు కన్నప్ప శివభక్తుడు గా మారినట్టు..!

హరినామ తలంపే ఇష్టపడని హిరణ్యకశిపుడు మోక్షం పొందినట్టు..!

వీరు గతంలో బ్రతుకుతెరువు కొరకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసారు.
వ్యాపారాలు చేసారు.

ముఖ్యంగా విశాఖ ఆసీలు మెట్ట స్పోర్ట్స్ స్టోర్స్ లో గుమస్తాగా పని చేసినప్పుడు ..యజమాని ఆగ్రహానికి గురయ్యి ..విశ్వసనీయత కోల్పోయి ..తీవ్ర విచారములో నున్నపుడు..!

శ్రీయుతులు ద్రోణంరాజు సత్యనారాయణ గారు ..చేరదీసి ..ఓదార్చి..మందలించి..
ఈ సమాజములో బతకాలంటే ..ఉపాధి పొందాలంటే…
ఎద్దులా ఉంటే సరిపోదు..!

సమాజము..కాలమాన పరిస్దితులకు అనుగుణము గా నడుచుకోవాలి..

ఆర్దిక స్తోమత లేనప్పుడు ..పెట్టుబడి పెట్టలేనప్పుడు వ్యాపారము చెయ్యరాదు.

విద్యార్హతలు లేనప్పుడు ఉద్యోగము లభించదు.

ఎంత పనికి మాలిన వాడికైనా అవకాశం దొరికే రాజకీయాల్లో కూడా నువ్వు పనికి రావు..!

అందువల్ల కొన్నాళ్ళు సాధన చేసి ..మంచి గురువులను ఆశ్రయించు..వారి వల్ల జ్ఞానం పొందు..
జనహితం కోరి మతధర్మాన్ని ప్రచారము చేయమని సలహా ఇచ్చినారు.

దానికి సమ్మతించి వారు కొద్ది రోజులు అజ్ఞాతంలో ..ఆశ్రమాల్లో గురువుల దగ్గర శుశ్రూషలు చేసి ..జ్ఞానము పొంది..ధర్మ ప్రచారము చేస్తానని గురువులకు ప్రమాణము చేసి..జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టినారు.

మంచి టేకు కర్ర తో ఒక పీట చేయించుకుని..దానికి వెండి పూలు అలంకరించి..
ఒక పీఠం స్దాపించారు.

సౌందర్యం లేని స్వరూపము అగుట వల్ల ..బాహ్య సౌందర్యము కంటే ..అంతః సౌందర్యము మిన్న కనుక..
వారు కాషాయము ధరించి..స్వరూపానంద గా వెలుగులోకి వచ్చారు.

సహజంగానే హిందూధర్మం పట్ల మక్కువ ..ఆరాధన కలిగిన భాగ్యవంతులు..ఇతోధికంగా భూరి విరాళాలతో ..తగిన ఏర్పాట్లు చేసినారు.

దినదినాభివృద్ధి చెందుతూ…
శారదా పీఠము గా ప్రాచుర్యములోకి తెచ్చారు.

నిజంగా కంచి స్వామి వారి శారదా పీఠమా కాదా ఎవరికి కావాలి!?

సర్వసంగ పరిత్యాగి..ధర్మ బోధన చేస్తూ హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నారు అది చాలు.

సహజంగానే ముందుగా రాజకీయులు..ఆశ్రమాలను ఆశ్రయిస్తారు..ఆ వెనుకే అధికార గణము..సంపన్నులు..ఈతి బాధ పీడితులు..స్వామి వారి దీవెనలతో స్వాంతన పొందుతారు.

ఒంటి కి రోగమొస్తే ఆసుపత్రి కి వెళతాము.

మనసుకు రోగ మొస్తే తప్పని సరిగా ఆధ్యాత్మిక కేంద్రాలను ఆశ్రయించ వలసిందే!

ధనికులు..నాయకులు దర్శనాల కొరకు పోటీ పడుతున్నపుడు తప్పక ధనము అనే ఇంధనానికి ప్రాముఖ్యత పెరుగుతుంది.

