Devotional

కార్తికం 30రోజులు ఇవి చేయడానికి ప్రయత్నించండి

కార్తికం 30రోజులు ఇవి చేయడానికి ప్రయత్నించండి

అన్ని మాసాల్లోకి ఉత్తమమైంది ఈ మాసమేనని కార్తిక పురాణం- మార్కండేయ పురాణం స్పష్టంగా చెబుతున్నాయి. శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన, ప్రీతిపాత్రమైన మాసం కావడమే ఇందుకు కారణం. ముఖ్యంగా కార్తికంలో వచ్చే సోమవారాలు శివారాధనకు, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు శ్రీమహా విష్ణువునకు అత్యంత ఇష్టమైనవి. కార్తిక సోమవార మహత్యం కార్తిక పురాణంలోని రెండో అధ్యాయంలో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే, ఈ మాసంలో మహా విష్ణువు ఆరాధన, ద్వాదశీ వ్రత ప్రాముఖ్యత ఈ పురాణంలో అంబరీశుని కథ ద్వారా స్పష్టంగా చెప్పబడింది. కార్తిక సోమవారాల్లో శివారాధన చేయడం వల్ల మనఃశాంతి కలుగుతుంది. దుఃఖాలు తొలగుతాయి. పాపాలు నశిస్తాయి. శివసాన్నిధ్యం కలుగుతుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రః మనః కారక.. అనగా చంద్రుడు మనఃకారకుడని, చంద్రుడికి అధిపతి గౌరీదేవి మరియు శంకరుడని.. అలాంటి కార్తిక సోమవారాల్లో శివారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. కార్తిక మాసంలో ప్రత్యేకతలను ‘ఈనాడు.నెట్‌’తో ఆయన పంచుకున్నారు.

*** ప్రతి తిథికీ.. ఓ ప్రాముఖ్యత..
కార్తికం పుణ్య తిథులు మొదలయ్యాయి. తొలి సోమవారం, భగినీ హస్త భోజనం, నాగుల చవితి, నాగ పంచమిని భక్తితో జరుపుకొన్నాం. ఇవే కాదు, ఈరోజు నుంచే తుంగభద్ర పుష్కరాలు కూడా ప్రారంభం. ఈ మాసంలో ప్రతి తిథికీ ఓ ప్రాముఖ్యత ఉంది. ఆ తిథి ప్రకారం భగవంతున్ని ఆరాధించడం, దానాలు చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కార్తికంలో ఆరో రోజు: ఈరోజు పూజించాల్సిన దైవం సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల కుజరాహువుల దోషాలు తొలగి దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సౌభాగ్యం నిలబడుతుంది.

ఏడో రోజు: కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఏడో రోజు ఒకటి. ఈ రోజు అధిపతి సూర్యుడు. ఈ రోజున ప్రాతఃకాలమే లేచి నదీ స్నానమాచరించి సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆదిత్య హృదయ పారాయణం చేసినట్టయితే అన్నింటా విజయం చేకూరుతుంది. గోధుమలు, బంగారం, పట్టువస్త్రాలు దానం చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.

ఎనిమిదో రోజు: దుర్గాదేవిని పూజించాలి. వస్త్రాలు, బంగారం, వెండి దానం చేయాలి. ఈ రోజున దుర్గామాతను ఆరాధించడం వల్ల రాహువు, కాలసర్ప దోషాలు తొలగుతాయి. దాంపత్యుల మధ్య అన్యోన్యత పెరిగి సౌభాగ్యం నిలబడుతుంది.

తొమ్మిదో రోజు: ఈ రోజుకు అధిపతి అష్టవశువులు మరియు పితృదేవతలు. పితృతర్పణాలు దానం చేయాలి. ఈ రోజు పితృదేవతలను తలచుకోవడం, వారికి తర్పణాలు చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుతుంది.

10వ రోజు: ఈరోజు అధిపతి దిగ్గజాలు. గుమ్మడికాయ, నూనె దానం ఆచరించడం వల్ల యశస్సు, ధన లాభం కలుగుతాయి.

11వ రోజు: ఈ రోజుకు అధిపతి శివుడు. శివారాధన, శివుడి వద్ద నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం, పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల ధన ప్రాప్తి, ఉద్యోగమునందు అభివృద్ధి కలుగుతుంది. విభూతి పండుతో పాటు శక్తి కొద్దీ ధనాన్ని దానం చేయాలి.

12వ రోజు: కార్తిక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు. మహా విష్ణువుకు ప్రీతికరమైన రోజు. ఈ రోజుకు అధిపతి అయిన మహావిష్ణువును ఆరాధించడం, పరిమళ ద్రవ్యాలు, రాగి దానం చేయడం వల్ల జ్ఞానం, ధనధాన్యాలు కలుగుతాయి. బంధవిముక్తులవుతారు. ఈ రోజు క్షీరాబ్దద్వాదశి వ్రతం ఆచరించి తులసి మొక్కలో ఉసిరి కొమ్మను పెట్టి మహా విష్ణువును ఎవరైతే ఆరాధిస్తారో వారి పాపాలు తొలగి శుభాలు కలుగుతాయి.

