* కరోనా కారణంగా యావత్ ప్రపంచ దేశాలు ఆంక్షల బాటపట్టాయి. ముఖ్యంగా లాక్‌డౌన్ ఆంక్షలతో ఆయా ప్రాంతాల్లో భారీస్థాయిలో కాలుష్యం తగ్గింది. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకం లేకపోవడం వల్ల కాలుష్యస్థాయి భారీగా తగ్గినట్లు నాసా పరిశోధకులు గుర్తించారు. కేవలం లాక్‌డౌన్ సమయంలో దాదాపు 20శాతం కాలుష్యం తగ్గినట్లు వెల్లడించారు.
* కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబయి పేలుళ్ల కుట్రలో ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉగ్రవాద దాడులకు సంబంధించిన రెండు కేసుల్లో పాక్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం అతడికి శిక్ష విధించింది. జమాత్ ఉల్ దవా (జేయూడీ) సంస్థ చీఫ్‌గా ఉన్న సయీద్ 2008 ముంబయి పేలుళ్ల వెనుక ప్రధాన సూత్రధారి. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న కేసులో ఇప్పటికే 11 ఏళ్లు జైలు శిక్ష పడగా.. అతడు ప్రస్తుతం లాహోర్‌లోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా హఫీజ్‌తో పాటు మరో నలుగురికి పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఉగ్ర సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న ఆరోపణలపై అతడితో పాటు జేయూడీ సభ్యులపై పాక్ ఉగ్ర నిరోధక విభాగం దాదాపు 41 కేసులు పెట్టగా. వాటిల్లో రెండు కేసుల్లో గురువారం శిక్ష పడింది.
* ప్రపంచ స్థాయిలో భారత్‌కు వస్తున్న గుర్తింపు, ఎదుగుదలను చూసి పొరుగు దేశం చైనా భయపడుతున్నట్లే కన్పిస్తోంది. భారత్‌ను తన ప్రధాన ప్రత్యర్థిగా భావించిన చైనా.. అమెరికా, ఇతర ప్రజాస్వామ్య దేశాలతో భారత్‌కున్న వ్యూహాత్మక భాగస్వామ్యాలను విడగొట్టాలని చూస్తోంది. ఇందుకోసం అనేక పన్నాగాలు పన్నుతోందని అగ్రరాజ్యం అమెరికా విదేశాంగ విభాగం ఓ నివేదికలో తెలిపింది.
* గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 75,165 నమూనాలను పరీక్షించగా 1,316 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,58,711కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ 11 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,910కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,821 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 16వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 94,08,868 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
* ‘రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఈ 18 రోజుల్లో తమవారిని కోల్పోయిన కుటుంబాలకు మీరు ఏమని సమాధానం చెబుతారు?’ అంటూ దిల్లీ ప్రభుత్వంపై అక్కడి హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. వైరస్ విజృంభిస్తున్నా ఎందుకు మేల్కోలేదని నిలదీసింది. కోర్టు జోక్యం చేసుకునేదాకా.. వివాహా వేడుకల్లో అతిథుల సంఖ్యను ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించింది.
