వ్యక్తిగతంగా తాను ఏకాంతవాసాన్ని ఎంతగానో ఇష్టపడతానని చెప్పింది అగ్ర కథానాయిక శృతిహాసన్. లాక్‌డౌన్ సమయంలో ముంబయిలోని స్వగృహంలో ఏకాంతంగా గడిపానని, తనలోని మానసిక శక్తుల్ని ప్రోది చేసుకోవడానికి, ప్రతిభకు పదునుపెట్టుకోవడానికి ఈ కాలం ఉపకరించిందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తనలోని కవితాపరమైన సృజనకు మెరుగులుదిద్దుకున్నానని తెలిపింది. ఈ మధ్యే శృతిహాసన్ ‘ఎడ్జ్’ పేరుతో స్వీయ సాహిత్యంలో ఓ మ్యూజికల్ ఆల్బమ్‌ను రూపొందించింది. ఆమెమాట్లాడుతూ ‘కొన్నేళ్లుగా నేను కవిత్వాన్ని రాస్తున్నా. నన్ను కవిత్వం రాసే దిశగా నాన్నగారు ఎంతగానో ప్రోత్సహించారు. సాధారణ జీవితంలో కూడా నేను కవితాత్మక ధోరణిలో మాట్లాడటానికే ఎక్కువగా ఇష్టపడతాను. ఎందుకంటే మనం రొటీన్‌గా చెప్పే మాటలన్నీ నాకు బోర్‌గా అనిపిస్తాయి. ఆశావాద దృక్పథంతో జీవితాన్ని సాగించాలనే సందేశాన్ని అందిస్తూ ‘ఎడ్జ్’ ఆల్బమ్ తయారుచేశా. సంతోషం, ప్రేమ, దుఃఖం తాలూకు భావోద్వేగాల గాఢతను పరిపూర్ణంగా ఫీల్ అయితేనే మన మనసులో స్వచ్ఛత వెల్లివిరిస్తుంది. త్వరలో మరో ఆల్బమ్‌ను రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం శృతిహాసన్ తెలుగులో రవితేజ సరసన ‘క్రాక్’ అనే చిత్రంలో నటిస్తోంది.
ఏకాంతమే ఈ కాంతకు ఇష్టం…
Related tags :