‘మేల్ ఎస్కార్ట్’ ఉద్యోగాలు కల్పిస్తామనే ప్రకటన సామాజిక మాధ్యమాల్లో చూడగానే ఓ నిరుద్యోగి స్పైసీఫ్రెండ్‌షిప్.కామ్ అనే వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యాడు. మహిళలు ఫోన్ చేసి వీఐపీ మెంబర్‌షిప్, జీఎస్‌టీ, బీమా తదితర రుసుంల పేరిట రూ.13.82లక్షలు స్వాహా చేశారు. బ్యాంకు క్లియరెన్స్ కోసం మరో రూ.1.5 లక్షలు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో మోసపోయినట్లు గ్రహించి సెప్టెంబర్ 18న సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాద్‌నగర్‌కు చెందిన మరో బాధితుడు ఇలాగే మోసపోయాడు. దీంతో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అప్రమత్తమయ్యారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దింపారు. ఫోన్ సిగ్నల్స్, బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా నేపాల్ సరిహద్దులకు సమీపంలోని పశ్చిమ బంగలోని సిలిగురి పట్టణం కేంద్రంగా మోసాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అక్కడ మూడ్రోజులు రెక్కీ నిర్వహించి కాల్‌సెంటర్లపై దాడులు చేసి బిజయ్ కుమార్ షా, బినోద్ కుమార్ షా, మహ్మద్ నూర్ ఆలం అన్సారీని అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. టెలికాలర్స్ దీపా హాల్దార్, శిఖా హాల్దార్‌కు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ప్రధాన సూత్రధారులు సంతూదాస్, అమిత్ పాల్ అలియాస్ అమిత్ శర్మ, సుషాంక్ కుమార్ షా పరారీలో ఉన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్ ఎం.రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేందర్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. అమిత్ పాల్ అలియాస్ అమిత్ శర్మ, సుషాంక్ కుమార్ షా స్పైసీఫ్రెండ్‌షిప్.కామ్, దిడేటర్స్‌హబ్ తదితరాల పేర్లతో కొన్ని వెబ్‌సైట్లను రూపొందించారు. షాపింగ్ మాల్స్, వాణిజ్య భవనాల్లో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో కాల్‌సెంటర్‌కు బిజయ్, బినోద్ మాదిరిగా ఇద్దరు సూపర్‌వైజర్లు, మహ్మద్ నూర్ ఆలం అన్సారీని మేనేజర్‌గా, పది మంది మహిళలను టెలీకాలర్స్‌ను నియమించారు. మాటలతోనే వినియోగదారులను బుట్టలో పడేసేలా శిక్షణ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో మగ వ్యభిచారులకు వల…
Related tags :