రైలు స్టేషన్‌కు సమీపిస్తోన్న సమయంలో, ఓ మహిళను పట్టాలపైకి తోసివేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన వ్యక్తిని న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన అమెరికా పోలీసులు.. పూర్తి దర్యాప్తు చేపట్టారు. ఈ చర్యకు పాల్పడింది భారత్‌కు చెందిన ఆదిత్య వేములపాటి(24)గా గుర్తించారు.
నగరంలోని యూనియన్ స్క్వేర్ సబ్‌వే స్టేషన్‌లో ఓ అమెరికన్ మహిళ రైలు కోసం వేచి చూస్తోంది. రైలు సమీపిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఆదిత్య ఆ మహిళను ఒక్కసారిగా ట్రాక్ మీదకు తోసేశాడు. వెంటనే అప్రమత్తమైన మహిళ, పట్టాలపై నుంచి బయటపడింది. కొద్దిసేపు రెండు ట్రాక్‌ల మధ్యే ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు బాధిత మహిళను ఆసుపత్రికి తరలించి, అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా దృశ్యాలు స్టేషనల్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే ఆ యువకుడు మహిళను పట్టాలపైకి తోసివేసినట్లు న్యూయార్క్ పోలీసులు అనుమానించారు. అయితే, ఆదిత్యను ప్రశ్నించిన అనంతరం, అతను తీవ్ర మానసిక ఒత్తిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా డిసెంబర్ 4వరకు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశించింది.