NRI-NRT

ఇరాన్‌పై దాడి చేస్తే ఎలా ఉంటుందని అడిగిన ట్రంప్?

ఇరాన్‌పై దాడి చేస్తే ఎలా ఉంటుందని అడిగిన ట్రంప్?

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అధ్యక్షుడు ట్రంప్‌ అనూహ్య నిర్ణయాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి దేశం ఇరాన్‌పై దాడికి ఉన్న ప్రత్యామ్నాయాలపై గతవారం ఆరా తీసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇరాన్‌లోని ప్రధాన అణుస్థావరంపై దాడికి ఉన్న మార్గాలను సూచించాలని ఓ ఉన్నతస్థాయి సమావేశంలో అధికారుల్ని కోరినట్లు వెల్లడించారు. ఈ భేటీలో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, కొత్తగా నియమితులైన డిఫెన్స్‌ సెక్రటరీ క్రిస్టోఫర్‌ మిల్లర్‌, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిల్లే ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను సదరు అధికారి ధ్రువీకరించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

అయితే, ట్రంప్‌ నిర్ణయాన్ని అధికారులు సమర్థించలేదని సమాచారం. ఇరాన్‌పై దాడి తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్‌ వెనక్కి తగ్గారని సమాచారం. దీనిపై స్పందించడానికి శ్వేతసౌధం నిరాకరించింది. ట్రంప్‌ తొలి నుంచి ఇరాన్‌పై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశంతో కుదుర్చుకొన్న అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు కఠినమైన వాణిజ్యపరమైన ఆంక్షలు విధించారు. అలాగే ఇరాన్‌ అత్యున్నత స్థాయి సైనిక కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమానీపై దాడి చేయించి మరణానికి కారణమయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య వివాదాలు మరింత ముదిరాయి.

అణుఒప్పందంలోని నిబంధనలను ఇటీవల ఇరాన్‌ మరోసారి అతిక్రమించినట్లు ఐరాస నివేదిక ఒకటి తెలిపింది. అణుశుద్ధిలో ప్రధాన పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్‌లను కీలక స్థానంలోకి మార్చే ప్రక్రియను ముగించిందని వెల్లడించింది. ఈ నివేదిక బయటకు వచ్చిన మరుసటి రోజే ఇరాన్‌పై దాడికి గల ప్రత్యామ్నాయాలను ట్రంప్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.