ఆ విధముగా పీఠము ఖజానా ధన రాశులతో కళకళ లాడింది.

కాని ఎంత ప్రాచుర్యము పొందినా తగిన విధంగా గౌరవించబడటం లేదన్న చింత ఉన్నది.

ఇతర స్వాముల కున్న గౌరవాభిమానాలు దక్కటం లేదన్న బాధ ఉండేది.

అందుకే ధర్మ ప్రచారము తో పాటు రాజును ఆశ్రయించి రాజగురువు గా మారితే ప్రజలకు ఇంకా మేలు చెయ్యవచ్చన్న తలంపు కలిగినది.

అదే సమయంలో తనను అసలు పట్టించుకోని వారికి వ్యతిరేకముగా ప్రచారము చేసినారు.

వారి ప్రత్యర్దులు వెంటనే కేచ్ చేసి..
ఉభయతారక మంత్రం పఠించారు.

దాని పర్యవసానమే..రాజశ్యామల యాగము..గంగా నదిలో మునక.

బాహాటంగా ఒక రాజకీయ పార్టీని..వ్యక్తులను అక్కున చేర్చుకుని..వారికి గాఢ ముద్దుల ముద్ర వేసి..వారి విజయాన్ని కాంక్షించారు.

ఈ క్రమంలో సహజంగానే ప్రత్యర్ది పార్టీలకు వీరు విరోధులవుతారు.

స్వామి వారు సర్వసంగ పరిత్యాగులు అయినా వారికి రాజకీయాలంటే ఎంతో ఆసక్తి..
ప్రచారాడంబరాలంటే మక్కువ..పూర్ణకుంభ స్వాగతాభిలాషులు.

అసలు మూల సూత్రమైన హిందూ ధర్మ ప్రచారము క్రమంగా వెనుక కు పయనిస్తుంది.

అయితే నేమి..వారు సాధించినది తక్కువేమి కాదు.
ఆంధ్ర రాష్ట్రంలో గుర్తింపు ఉన్న దేవాలయాల్లో వారి జన్మదిన సందర్భంగా పూజలు ..అర్చనలు..ఆలయమర్యాదలు జరపటమంటే ..మాటలా!!

వారు బాగుంటే చాలు..ప్రజలు బాగుంటారు.

ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుంది..
పోలవరం నిర్మించబడుతుంది.
అభివృద్ధి ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.

సర్వమానవ సౌభ్రాతృత్వం ..లోక కళ్యాణము వీరి ఆశీస్సులుంటే చాలు అంతా స్వామి మయం ..!

ఇది తెలియని మూఢులు స్వామి వారిని ద్వేషిస్తున్నారు..ఈసడిస్తున్నారు..ఎగతాళి చేస్తున్నారు..విమర్శిస్తున్నారు.

వారి గుండ్రని రూపం ..వారి వైభవం చూసి ఇతర స్వాములు కుళ్ళు కుంటున్నారు.

ఒక ప్రభుత్వాన్ని మార్చి..ప్రజల్ని ఏమార్చి ఇంకొక వ్యక్తిని ఏకంగా మతం మారినట్టు ప్రచారము చేయించి..అధికార పీఠము మీద కూర్చో బెట్టడం సామాన్య విషయమా!?

వారు లోక కళ్యాణార్దము చేసిన రాజకీయ యాగము ఫలించి సకల జనులు ఆనందోత్సాహాలతో..అష్ట ఐశ్వర్యాలతో..తుల తూగుతున్నారు.

వారు ఆంధ్ర రాష్ట్రమునకు చేసిన మేలు మరువరాదు.

దీపావళి పర్వదిన శుభాకాంక్షలు భక్తి పారవశ్యాలతో తెలియచేస్తున్నాను.

వారి కి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియచేస్తూ ..

వారి ఆశీర్వాదముల కొరకు తపిస్తున్న ఆరాధకుడు.