Politics

హైదరాబాద్ అభివృద్ధి చేసింది కాంగ్రెస్!

Uttam Kumar Reddy Claims Hyderabad Development Is Congress Party's

వరద సాయం పంపిణీలో తెరాస నేతలు అవినీతికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీయే అని పునరుద్ఘాటించారు. మెట్రో రైలు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే, కృష్ణా జలాలు ఇలా.. ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు. కరోనాతో ప్రజలు చనిపోతున్నా.. ఆ వ్యాధిని ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చలేదని విమర్శించారు. వరదలతో జనం బాధలు పడుతుంటే సీఎం కేసీఆర్‌ కనీసం వాళ్లను పరామర్శించలేదని ఆరోపించారు. ఇప్పటివరకు కేంద్రం ఒక్కరూపాయి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. ఐటీ రీజియన్‌ రద్దయితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, లక్ష్మణ్ అడగలేదని.. ఇవన్నీ తెలియని భాజపా నేతలు అర్ధరాత్రి దొంగల్లా తమ పార్టీ నాయకుల ఇంటి చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు భాజపాకు లేదన్నారు. పార్లమెంట్‌లో అన్ని విషయాల్లో భాజపాకు తెరాస మద్దతు పలికిందన్నారు. దేశవ్యాప్తంగా భాజపాకు మద్దతు పలికేందుకు ఎంఐఎం రాజకీయాలు చేస్తోందని ఉత్తమ్‌ ఆరోపించారు.