‘పోలవరం ప్రాజెక్టు నిషిద్ధ ప్రాంతమా? అక్కడకు వెళ్లకుండా నేతలను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు?’ అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన సీపీఐ నాయకులను నిర్బంధించడం, గృహ నిర్బంధం చేయడాన్ని ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. ‘తెలుగుదేశం హయాంలో పోలవరం పర్యాటక ప్రాంతంగా మారింది. ప్రభుత్వమే ప్రజలను తీసుకెళ్లి అక్కడ జరిగే పనుల్ని చూపించింది. 72% మేర పనులను శరవేగంగా పూర్తి చేసింది’ అని చంద్రబాబు వివరించారు. ‘వైకాపా ప్రభుత్వం 18 నెలలుగా పోలవరం పనులపై నిర్లక్ష్యం చూపింది. పరిహారం, పునరావాసాన్ని గాలికి వదిలేసింది. తాజాగా ఎత్తు తగ్గింపు ప్రచారం నేపథ్యంలో.. ప్రాజెక్టు సందర్శనకు వెళ్లే సీపీఐ నాయకులు, కార్యకర్తల్ని అడ్డుకోవడం దమనకాండకు పరాకాష్ఠ’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘సీపీఐ నాయకులను వెంటనే విడుదల చేయాలి. ప్రతిపక్షాలపై అక్రమ కేసులను ఎత్తేయాలి. పోలవరం పరిశీలనకు వచ్చే వారిని అనుమతించాలి’ అని డిమాండు చేశారు.
పోలీసుల హక్కులను ప్రశ్నించిన చంద్రబాబు
Related tags :