మరో మూడు నాలుగు నెలల్లో కచ్చితంగా కొవిడ్-19 వ్యాక్సిన్ సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ గురువారం చెప్పారు. శాస్త్ర్రీయ గణాంకాల ఆధారంగా 135 కోట్ల భారతీయులకు ప్రాధాన్యతను బట్టి వ్యాక్సిన్ అందించనున్నట్లు ఆయన తెలిపారు. ‘కరోనా కాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తల’పై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్‌ఎల్‌వో ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా తీవ్రత అధికంగా ఉన్న వారికి మొదటి ప్రాధాన్యతగా వ్యాక్సిన్ అందించనున్నారు. ఆరోగ్య కార్యకర్తలు, కరోనా వాలంటీర్లు జాబితా సిద్దం చేసే పనిలో ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యాక్సిన్ ద్వారా ట్రాకింగ్ చేసి ప్రణాళిక బద్ధంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నాం. 2021 సంవత్సరం మనందరికి మంచి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని, గత కొన్ని నెలలుగా చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నామని వివరించారు. జనతా కర్ఫ్యూ ఒక అపూర్వమైన ప్రయోగమని ఒక సందర్భంలో మోదీ చెప్పినట్లు ఆయన వివరించారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనాను సమర్థంగా నియంత్రించిన దేశాల్లో భారత్ ఒకటని ఆయన తెలిపారు.
ఇంకో నాలుగు నెలలు ఓపిక పట్టండి
Related tags :