Business

ఘనత అంతా మోడీదే-వాణిజ్యం

Ambani Praises Modi In Petroleum University Graduation Ceremony

* ప్రధాని నరేంద్రమోదీపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనలోని అంకితభావం, ఆత్మవిశ్వాసం జాతికి ప్రేరణనిచ్చాయని తెలిపారు. మోదీ చేపట్టిన సాహసోపేత సంస్కరణలతో ప్రపంచమంతా ఇప్పుడు సరికొత్త భారతావనిని గమనిస్తోందని కొనియాడారు. పండిత్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు.

* భారత్‌ ఏటా 10.3 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.75,000 కోట్లు) పన్ను ఆదాయాన్ని కోల్పోతోంది. అంతర్జాతీయంగా ఉన్న చట్టాలను ఉపయోగించుకుని బహుళ జాతి కంపెనీ(ఎమ్‌ఎన్‌సీ)లు పన్నును తప్పించుకోవడంతో పాటు.. ప్రైవేటు వ్యక్తులు పన్ను ఎగవేతలకు పాల్పడడం ఇందుకు నేపథ్యమని ‘ద స్టేట్‌ ఆఫ్‌ టాక్స్‌ జస్టిస్‌’ తన నివేదికలో తెలిపింది. ఇందులో 10 బిలియన్‌ డాలర్లు ఎమ్‌ఎన్‌సీలు పన్ను తప్పించుకోవడం వల్ల.. 200 మి. డాలర్లు వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు ఎగవేతకు పాల్పడడం వల్ల పన్ను ఆదాయం కోల్పోతోంది.

* సామాజిక మాధ్యమాల నియంత్రణకు పాకిస్థాన్‌ ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం ‘ఆసియా ఇంటర్నెట్‌ కోలేషన్'(ఏఐసీ)కు ఆగ్రహం తెప్పించింది. ఏఐసీలో ఫేస్‌బుక్‌, గూగుల్‌, ట్విటర్‌ సహా మరికొన్ని సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం రూపొందించిన కొత్త నిబంధనల వల్ల పాక్‌లో సేవల్ని కొనసాగించడం కష్టతరమవుతుందని స్పష్టం చేసింది. వెంటనే నిబంధనల్ని సమీక్షించని పక్షంలో సేవల్ని నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు కొత్త చట్టంలోని నియమాలను ఉటంకిస్తూ ఏఐసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌ రూపొందించిన నిబంధనలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని స్పష్టం చేసింది.

* విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు ఈ నెల 13తో ముగిసిన వారానికి 427.7 కోట్ల డాలర్లు పెరిగి, 57,277.1 కోట్ల డాలర్లకు చేరినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. ఇప్పటివరకు ఇదే జీవనకాల గరిష్ఠం. క్రితం వారం కూడా ఫారెక్స్‌ నిల్వలు 777.9 కోట్ల డాలర్లు పెరిగి, 56,849.4 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. సమీక్షా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏలు) 552.6 కోట్ల మేర పెరిగి, 53,026.8 కోట్ల డాలర్లకు చేరడంతోనే మొత్తం నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరినట్లు ఆర్‌బీఐ వివరించింది. పసిడి నిల్వలు మాత్రం 123.3 కోట్ల డాలర్ల మేర తగ్గి 3,635.4 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వద్ద మన దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు 148.8 కోట్ల డాలర్లుగా, నిల్వల స్థితి 466.1 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

* ఓటీటీ వీక్షకులకు శుభవార్త! డిసెంబర్‌ మొదటి వారాంతంలో స్ట్రీమింగ్‌ ఫెస్ట్‌ నిర్వహిస్తున్నామని నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. డిసెంబర్‌ 5, 6 తేదీల్లో అభిమానులు ఉచితంగా సినిమాలు, వెబ్‌ సిరీసులు, భారతీయ భాషల్లో కంటెంట్‌ను చూడొచ్చని తెలిపింది. చందాదారులు కానివారు నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షణ అనుభూతిని పొందేందుకే ఈ వేడుక నిర్వహిస్తున్నామని వెల్లడించింది.