Movies

అమలకు కోర్టు రక్షణ

Court Protects Amala Paul From Leaking Her Private Pics

కథానాయిక అమలాపాల్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. ఆమె మాజీ ప్రియుడు, గాయకుడు భవ్‌నిందర్‌ సింగ్‌ తన వ్యక్తిగత ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకుండా హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇటీవల అమలాపాల్‌ భవ్‌నిందర్‌పై పరువునష్టం దావా వేశారు. దాన్ని పరిశీలించిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలని భవ్‌నిందర్‌ను ఆదేశించింది. డిసెంబరు 22కు కేసును వాయిదా వేసింది. భవ్‌నిందర్‌ తమ వ్యక్తిగత చిత్రాల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, వివాహం జరిగినట్లు చిత్రీకరిస్తున్నాడంటూ ఇటీవల అమలాపాల్‌ కోర్టును ఆశ్రయించారు. అమలాపాల్‌ రెండో పెళ్లి చేసుకున్నారని మార్చిలో వార్తలు హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ముంబయికి చెందిన గాయకుడు భవ్‌నిందర్‌తో ఆమె పెళ్లి జరిగిందంటూ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వీటిపై అమలాపాల్‌ స్పందిస్తూ.. వృత్తిపరమైన అవసరాల కోసం ఆ ఫొటోలు దిగామని, అది పెళ్లి కాదని స్పష్టం చేసింది. 2014లో అమలాపాల్‌ తమిళ దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. 2019 జులైలో విజయ్‌ రెండో వివాహం చేసుకున్నారు. తర్వాత ఓ వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని అమలాపాల్‌ చెప్పారు. కానీ ఆయన ఎవరో వెల్లడించలేదు. ఇదే సమయంలో ముంబయికి చెందిన గాయకుడు భవ్‌నిందర్‌ సింగ్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. కొన్ని కారణాల వల్ల ఆమె, భవ్నిందర్‌ విడిపోయినట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.