జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నేతల జంపింగ్‌లు షురూ అయ్యాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీ, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు బీజేపీ ప్రతివ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్త నేతలు, టికెట్ ఆశించి భంగపోయిన నేతలకు గాలం వేస్తోంది. ఇప్పటికే పలువురు కారు, హస్తం పార్టీకి చెందిన నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతల సమక్షంలో కాషాయం కండువా కప్పేసుకున్నారు. త్వరలో ఇంకా భారీగానే చేరికలు ఉంటాయని విశ్వసనీయవర్గాల సమాచారం. సమీకరణాలు మారతాయ్! ఈ తరుణంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు ప్రత్యేకంగా మాట్లాడుతూ చేరికలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో హాట్ టాపిక్ అయ్యాయి. ‘పది మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన పది మంది టీఆర్ఎస్ నాయకులు నాతో చర్చలు జరుపుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంపై ఆ పార్టీ నాయకులే అసంతృప్తిగా ఉన్నారు.గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ వంద డివిజన్లు గెలవబోతోంది. మేయర్ అభ్యర్థిని ప్రకటించటానికి అధికార పార్టీ భయపడుతోంది. టీఆర్ఎస్ తమ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీజేపీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తాం. భయంతోనే అధికార పార్టీ రాయితీలు ప్రకటిస్తోంది’ అని సోయం బాపురావు వ్యాఖ్యానించారు. అయితే ఆ పది మంది ఎవరు..? అనే విషయాన్ని వెల్లడించడానికి మాత్రం ఎంపీ సాహసించలేదు. ఇందులో నిజానిజాలెంత.. నిజంగా ‘కారు’ దిగి కాషాయ కండువా కప్పుకుంటారా..? అనేదానిపై క్లారిటీ రావాలంటే రెండ్రోజులు వేచి చూడాల్సిందే.
కారు దిగి కాషాయం వైపు వెళ్తున్న తెరాస నేతలు
Related tags :