* ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం తేదీ ఖరారు చేసింది. డిసెంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఈ మేరకు స్పష్టం చేశారు. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
* ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. లద్దాఖ్‌ను చైనాలో భాగంగా చూపడంపై క్షమాపణలు తెలియజేసింది. తమ తప్పును ఈ నెల 30 నాటికి సరిదిద్దుకుంటామని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (వ్యక్తిగత డేటా రక్షణ)కి వివరించింది. దీనిపై జేపీసీ ఛైర్‌పర్సన్ మీనాక్షి లేఖి మాట్లాడుతూ.. లద్దాఖ్‌ను చైనాలో చూపినందుకు ట్విటర్ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిందన్నారు. భారత చిత్రపటాన్ని తప్పుగా జియో ట్యాగ్ చేసినందుకు క్షమాపణ కోరుతూ ట్విటర్ ఇండియా మాతృసంస్థ ట్విటర్ ఐఎన్‌సీ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డమైన్ కరియన్ అఫిడవిట్ రూపంలో లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పినట్టు తెలిపారు. భారతీయుల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు కోరారని, ఈ నెల 30 నాటికి తప్పును సరిదిద్దుకుంటామని చెప్పిందని ఆమె వెల్లడించారు.
* కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఏర్పడితే సర్ది చెప్పేటప్పుడు ‘పట్టు విడుపు ఉండాలి.. ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోండి’ అని పెద్దవాళ్లు చెబుతుంటారు. గతంలో జరిగిన వాటిని మర్చిపోయి మునుపటిలా కలిసుండమని అలా చేస్తుంటారు. సరిగ్గా ఇదే సూత్రాన్ని ప్రస్తుతం సోషల్ మీడియా కంపెనీలు అమలు చేస్తున్నాయి. ఎలా అంటారా..? గతంలో మనం సామాజిక మాధ్యమాల్లో పంపే మెసేజ్‌లు ఎన్ని రోజులైనా డిలీట్ కాకుండా అలానే ఉండేవి. మనకు కావాల్సినప్పుడు వాటిని తిరిగి చూసుకోవచ్చు. అయితే వాటిలో కొన్ని మెసేజ్‌లు మనకు ఆనందానిస్తే.. మరి కొన్ని బాధను మిగులుస్తాయి. ఒక రకంగా ఇవి జరిగిన సంఘటనను పదే పదే గుర్తుచేసి బాధకు గురిచేస్తుంటాయి.
* ఏపీలో కొత్తగా 1,236 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 9 మంది మృత్యువాత పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తన బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,57,395కి చేరింది. ఇప్పటి వరకు 6,899 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 1,696 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,33,980 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,513 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 69,618 కరోనా పరీక్షలు నిర్వహించగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 93,33,703 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్‌లో తెలిపింది.
* చక్కని ఆరోగ్యాన్ని అందించే వ్యాయామాల్లో సైకిల్ తొక్కడం ఒకటి. అంతేకాకుండా ఈ అలవాటు పర్యావరణానికీ మేలు చేస్తుంది. ఈ కరోనా కాలంలో షేర్ ఆటోలు తదితర వాహనాల్లో ఇళ్లకు చేరేందుకు ప్రజలు సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైక్లింగ్ వల్ల లభించే ప్రయోజనాలను గుర్తించిన కేరళలోని కోచి మెట్రో రైల్ సంస్థ.. మెట్రోల్లో సైకిళ్లను తీసుకెళ్లేందుకు అనుమతించింది. కాగా, ఈ సదుపాయాన్ని ఉచితంగా అందించటం విశేషం. ప్రయాణికులు మాత్రమే టికెట్ తీసుకుంటే సరిపోతుందని అధికారులు తెలిపారు.
* జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయం తెరాసదేనని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన కీలక భేటీలో ఆయన మాట్లాడారు. తెరాస ప్రభుత్వంపై భాజపా చేస్తున్న తప్పుడు ప్రచారాలను నేతలు తిప్పికొట్టాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
* కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి తమ టీకా బాగా పనిచేస్తోందన్న ఫైజర్ ప్రకటన ఎంతో ఊరటనిచ్చింది. కానీ, దాన్ని నిల్వ చేయడానికి -70 (మైనస్ 70) డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమన్న వార్త పెద్ద సవాల్‌నే విసురుతోంది. దీంతో ఇప్పుడు ఆ వ్యాక్సిన్‌ను కొనుగోలుచేయాలా?లేదా? అన్న గందరగోళం నెలకొంది. చాలా దేశాల్లో ఆ ఉష్ణోగ్రత వద్ద టీకాను నిల్వచేసే వసతులు లేకపోవడమే అందుకు కారణం. భారత్ సైతం అదే సందిగ్ధంలో పడింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తే.. ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలేంటన్న దానిపై దృష్టి సారించింది.
* దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం కొత్తగా 38,617 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 89,12,907కు చేరింది. సోమవారం 30వేలకు దిగువన కొత్త కేసులు నమోదు కావడం కాస్త ఊరట కలిగించినా.. గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల్లో 32 శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
* గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కారును షెడ్డుకు పంపిస్తే, సారు.. కారు.. సర్కారు.. ఇక రారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్‌లో ఏం జరగబోతుందో దేశం మొత్తం చూస్తోందన్నారు. హైదరాబాద్‌లోని భాజపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నియంత, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దుబ్బాకలో భాజపాను ప్రజలు గెలిపించారన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను మజ్లిస్ పార్టీకి అప్పగించారని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో తయారి, రూపకల్పన, సమస్యలు, సలహాలు, సూచనల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాల్‌సెంటర్‌కు వచ్చే సూచనలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని బండి సంజయ్ వివరించారు.
* గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో రాజకీయపార్టీలకు చెందిన అనుమతి లేని బ్యానర్లపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపు చర్యలు చేపట్టింది. బస్టాండ్లు, మెట్రో పిల్లర్లకు ఉన్న బ్యానర్లను జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది తొలగిస్తున్నారు. వీటి తొలగింపునకు 20 ప్రత్యేక బృందాలను జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏర్పాటు చేసింది. నిన్న ఒక్క రోజే దాదాపు నాలుగు వేలకు పైగా ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.
* నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కుటుంబాలకు వరద సహాయం ఇప్పటికీ అందలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ముంపు బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వరద బాధితులకు ఇంటి వద్దకే పరిహారం వస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. కానీ మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే డబ్బులు వస్తుండడంతో కేంద్రాల వద్ద వందలాదిగా క్యూ కడుతున్నారని దుయ్యబట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలో నిలబడినా దరఖాస్తులు తీసుకోవడం లేదని.. వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లులు నిలబడలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో నిలబడేలా చేసి తెరాస ప్రభుత్వం ప్రజలను అవమానిస్తోందని ఆక్షేపించారు. తక్షణమే కేసీఆర్, కేటీఆర్‌లు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు తెరాస ఇచ్చే రూ. 10వేలు ఏమాత్రం సరిపోదని ధ్వజమెత్తారు. ఎంఐఎంను అడ్డుపెట్టుకొని గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలని తెరాస చూస్తోందని.. అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని కోమటిరెడ్డి హెచ్చరించారు.
* తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విభజన విషయంలో జస్టిస్ ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ విద్యుత్ సంస్థల తరఫున న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. ఆర్థిక సమతుల్యత అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ఉద్యోగుల కేటాయింపులు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ స్థానికత కలిగిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఉద్యోగల విభజన విషయంలో తొలుత జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన నివేదిక చట్టబద్ధతను తేలుస్తామని.. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను ఏపీ రిలీవ్ చేయడం సరైనదా? కాదా? అనేది నిర్ణయిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. నేటి విచారణలో తెలంగాణ విద్యుత్ సంస్థల పిటిషన్లపై వాదనలు ముగిసిన నేపథ్యంలో ఏపీ విద్యుత్ సంస్థల వాదనలు కొనసాగాల్సి ఉంది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.