* దేశ రాజధాని నగరాన్ని కరోనా వణికిస్తున్న వేళ అక్కడి ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కరోనా వ్యాప్తికి కళ్లెం వేయడమే లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించనివారికి రూ.2వేలు జరిమానా విధించనున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇప్పటివరకు రూ.500లుగా ఉన్న జరిమానాను రూ.2వేలకు పెంచినట్టు ఆయన తెలిపారు. గురువారం అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీలో కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా అదనంగా ఐసీయూ బెడ్‌లు, ఇతర వసతులు సమకూర్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
* ఈ నెల 26న ఆసరా, వైఎస్‌ఆర్ చేయూత కింద పాడి పశువుల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 4 వేల గ్రామాల్లో ఈ పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాల్లో భాగంగా లబ్ధిదారులైన మహిళలకు పాడి పశువులు, గొర్రెలు, మేకలు పంపిణీ చేయనున్నారు. దశలవారీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తొలుత ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పంపిణీ చేసి, ఆ తర్వాత దశల వారీగా మిగిలిన జిల్లాల్లోనూ పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆవులు, గేదెలు కావాలని 4.68 లక్షల మంది, గొర్రెలు, మేకలు కావాలని మరో 2.49 లక్షల మంది మహిళలు కోరారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కో యూనిట్ ధర రూ.75 వేలుగా నిర్ణయించారు. ప్రాజెక్టు విలువ రూ.5,386కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ప్రణాళికాబద్ధంగా పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. మహిళల్లో స్వయం సాధికారత, సుస్థిర అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
* అమెరికా ఆర్మీకి చెందిన రహస్య క్షిపణి టెక్నాలజీని చైనాకు అక్రమంగా అందించాడన్న కేసులో నిందితుడికి అమెరికా న్యాయస్థానం 38 నెలల జైలు శిక్ష విధించింది. చైనాకు చెందిన ఉయ్‌సన్ అనే వ్యక్తి అమెరికాలోని టక్‌సన్ సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. ఈ సంస్థ అమెరికన్ ఆర్మీ కోసం రేథియాన్ క్షిపణులు, కొన్ని రక్షణ పరికరాలకు సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. విధుల్లో భాగంగా అమెరికన్ డిఫెన్స్ టెక్నాలజీని నేరుగా యాక్సెస్ చేసే అవకాశం ఉయ్‌సన్‌కు ఉంది. అయితే, ఆయుధ ఎగుమతి నియంత్రణ చట్టం (ఏఈసీఏ), ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్స్ రెగ్యులేషన్ (ఐటీఏఆర్) ప్రకారం తగిన అనుమతి లేనిదే సంబంధిత టెక్నాలజీ ఎవరికీ ఇవ్వకూడదు.
* గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతోనే భాజపాకు పోటీ అని.. తెరాసతో కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం పరిహారం ఇస్తుంటే భాజపా ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెరాసపై విమర్శనాస్త్రాలు సంధించారు. మజ్లిస్‌తో దోస్తీ చేస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ముస్లింలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై యుద్ధం ప్రకటించాలాంటే ముందుగా ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్ బయటకు రావాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో తెరాస కనుసన్నల్లో నడుస్తోందని.. ఈ విషయంలో కొంతమంది అధికారులపై ఫిర్యాదు చేయబోతున్నామని ఈ సందర్భంగా అర్వింద్ చెప్పారు. జీహెచ్ఎంసీ కమిషనర్లను బదిలీ చేయమని లేఖ రాస్తామని అన్నారు. ఎన్నికల్లో భాజపాను అణచివేయాలని పోలీసులు ప్రయత్నిస్తే ఊరుకోమని అర్వింద్ హెచ్చరించారు.
* రష్యాలో కరోనా వైరస్ సరికొత్త రికార్డు నమోదైంది. గురువారం అత్యధికంగా కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల మార్కును దాటేసింది. గురువారం ఒక్కరోజే 23,610 కొత్త కేసులు, 463 మరణాలు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోందని అక్కడి వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కరోనా నియంత్రించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.
* తెలంగాణ సమాజాన్ని చీల్చేందుకు తెరాస అధినేత కేసీఆర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ ఇద్దరూ కలిసి ఎంఐఎంను ఆటవస్తువుగా మార్చుకున్నారని విమర్శించారు. తెరాస, మజ్లిస్, భాజపా ఒకే అజెండాతో పనిచేస్తున్నాయని.. కాంగ్రెస్‌ను బలహీన పరిచేందుకు సహాయం చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా భాజపా అధికారంలోకి వచ్చేందుకు మజ్లిస్ సంపూర్ణ సహకారం అందిస్తోందని.. దీనికి తెరాస సమన్వయం చేస్తోందని వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల్లో అదే జరిగిందన్నారు. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ జైలుకు వెళ్తే బెయిల్ ఇప్పించింది దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావేనని చెప్పారు. భాజపా, ఎంఐఎంది తెరముందు కుస్తీ.. తెరవెనుక దోస్తీ అని రేవంత్ ఆరోపించారు. హిందుత్వ పార్టీ అని చెప్పుకొనే భాజపా నేతలు.. సచివాలయంలో వందేళ్ల చరిత్ర కలిగిన నల్లపోచమ్మ గుడిని కూల్చివేస్తే ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ‘బస్తీ హమారా-బల్దియా హమారా’ అనే నినాదంతో కాంగ్రెస్ పోరాడుతుందని రేవంత్ చెప్పారు.