NRI-NRT

బ్యాలెట్ బ్యాటిల్ ఆపని ట్రంప్

Donald Trump Still Fighting For Win Against Battles

పోస్టల్‌ బ్యాలెట్లను రద్దు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని యూఎస్‌ మిడిల్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ పెన్సిల్వేనియా కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఊహాజనిత ఆరోపణలు చేశారని, ఇందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదని జడ్జి మ్యాథ్యూ బ్రాన్‌ పేర్కొన్నారు. వాదనల్లో ఒత్తిడి కనిపిస్తోందని, ఎలాంటి పసలేదని తెలిపారు. ఇక్కడ బైడెన్‌ 81వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఓట్లన్నింటినీ రద్దు చేయాలన్నట్టుగా వాదనలు వినిపించారని జడ్జి పేర్కొన్నారు. ఇంత భారీయెత్తున అక్రమాలు జరిగి ఉంటే అందుకుతగ్గ ఆధారాలు ఉండాలి కదా అని వ్యాఖ్యానించారు. ఒక్క ఓటును కూడా రద్దు చేయడానికి అధికారాలు లేవని చెప్పారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని ట్రంప్‌ తరఫు న్యాయవాదులు తెలిపారు. కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల్లో బైడెన్‌ గెలిచారంటూ ధ్రువపత్రం ఇచ్చే అవకాశం ఆ రాష్ట్ర అధికారులకు కలిగింది. జార్జియాలో ఓట్లను తిరిగి లెక్కించాలని కోరుతూ ట్రంప్‌ దరఖాస్తు చేశారు. తొలుత ఇక్కడ ఓట్ల లెక్కింపు జరిపినప్పుడు డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌కు దాదాపు 14వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. దాంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే రీకౌంటింగ్‌కు ఆదేశించి మొత్తం 50 లక్షల ఓట్లను చేతితో లెక్కించేలా ఏర్పాట్లు చేసింది. ఓట్ల ఆడిటింగ్‌గా పిలిచే ఈ ప్రక్రియలో బైడెన్‌కు 12,284 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయినా సంతృప్తి చెందని ట్రంప్‌ ఇంకోసారి ఓట్లను లెక్కించాలని కోరుతున్నారు. సంతకాలు సరిపోకపోతే ఆ ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలని డిమాండు చేసున్నారు. ఒకవేళ రీకౌంటింగ్‌కు అనుమతి ఇస్తే పోలయిన ఓట్లన్నింటినీ మరోసారి స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రం ట్రంప్‌ పార్టీ అయిన రిపబ్లికన్‌ ఆధీనంలో ఉంది.