Politics

వైఎస్సార్‌పై రఘునందన్ తీవ్ర వ్యాఖ్యలు

Dubbaka BJP MLA Raghunandan Controversial Comments On TRS & YSR

‘వెనుకటికి ఒకడుండేవాడు. పావురాల గుట్టల్లో పావురమైపోయిండు. మీకు అదే గతి పడుతుంది.నేను సైన్స్‌ టీచర్‌ను. యాక్షన్‌కు రియాక్షన్‌ ఉంటుంది’..ఈ వ్యాఖ్యలు చేసిందెవరోకాదు. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆదివారం మీడియాసమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులపై ఈ విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలుచేశారు. గతంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ పావురాల గుట్టవద్ద జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

రఘునందన్‌రావు వాఖ్యలపై తెలంగాణ సమాజం మండిపడింది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతిబింబాలైన టీఆర్‌ఎస్‌ అగ్రనాయకులపై నీచవ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్‌మీడియాలోనూ రఘునందన్‌రావుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దమ్ముంటే ఎన్నికల్లో ఎదుర్కొవాలె తప్ప, దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలకు బుద్ధిచెప్తామని హెచ్చరించారు. రఘునందన్‌రావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఏపీ అధికార వైసీపీ నేతలు సైతం మండిపడుతున్నారు. రఘునందన్‌రావు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని వైసీపీ సోషల్‌మీడియా ఇన్‌చార్జి గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోషల్‌మీడియా వేదికగా ఒక పోస్టుచేశారు. ‘అయ్యా రఘునందనరావా! తమరెంత.. తమరి బతుకెంత? మీరు వైఎస్‌గారి మరణం గురించి మాట్లాడేంతవారా? మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పొందిన తరహా మరణాన్ని పొందాలంటే పాలకుడిగా పెట్టిపుట్టాలి. తుదిశ్వాస కూడా ప్రజల కోసం విడిచిన చరిత్ర వారిది. అప్పుడు మీలాంటి బొకాడియాలు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. మీరేంటి? చిత్తు కాగితంతో సమానమైన మీ చరిత్ర ఏమిటో మాకు అనవసరం. మీరు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రాజకీయం చేయాలనుకుంటే.. మీ ప్రత్యర్థి పార్టీలను విమర్శించుకోండి. మీ రాజకీయం కోసం మీరు గుడికే వెళ్తారో, గుండే కొట్టించుకుంటారో మాకు అనవసరం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గురించి కానీ, వైఎస్‌ కుటుంబం గురించి కానీ మాట్లాడే అర్హత మీకులేదు. వారి కాలిగోటికి సరిపోదు మీ జీవితం. కొత్తబిచ్చగాడు పొద్దెరగనట్టుగా మీరు ఇష్టానుసారం మాట్లాడొద్దు. మరోసారి ఈ తరహాలో మాట్లాడితే పర్యవసనాలను ఎదుర్కొవాల్సిఉంటుంది. ఒళ్లు జాగ్రత్త’ అని హెచ్చరించారు.