DailyDose

ఢిల్లీ నుండి గోవాకు మకాం మార్చిన సోనియా రాహుల్-తాజావార్తలు

ఢిల్లీ నుండి గోవాకు మకాం మార్చిన సోనియా రాహుల్-తాజావార్తలు

* గోవా చేరుకున్న సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ. దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత సమస్యతో సోనియా గత కొంతకాలంగా బాధపడుతున్నారు.ఆగస్టులో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సోనియా గాంధీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.దిల్లీలో పెరుగుతున్న కాలుష్యంతో ఆ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున దిల్లీని వీడి వెళ్లాలని వేరే ప్రదేశానికి వెళ్లాలని వైద్యులు సూచించారు.ఈ మేరకు ఆమె గోవాలో ఉండేందుకు వచ్చారు.

* రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.ఎన్నికలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.మరోవైపు తుంగభద్ర పుష్కరాల ఘాట్ల వద్ద స్నానాల గదులు నిర్వహించాలని అడిగినందుకు కర్నూలు భాజపా కార్యకర్తలను పోలీసులు గృహ నిర్బంధం చేశారని విమర్శించారు.అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

* కలకలం రేపుతున్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కామెంట్స్.రోడ్ల మరమ్మతులపై అధికార పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్ ఆగ్రహం.రోడ్ల మరమ్మతులకు గడువు ఇచ్చాం.టోల్ ప్లాజా ఆపుతామని 3 వరాల క్రితమే ప్రకటించాం.పిడుగురాళ్లలో రోడ్డు గుంతలుగా మారింది మరమ్మతులు చేయకపోతే టోల్ ఆపి ఉద్యమ చేస్తాం: కాసు మహేష్.

* బల్లి దుర్గాప్రసాద్‌ కుటుంబానికి అండగా ఉంటాం.దుర్గాప్రసాద్‌ కుమారుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయం*.వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి.

* కర్నూలు జిల్లా సంకల్‌బాగ్‌ ఘాట్‌లో తుంగభద్ర పుష్కరాలను ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. సంకల్‌బాగ్‌ ఘాట్‌ వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజలో సీఎం పాల్గొన్నారు. తుంగభద్ర నదికి పసుపు, కుంకుమ, సారె సమర్పించి…నదికి హారతినిచ్చి పుష్కరుడిని ఆహ్వానించారు. ఇవాళ్టి నుంచి డిసెంబర్‌ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గా్ల్లో కలిపి 23 పుష్కరఘాట్లను అధికారులు ఏర్పాటు చేశారు.

* హైదరాబాద్‌ ప్రజల రక్షణకు బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాకు మద్దతు కోరుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా సీనియర్‌ నేత లక్ష్మణ్‌ హైదరాబాద్‌లోని నాదెండ్ల మనోహర్‌ నివాసంలో పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ.. భాజపాకు పూర్తి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. రెండు పార్టీలు కలిసే పోటీచేయాలని అనుకున్నా కరోనా పరిస్థితులు, అనూహ్యంగా వచ్చిన ఎన్నికలతో సాధ్యం కాలేదన్నారు.

* కరోనా నివారణకు కృషిచేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాలు హరియాణాలో ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగాలకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌ తొలి వాలంటీర్‌గా టీకా తీసుకున్నారు. అంబాలాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనిల్‌ విజ్‌కు వైద్యులు ట్రయల్‌ డోస్‌ ఇచ్చారు. ఒకటి, రెండు దశల్లో చేపట్టిన కొవాగ్జిన్‌ ప్రయోగాలు విజయవంతమైనట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. దీంతో మూడో దేశ ప్రయోగాలు ప్రారంభించింది.

* మీరు ఆదాయపన్ను రిటర్ను దరఖాస్తు చేసి నెలలు గడిచిందా? ఇప్పటికీ మీ ఖాతాలో రీఫండ్‌ జమ అవ్వలేదా? అసలేం జరుగుతుందో తెలియడం లేదా? అయితే ఈ ఇబ్బంది మీ ఒక్కరిదే కాదు! దేశవ్యాప్తంగా అనేక మందికి ఇంకా రీఫండ్‌ డబ్బులు అందలేదు. బహుశా మరికొన్నాళ్లూ ఆగాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే! ఆదాయపన్ను ఏడాది 2020-21కి సంబంధించి జూన్‌, జులైలోనే పన్ను చెల్లింపుదారులు రిటర్నులు సమర్పించారు. ఇప్పటికీ వారిలో అనేక మందికి రీఫండ్‌ లభించలేదు.

* దేశాన్ని విడదీసేందుకే భాజపా ‘లవ్‌జిహాద్‌’ అనే పదాన్ని సృష్టించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ విమర్శించారు. ప్రేమలో జిహాద్‌కు స్థానం లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు వరుస ట్వీట్లతో భాజపాపై విరుచుకుపడ్డారు. వివాహం అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. దీనికి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకురావడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని ఆయన అన్నారు. ఇటువంటి చట్టాలు ఏ న్యాయస్థానంలోనూ నిలబడవని పేర్కొన్నారు. దేశంలో భాజపా ఒక రాజ్యాంగ విరుద్ధమైన వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు.

* ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ సమాజంలో ఛీత్కారాలు తప్పడం లేదు. తాజాగా ఆ దేశానికి ఫ్రాన్స్‌ దిమ్మదిరిగే షాకిచ్చింది! వారి మిరేజ్‌ యుద్ధ విమానాలను ఉన్నతీకరించబోమని తెగేసి చెప్పింది. అంతేకాకుండా సరిహద్దుల్లో భారత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరో కీలక నిర్ణయమూ తీసుకుంది. రఫేల్‌ యుద్ధ విమానాలను మరమ్మతు చేయించేటప్పుడు పాక్‌ మూలాలున్న సాంకేతిక నిపుణులను దగ్గరకు రానివ్వొద్దని ఖతార్‌కు స్పష్టం చేసింది.

* ముంబయి దాడి జరిగిన నవంబర్‌ 26 కంటే మరింత భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌లో నగ్రోటాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు భారీ కుట్రను అమలు చేసేందుకు వచ్చినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

* మహానగరంలో గత ఆరేళ్లలో చేసిన అభివృద్ధిపై ప్రగతి నివేదికను ఇంటింటికీ చేర్చాలని అభ్యర్థులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సూచించారు. జీహెచ్‌ఎంసీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో ప్రగతి నివేదికను తెలంగాణ భవన్‌లో ఆయన విడుదల చేశారు. పోటీలో నిలిచిన తమ పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. టికెట్లు వచ్చిన వారు నిరాశ చెందిన వాళ్లను కలుపుకొనిపోయి విజయం సాధించాలని మంత్రి సూచించారు. ఈ పది రోజులూ నిరంతరం శ్రమించి గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగురవేయాలని కేటీఆర్‌ మార్గనిర్దేశం చేశారు.

* గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 66,002 నమూనాలను పరీక్షించగా 1,221 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,59,932కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ 10 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,920కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,829 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 15,382 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 94,74,870 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

* అమెరికా తిరిగి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)లో చేరుతుందని ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికైన జోబైడెన్‌ ప్రకటించారు. అలాగే సంస్థలోని సభ్య దేశం చైనా నిబంధనల ప్రకారం నడుచుకుంటుందో లేదో తాను నిర్ధారించుకోవాలనుకుంటున్నాని వెల్లడించారు. ఎన్నికల సమయంలో అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో భాగంగా చైనా గురించి బైడెన్ చేసిన ప్రకటనలనుద్దేశించి ప్రశ్నించగా ఈ విధంగా సమాధానమిచ్చారు. కాగా, కరోనా వైరస్‌పై సరైన సమాచారం ఇవ్వలేదని, ఆ దేశం చెప్పినట్లు ఆరోగ్య సంస్థ నడుచుకుంటుందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే.

* సహారా గ్రూప్‌ సంస్థల అధినేత సుబ్రతా రాయ్‌ తక్షణమే రూ.62,600 కోట్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. డబ్బు జమ చేయని పక్షంలో ఆయన పెరోల్‌ను రద్దు చేయాలని కోరింది. 2012, 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సహారా గ్రూప్‌ పాటించలేదని సెబీ పిటిషన్‌లో పేర్కొంది. ఓవైపు రోజురోజుకీ రుణాలు పెరుగుతున్నా.. వారు మాత్రం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ బయట ఆనందంగా తిరుగుతున్నారని సెబీ ఆరోపించింది. సహారా గ్రూప్‌ తక్షణమే బకాయిలు మొత్తం జమచేసేలా ఆదేశించాలని, లేదంటే వారి పెరోల్‌ను రద్దు చేసి తిరిగి జైలుకు పంపాలని న్యాయస్థానాన్ని కోరింది.

* ఓ భారత సంతతి మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసు ఆస్ట్రేలియా పోలీసులకు సవాలుగా మారింది. ఆరేళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ కేసును ఛేదించేందుకు అవసరమైన సమాచారం అందించిన వారికి.. 5 లక్షల డాలర్లు బహుమానం అందజేస్తామని ఇక్కడి న్యూ సౌత్‌ వేల్స్‌ ప్రభుత్వం ప్రకటించింది.

* ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ ఓ తమిళ కార్టూనిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదం నిజంగా జరగలేదని, కల్పితమని సదరు కార్టూనిస్ట్‌ ఖుష్బును తప్పుపడుతూ తమిళంలో ట్వీట్‌ చేశారు. ‘ఖుష్బు గొప్ప నటి. ఈ ఫొటో దానికి సాక్ష్యం (ప్రమాదం జరిగిన తర్వాత తీసిన ఫొటో షేర్‌ చేస్తూ). దయచేసి ఉత్తమ స్క్రిప్టు కోసం ప్రయత్నించండి. ఈ ప్రమాదంలో ఎన్నో లొసుగులు ఉన్నాయి. కొన్ని ఫొటోల్లో ఖుష్బు ముందు సీటులో కూర్చొని ఉన్నారు, మరికొన్నింటిలో వెనుక కనిపించారు’ అని పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌ చూసిన ఖుష్బూ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలన్నారు.