* జీహెచ్‌ఎంసీ పరిధిలో వరద సాయం పంపిణీ నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశించింది. గ్రేటర్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, వరదసాయం పంపిణీని నిలిపివేయాలని ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత సాయాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.
* దేశంలో కేసుల సంఖ్య 90 లక్షలకు చేరువౌతున్న నేపథ్యంలో భారతీయుల్లో 80 శాతం మంది కరోనా వైరస్ వ్యాక్సిన్ కావాలనుకుంటున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. కొవిడ్-19 టీకా విషయంలో ప్రజల అభిప్రాయాలు, ఎంపికను గురించిన ఈ సర్వే ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో, 12 వేల మందిపై నిర్వహించారు. దాని ఫలితాలను రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) వెల్లడించింది. వీరిలో 73 శాతం మంది కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపింది.
* కరోనా వైరస్ నివారణకు ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ప్రయోగాలు నవంబరు 20 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా ఈ ప్రయోగాల్లో భాగంగా హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్.. తొలి వాలంటీర్‌గా నమోదు చేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు.
* బాధిత మహిళల తరఫున అండగా నిలబడే రాష్ట్ర మహిళా కమిషన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గత రెండేళ్లుగా రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్ లేకుండా ఖాళీగా ఉండటం సరైన సంప్రదాయం కాదని సామాజిక కార్యకర్త సునితీ క్రిష్ణన్ ట్విటర్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎంవోను ఆమె ట్యాగ్ చేశారు. పార్టీలో అందుకు తగిన మహిళలు ఎవరూ లేరని భావిస్తే పార్టీలతో సంబంధంలేని మహిళను ఆ స్థానంలో భర్తీ చేయాలని ఆమె సూచించారు.
* అమెరికాలో డెమొక్రాట్ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఓటమిని ఇంకా అంగీకరించని అధ్యక్షుడు ట్రంప్ అధికార మార్పిడికి సహకరించనప్పటికీ.. ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ పాలనా యంత్రాంగంపై దృష్టిపెట్టారు. మంత్రివర్గ కూర్పుపై కసరత్తులు మొదలుపెట్టారు. మొదట్నుంచీ భారత్‌పై సానుకూలంగా వ్యవహరిస్తున్న బైడెన్.. తన కేబినెట్‌లోనూ భారత అమెరికన్లకు చోటు కల్పించనున్నట్లు సమాచారం.
* దుబ్బాక నియోజకవర్గం నుంచి భాజపా శాసనసభ్యుడిగా ఎన్నికైన రఘునందన్ రావు, గవర్నర్ కోటాలో శాసనమండలికి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్ గుప్తా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే రఘునందన్‌తో.. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించారు.
* బిగ్బాష్ లీగ్‌లో తీసుకువచ్చిన కొత్త నిబంధనల్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఆ నిబంధనలు జిమ్మిక్కులని, ఆటను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించాడు. డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న బిగ్‌బాష్ లీగ్ 10వ సీజన్‌లో పవర్ సర్జ్, ఎక్స్-ఫ్యాక్టర్, బాష్ బూస్ట్..అనే మూడు కొత్త నిబంధనలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
* దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ను వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలతో కేంద్రం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా పారామిలిటరీ బలగాలకు చెందిన 45 మంది వైద్యులు, 160 మంది పారామెడికల్ సిబ్బంది ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు. కొవిడ్ కేర్ కమ్ ఐసోలేషన్ సౌలభ్యాన్ని అందించేందుకు 800 పడకలతో రైల్వేశాఖ ప్రత్యేక కోచ్‌లను సిద్ధం చేస్తోంది.