గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థంగా దక్షిణాది సినీ టెలివిజన్, డబ్బింగ్ ఆర్టిస్టుల యూనియన్ అధ్యక్షుడు రాధారవి కొత్త డబ్బింగ్ స్టూడియోను ఏర్పాటు చేశారు. ఈ స్టూడియోకు ‘ఎస్పీబీ’ అని పేరు పెట్టారు. డబ్బింగ్ యూనియన్ సభ్యులు, టెలివిజన్ ఆర్టిస్టుల సమక్షంలో శుక్రవారం స్టూడియో ఆరంభమైంది. బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసిన వారం రోజుల తర్వాత ‘ఎస్పీబీ’ పేరుతో స్టూడియోను ఏర్పాటు చేస్తానని రాధారవి వెల్లడించారు. కేవలం రెండు నెలల వ్యవధిలో స్టూడియోను పూర్తి చేయడం పట్ల డబ్బింగ్ యూనియన్ ఆనందం వ్యక్తం చేసింది. ఎస్పీబీ అనేక సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. కె. బాలచందర్ సినిమా ‘మన్మథలీల’ కోసం తొలిసారి వాయిస్ యాక్టర్‌గా పనిచేశారు. ఆపై కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధన్, సల్మాన్ ఖాన్, మోహన్, అనిల్ కపూర్, జెమిని గణేశన్, అర్జున్ తదితర కథానాయకులకు వివిధ భాషల్లో తన స్వరం అందించారు. బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో చెన్నైలోని ఎమ్‌జీఎమ్ ఆసుపత్రిలో సెప్టెంబరు 25న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
ఎస్పీబీ డబ్బింగ్ స్టూడియో ప్రారంభం
Related tags :