NRI-NRT

ట్రంప్ మందుకు FDA అనుమతి

ట్రంప్ మందుకు FDA అనుమతి

ప్రాణాంతక కరోనా వైరస్‌ అంతమొందించేందుకు వ్యాక్సిన్‌తో పాటు ఔషధాల కోసం విశేష కృషి జరుగుతోంది. ఇప్పటికే పలు రకాల చికిత్సా విధానాలు కొంత మేర ఫలితాన్నిస్తున్నాయి. తాజాగా అందుబాటులోకి వచ్చిన ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీ డ్రగ్‌’ భారీ ఆశలు రేకెత్తిస్తోంది. కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ దీన్ని ‘స్వర్గం నుంచి వచ్చిన బహుమతి’గా అభివర్ణించారు. వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆస్పత్రిలో ఆయనకు ఈ డ్రగ్‌ను ఇచ్చారు. దాని వల్లే ఆయనలో కొవిడ్‌ తీవ్రరూపం దాల్చలేదని వైద్యులు భావిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్‌ కోసం భారీ నిధులు సమకూరుస్తున్న మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ సైతం దీన్ని అత్యంత సమర్థమైన చికిత్సగా పేర్కొన్నారు. దీంతో దీనిపై విస్తృత పరిశోధనలు జరిపిన అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ రీజెనెరాన్‌ కంపెనీ రూపొందించిన యాంటీబాడీ డ్రగ్‌ అత్యవసర వినియోగానికి అనుమతించింది. వ్యాక్సిన్‌ అందరికీ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చెప్పలేని ఈ పరిస్థితుల్లో ఈ డ్రగ్‌ చికిత్సలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని భావిస్తున్నారు.