Movies

నాకు పుట్టుకతో బీపీ ఉంది

Rana Gets Emotional Speaking About His Health

గతకొంతకాలంగా నటుడు రానా ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఆయనకు కిడ్నీ సమస్య ఉందని, అందుకోసం ఆయన విదేశాల్లో చికిత్స కూడా తీసుకుంటున్నారని ఎన్నో రకాలు చర్చలు సాగాయి. అయితే.. ఈ వార్తలపై రానా ఎన్నడూ స్పందించలేదు. కొంతకాలం తర్వాత ఆయన ‘అరణ్య’ ఫస్ట్‌లుక్‌ విడుదల చేయడంతో.. ఓహో ఈ సినిమా కోసం రానా తన బరువు తగ్గించుకున్నాడేమో అనుకున్నారంతా. కానీ.. ఈ భల్లాలదేవుడు తాజాగా ఓ చేదు వార్త చెప్పాడు. సమంత హోస్ట్‌గా వ్యవహరించే ‘సామ్‌జామ్‌’ కార్యక్రమంలో పాల్గొన్న రానా తన ఆరోగ్యంపై ఇలా స్పందించాడు. జీవితం వేగంగా ముందుకు వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక చిన్న పాజ్ బటన్ వచ్చిందని, పుట్టినప్పటి నుంచి తనకు బీపీ ఉందని, దీని వల్ల గుండెకు సమస్య తలెత్తుతుందని రానా అన్నాడు. ‘‘నీ కిడ్నీలు కూడా పాడవుతాయి. స్ట్రోక్ హెమరేజ్‌కు(మెదడులో నరాలు చిట్లిపోవడం) 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉంది’ అని వైద్యులు చెప్పారన్నాడు. ఈ విషయం చెప్పే క్రమంలో రానా కంటతడి పెట్టుకున్నాడు. వెంటనే సమంత స్పందిస్తూ ‘మీ చుట్టు జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నా మీరు మాత్రం ఎంతో ధైర్యంగా ఉన్నారు. ఆ సమయంలో నేను మిమ్మల్ని స్వయంగా చూశాను. మీరు నిజంగా సూపర్‌ హీరో’ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో రానాతో పాటు డైరెక్టర్‌ నాగ్‌అశ్విన్‌ కూడా పాల్గొన్నారు.