ScienceAndTech

ఇంకా 123456ను వదలని పాస్‌వర్డ్ ప్రేమికులు

People still obsessed with the most unsecure 123456 password

సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్న తరుణంలో యూజర్‌నేమ్స్‌, పాస్‌వర్డ్‌లు గుర్తుపెట్టుకోవడం అనేది నిజంగా పెద్ద టాస్కే. బ్యాంకు ఖాతాలు, పేమెంట్‌ బ్యాంకులు, ఈ-మెయిల్‌, స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ లాక్‌ పాస్‌వర్డ్‌ ఇలా ఒకటా రెండా.. ఎన్ని గుర్తు పెట్టుకోవాలి. వీటికి తోడు సోషల్‌ మీడియా అకౌంట్లు ఉండనే ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించిన యూజర్‌నేమ్స్‌, పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడమంటే కత్తిమీద సామే. అందుకే సులభంగా ఉండేలా 12345 లాంటివి, లేదంటే పుట్టిన రోజు తేదీలను పాస్‌వర్డ్‌లుగా తమ అకౌంట్లకు పెట్టుకుంటుంటారు. అయితే ఇక్కడే హ్యాకర్లకు దొరికిపోతామని టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా పరిశోధనల ప్రకారం, ప్రజలు ఇప్పటికీ “123456789,” ఐలవ్‌ యూ ” లాంటి హ్యాక్-టు-హ్యాక్ పాస్‌వర్డ్‌లనే వాడుతున్నారట. నార్డ్‌పాస్ సంస్థ 2020 సంవత్సరానికిగాను అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం “123456” టాప్‌లోఉంది. ఈ ఏడాది 2,543,285 మంది ఇదే పాస్‌వర్డ్‌ వాడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆ సంస్థ విడుదల చేస్తున్న అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో ఇదే మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. 2015లో 123456 పాస్ వర్డ్ సదరు జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాత పాస్‌వర్డ్‌ అనే పదం మొదటి స్థానంలో నిలిచింది. ఈ మధ్యకాలంలో 123456 అనే పాస్‌వర్డ్ చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది. ఇంకా పొకేమాన్‌, చాకొలెట్‌ లాంటి పాస్‌వర్డ్‌లు కూడా ఇంకా వాడుతున్నారు. అయితే ఏడాది ఈ జాబితాలో పిక్చర్‌1, సెన్హా (పోర్చుగీసులో పాస్‌వర్డ్‌ అని అర్థం) అనే రెండు కొత్త పదాలు కొత్తగా చేరాయని తెలిపింది.

1. 123456
2. 123456789
3. పిక్చర్ 1
4. పాస్‌వర్డ్‌
5. 12345678
6. 111111
7. 123123
8. 12345
9. 1234567890
10. సెన్హా

మీ పాస్‌వర్డ్ జాబితాలో ఉంటే, తక్షణమే మార్పు చేయాలని సూచిస్తోంది. ప్రతి 90 రోజులకు క్యాప్స్‌, స్మాల్‌ లెటర్స్‌ మిశ్రమంతో పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని, అలాగే ప్రతి ఖాతాకు వేరే వేరే పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలని నార్డ్‌పాస్ సూచిస్తుంది. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, పెళ్లి డేటు, లేదా పేరు వంటి వ్యక్తిగత వివరాల ఆధారంగా పాస్‌వర్డ్ ఉపయోగించకూడదని హెచ్చరించింది. హ్యాకర్లు మన ఖాతాలపై ఎటాక్‌ చేయకుండా ఉండేలా కఠినమైన పాస్‌వర్డ్‌లను తమ అకౌంట్లకు సెట్ చేసుకోవాలని, లేదంటే వ్యక్తిగత డేటాతోపాటు, నగదును కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది.