కెనడాలో ఉన్నత చదువులు చదివిన ఓ యువకుడు మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. గంజాయికి బానిసై ఉద్యోగాన్ని కోల్పోయాడు. చివరికి డెలివరీ బాయ్‌గా మారి గంజాయి విక్రయిస్తూ ఆబ్కారీ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం… సికింద్రాబాద్ కవాడీగూడకు చెందిన బాలాజీసింగ్ కెనడాలో ఎం.ఎస్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో ఫేస్బుక్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత మత్తు పదార్థాలకు అలవాటుపడి ఉద్యోగం కోల్పోయాడు. దీంతో ఉపాధి కోసం డెలివరీ బాయ్‌గా మారాడు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో చేరి.. డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ దూల్పేటలో గంజాయి విక్రేతలతో పరిచయం పెంచుకున్నాడు. వాళ్లు ఇచ్చే గంజాయిని గచ్చిబౌలిలోని కొందరు ఐటీ ఉద్యోగులు, మాదాపూర్‌లోని హాస్టల్ విద్యార్థులకు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో అతడే విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించడం మొదలుపెట్టాడు. ఈక్రమంలో నాలుగు రోజుల క్రితం విశాఖపట్నం వెళ్లిన బాలాజీ సింగ్ గంజాయితో పాటు మత్తు ద్రావణాన్ని నగరానికి తీసుకొచ్చాడు. వాటిని ప్యాకెట్ల లో నింపి అవసరమైన వారికి సరఫరా చేస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు బాలాజీసింగ్‌ను అరెస్టు చేశారు. అతనివద్ద నుంచి 800 గ్రాముల మత్తు ద్రావణంతో పాటు, కిలో గంజాయి, ద్విచక్రవాహనం, చరవాణి స్వాధీనం చేసుకున్నారు.
కెనడాలో ఎం.ఎస్. ఫేస్బుక్లో ఉద్యోగం. చేసేది గంజాయి వ్యాపారం.
Related tags :