చైనా బరితెగింపు రోజురోజుకూ పెరుగుతోంది. సరిహద్దు వివాదంపై భారత్‌తో ఒకపక్క చర్చలు సాగిస్తూనే మరోవైపు దొంగచాటుగా దుష్ట పన్నాగాలను కొనసాగిస్తూనే ఉంది. వివాదాస్పద డోక్లామ్ పీఠభూమికి చేరువలో భూటాన్ భూభాగంలోకి 2 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి, గ్రామాన్ని నిర్మించిన డ్రాగన్.. ఆ ప్రాంతంలో రోడ్డునూ వేస్తోందని తాజాగా వెల్లడైంది. ఈ రహదారి ఏకంగా 9 కిలోమీటర్ల మేర భూటాన్‌లోకి వెళ్లిందని హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. దీనిద్వారా కీలకమైన భారత భూభాగంపై నిఘా పెట్టాలని చైనా చూస్తోంది. అంతేకాదు.. రెండు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి అధునాతన రాడార్లను ఏర్పాటు చేస్తోంది. ఆగమేఘాల మీద ఇతర మౌలిక వసతులనూ సమకూర్చుకుంటోంది.
2017లో డోక్లామ్ పీఠభూమి వద్ద భారత్, చైనా దళాలకు మధ్య దాదాపు రెండున్నర నెలలపాటు ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే. నాడు జొంప్లెరి పర్వత పంక్తి వద్దకు రోడ్డు వేసేందుకు డ్రాగన్ ప్రయత్నించింది. భారత సరిహద్దు శిబిరానికి దగ్గర్లో ఆగిన ఒక రహదారిని సదరు పర్వతాల వరకూ విస్తరించడానికి చైనా కార్మికులు సిద్ధపడ్డారు. వారిని భారత సైన్యం నిలువరించింది. జొంప్లెరిపై పాగా వేస్తే.. భారత ఈశాన్య ప్రాంతాన్ని మిగతా దేశంతో సంధానించే కీలక భూభాగంపై నిరంతరం నిఘా పెట్టే సామర్థ్యం డ్రాగన్ సైన్యానికి లభిస్తుంది. ఆ ప్రమాదాన్ని భారత సేన అప్పట్లో తప్పించింది.
మూడేళ్ల తర్వాత చైనా నిర్మాణ కార్మికులు మరోసారి రంగంలోకి దిగారు. మరో మార్గంలో రోడ్డు వేయడం మొదలుపెట్టారు. టోర్సా నది ఒడ్డున ఇది సాగుతోంది. చైనా, భూటాన్ సరిహద్దుల నుంచి మొదలైన ఈ రహదారి.. దక్షిణ దిశగా పయనిస్తోంది. ఇది డోక్లామ్ ప్రతిష్టంభన ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. జొంప్లెరి పర్వత పంక్తిని చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఇది డ్రాగన్‌కు ఉపయోగపడుతుంది. చైనా అధికారిక మీడియా సీజీటీఎన్‌లో సీనియర్ జర్నలిస్టుగా ఉన్న షెన్ షివెయ్ ఇటీవల చూపిన పలు చిత్రాల్లో భూటాన్ భూభాగంలో చైనా నిర్మించిన పంగ్డా అనే సదరు గ్రామం వివరాలు తొలిసారిగా బహిర్గతమయ్యాయి. వీటిని భారత్‌లో భూటాన్ రాయబారి మేజర్ జనరల్ వెట్సాప్ నంగ్యాల్ వెంటనే ఖండించారు. భూటాన్‌లో చైనా గ్రామమేదీ లేదన్నారు. తాజాగా వెలువడిన ఉపగ్రహ చిత్రాలు తప్పని నిరూపించాయి. చైనా వ్యవహారాలపై స్పష్టమైన ఆధారాలను అందించాయి. టోర్సా నది లోయ ప్రాంతంలో విస్తృతంగా నిర్మాణ కార్యక్రమాలు సాగుతున్నట్లు వాటిలో స్పష్టమవుతోంది. డోక్లామ్ ప్రాంతానికి సమీపంలో సైనిక గోదాములు వెలిసినట్లు వెల్లడైంది.
భారత్‌పై నిశితంగా నిఘా వేసే ఉద్దేశంతో డ్రాగన్.. లద్దాఖ్ నుంచి సిక్కిం వరకూ అధునాతన రాడార్లను ఏర్పాటు చేస్తోంది. యెచెంగ్ వద్ద ఓ మోస్తరు భవనాన్ని, వాచ్‌టవర్‌ను నిర్మిస్తోంది. రాడార్ల సంఖ్యను మూడు నుంచి నాలుగుకు పెంచింది. ఇప్పటికే జేవై-26, హెచ్‌జీఆర్-105, జేఎల్‌సీ-88బీ రాడార్లు ఉండగా… కొత్తగా మరో రాడార్‌ను ఏర్పాటు చేసింది. సిక్కింకు సమీపంలోని పాలీ, ఫారీ క్యారాంగ్ లా ప్రాంతానికి రెండు కిలోమీటర్లు దూరంలో రాడార్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అందులో నాలుగు రాడార్లు ఉన్నాయి. సెంట్రల్ భూటాన్‌కు సమీపంలో యాండోర్క్ సరస్సు వద్ద నిఘా సదుపాయాలను అభివృద్ధి చేసింది. సోనాకు ఈశాన్యంగా ఆరు కిలోమీటర్ల దూరంలో క్యూనా ఎలక్టాన్రిక్ యుద్ధ వ్యవస్థను మోహరించింది. ఇక్కడ మూడు రాడోమ్‌లు, మూడు రాడార్లు, ఐదు భవనాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో లింజి, నిగిటి వద్ద కూడా రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కారాకోరం కనుమలో వివాదాస్పద ప్రదేశమైన రెచిన్ లా సమీపంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. మోడల్ గ్రామాలుగా చెబుతూ శాశ్వత ఆవాసాలనూ నిర్మిస్తోంది.