13వ రోజు: మన్మథుడిని పూజించాలి. మల్లె, జాజి వంటి పువ్వులను స్త్రీలకు దానం చేయాలి. వన భోజనం చేయడం మంచిది. మన్మథుడిని ఆరాధించడం వల్ల వీర్యవృద్ధి, సౌందర్యం కలుగుతాయి.

14వ రోజు: యముడిని పూజించాలి. నువ్వులు, ఇనుము, గేదె దానంగా ఇవ్వాలి. యముడిని పూజించడం వల్ల అకాల మృత్యువు తొలగుతుంది.

15వ రోజు: చంద్రుడిని ఆరాధించాలి. బియ్యం, వెండి మొదలగునవి దానంగా ఇవ్వాలి. చంద్రుడిని పూజించడం వల్ల, శివారాధన వల్ల మనఃశాంతి కలుగుతుంది.

16వ రోజు: ఈ రోజుకు అధిపతి స్వాహాగ్ని. నెయ్యి, సమిధలు, బంగారం దానం చేయాలి. అగ్నిని ఆరాధించాలి. మహా విష్ణువుని పూజించాలి. విష్ణు సహస్ర నామం పఠించడం వల్ల విశేష పుణ్యఫలం దక్కుతుంది.

17వ రోజు: అశ్వినీ దేవతలను పూజించాలి. ఔషధాలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది.

18వ రోజు: గౌరీ దేవిని పూజించాలి. పులిహోర, అట్లు, బెల్లం దానం చేయాలి. ఇలా చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది.

19వ రోజు: ఈ రోజు అధిపతి విఘ్నేశ్వరుడు. వినాయకుడిని ఆరాధించి నువ్వులు, కుడుములు దానం చేసినట్టయితే సద్బుద్ధి, కార్యసిద్ధి కలిగి విఘ్నములు తొలగుతాయి.

20వ రోజు: నాగేంద్రుడిని పూజించాలి. గోదానం, సువర్ణదానం ఆచరించాలి. నాగేంద్రుడిని పూజించి పై దానాలను ఆచరించడం వల్ల గర్భదోష పరిహారం జరిగి సంతానాభివృద్ధి జరుగుతుంది.

21వ రోజు: సుబ్రహ్మణ్యుడిని పూజించాలి. చిమ్మిలి ఉండలు దానం చేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల కుజ, రాహువుల దోషాలు తొలగి దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సౌభాగ్యం నిలబడుతుంది.

22వ రోజు: కార్తిక మాసంలో అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఇదొకటి. ఈరోజు అధిపతి సూర్యుడు. ప్రాతఃకాలమే లేచి నదీ స్నానమాచరించి సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆదిత్య హృదయ పారాయణం చేసినట్టయితే అన్నింటా విజయం చేకూరుతుంది. గోధుమలు, బంగారం, పట్టువస్త్రాలు దానం చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.

23వ రోజు: అష్టమాతృకలను పూజించాలి. ఉసిరి, తులసి, దీపాలు దానం చేయాలి. అష్టమాతృకలను తలచుకోవడంతో పాటు పైన చెప్పిన దానాలు చేయడం వల్ల మహా యోగము, రాజభోగము, అభీష్ట సిద్ధి కలుగుతాయి.

24వ రోజు: దుర్గాదేవిని పూజించాలి. వస్త్రాలు, బంగారం, వెండి దానం చేయాలి. దుర్గామాతను ఆరాధించడం వల్ల రాహువు, కాలసర్ప దోషాలు తొలగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సౌభాగ్యం నిలబడుతుంది.

25వ రోజు: దిక్పాలకులను పూజించాలి. మీ యథాశక్తి ధనాన్ని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల అఖండ కీర్తి లభిస్తుంది.

26వ రోజు: కుబేరుడుని పూజించాలి. బియ్యం, కందిపప్పు, గోధుమలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.

27వ రోజు: కార్తీక దామోదరుడుని పూజించాలి. ఉసిరి, వెండి, బంగారం, దీపములు దానం చేయాలి. దామోదరుడిని పూజించి దీప దానం చేసినవారికి మహా యోగప్రాప్తి మోక్ష సిద్ధి కలుగుతుంది.

28వ రోజు: ధర్ముడుని పూజించాలి. ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహ అనే మంత్రం జపించాలి. నువ్వులు, ఉసిరి దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే దీర్ఘకాల వ్యాధులు నశిస్తాయి.

29వ రోజు: ఈరోజుకు అధిపతి శివుడు. శివారాధన, శివుని వద్ద నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం, పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల ధన ప్రాప్తి, ఉద్యోగమునందు అభివృద్ధి కలుగుతుంది. విభూతి పండు, శక్తి కొద్దీ ధనం, శివలింగాన్ని దానం చేయాలి.

30వ రోజు: ఈరోజు కార్తిక పౌర్ణమి. సర్వదేవతలు, పితృదేవతలను పూజించాలి. నువ్వులు, ఉసిరి దానం చేయాలి. పితృదేవతలకు తర్పణాలు వదలాలి. ఇలా చేస్తే కుటుంబ క్షేమం కలిగి సంతానాభివృద్ధి కలుగుతుంది.