Sports

కామన్వెల్త్ క్రీడల్లో మహిళ క్రికెట్

Women Cricket Gets Into CommonWealth Games

కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌కు పునః ప్రవేశం లభించింది. 2022లో నిర్వహించే కామన్వెల్త్‌ మహిళల టీ20 క్రికెట్‌ పోటీలకు అర్హత ప్రక్రియ మొదలైంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి ఆతిథ్య ఇంగ్లాండ్‌ సహా వరుసగా అత్యధిక ర్యాంకుల్లో కొనసాగుతున్న ఆరు జట్లకు నేరుగా అర్హత లభిస్తుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో 1998లో పురుషుల క్రికెట్‌ భాగమైంది. కౌలాలంపూర్‌లో జరిగిన క్రీడల్లో క్రికెట్‌ పోటీలు పెట్టారు. ఆ తర్వాత నిలిపేశారు. మళ్లీ ఇన్నేళ్లకు మహిళల క్రికెట్ రూపంలో భాగస్వామ్యం లభించింది. కామన్వెల్త్‌ క్రికెట్‌ పోటీల్లో మొత్తం ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఆతిథ్య ఇంగ్లాండ్‌కు ఎలాగూ చోటుఉంటుంది. ఆ తర్వాత ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లోని జట్లకు నేరుగా అర్హత లభిస్తుంది. మిగిలిన ఆ ఒక్క జట్టునూ తర్వాత ప్రకటిస్తారు. 2022, జనవరి 31లోపు జరిగే అర్హత పోటీల్లో విజేతకు చోటు లభిస్తుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా‌ క్రికెట్‌ మ్యాచులు జరుగుతాయి. ఇప్పటివరకు కరీబియన్‌ దీవులు ఏ దేశానికి ఆ దేశం ప్రత్యేకంగా ప్రాతినిధ్యం వహించాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌ తొలి ఆరు స్థానాల్లో గనక నిలిస్తే మరో జట్టుకు అవకాశం దొరకనుందని సమాచారం. కామన్వెల్త్‌ క్రీడలు బర్మింగ్‌ హామ్‌ వేదికగా 2022లో జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. ప్రస్తుతం భారత మహిళల టీ20 జట్టు నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌ మూడో ర్యాంకులో కొనసాగుతోంది. ‘మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగేందుకు కామన్వెల్త్‌ క్రీడలు ఓ అద్భుతమైన అవకాశం’ అని ఐసీసీ సీఈవో మను సాహ్నీ అన్నారు. ‘కామన్వెల్త్‌లో క్రికెట్‌ను చేర్చడం క్రీడాకారులకు గొప్ప అవకాశం. ఆ క్రీడల్లో టీమ్‌ఇండియా కచ్చితంగా పాల్గొంటుంది. నాణ్యమైన క్రికెట్‌ ఆడుతూ విజయవంతం అవుతుందని నా విశ్వాసం’ అని టీమ్‌ఇండియా టీ20 సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ధీమా వ్యక్తం చేసింది.