సింగపూర్ తెలుగు సమాజం 45వ ఆవిర్భావ దినోత్సవం మరియు దీపావళి పండుగ 2020 వేడుకలు ఘనంగా జరిగాయి.
ప్రపంచంలోనే భారతదేశం వెలుపల తెలుగు వారి కోసమే స్థాపించబడిన అతి కొద్ది ప్రాచీన సంస్థలలో ఒక్కటైన సింగపూర్ తెలుగు సమాజం ఎప్పటికప్పుడు నూతన జవసత్వాలను కూడగట్టుకొంటూ, దిన దిన ప్రవర్ధమానం గా విరాజిల్లుతూ 46వ వసంతం లోనికి అడుగు పెడుతున్న శుభసందర్భంగా “సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భాదినోత్సవం” కార్యక్రమాన్నిఅట్టహాసం గా నిర్వహించారు. గాన గంధర్వుడు కీ.శే.పద్మ భూషణ్ బాల సుబ్రహ్మణ్యం గారికి ఘన నివాళి,నాట్యమయూరి కీ.శే. పద్మశ్రీ శోభా నాయుడు గారికి స్మృతి నివాళి అర్పిస్తూ అంతర్జాల వేదికపై నిర్వహించిన కార్యక్రమమే సింగపూర్ తెలుగు సమాజం – 45వ ఆవిర్భావ దినోత్సవం మరియు దీపావళి వేడుకలు 2020.
ఆద్యంతం తెలుగుదనం, తెలుగు కళలు, సాహిత్యం ఉట్టిపడుతూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు మూడు తరాల ఆహుతులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమానికి హాజరైన సమాజ పెద్దలు అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకొని ఆ అనుభవాలను అందరితో పంచుకొన్నారు. అంతేకాకుండా 45 వసంతాల సమాజ ప్రస్థానాన్ని , మధురానుభూతులను , గత సంవత్సర కాలంలో సమాజం నిర్వహించిన కార్యక్రమాలను బుర్రకధ రూపకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఆన్-లైన్ లో 3000 మంది ప్రేక్షకులు వీక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధి గారి సందేశం,పూర్వపు కార్యనిర్వాహక సభ్యుల ఉపన్యాసాలు,”చెప్పుకోండి చూద్దాం” పోటీ కి సింగపూర్ మరియు ఇతర దేశాల నుండి వచ్చిన స్పందన,పాడిన పాటలు,రాజు గారి కామిడీ,బుర్రకథలు ప్రత్యేక ఆకర్షణ గ నిలిచాయి.
తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు గాయకులు ప్రవీణ్ కుమార్ కొప్పోలు గారికి, గాయని సత్య గారికి, మిమిక్రీ రాజు గారికి, యాంకర్ నవత గారికి, బుర్రకథ విజయకుమార్ గారి బృందానికి , ఆర్కెస్ట్రా వెంకటేష్ గారి బృందానికి,
తమ బిజీ షెడ్యూల్ లో కొంత విలువైన సమయాన్ని వెచ్చించి, అమూల్యమైన సందేశం అందించిన ఇండియన్ హై కమీషనర్ ఇన్ సింగపూర్ His Excellency: పి. కుమరన్ గారికి సింగపూర్ తెలుగు సమాజం వారు ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ ఫ్లైట్స్ విషయంలో వారు చేసిన సహాయసహకారాలకి సింగపూర్ తెలుగు సమాజం ప్రెసిడెంట్ శ్రీ కోటి రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేసారు. తెలుగు సమాజ కీర్తిని,ప్రజలకి మెరుగైన సేవల్ని అత్యున్నత స్థాయిలో ఇవ్వటానికి తమ కమిటీ నిరంతరం శ్రమిస్తున్నదని తెలిపారు. సింగపూర్ లో ఉండే తెలుగు వారందరూ సమాజ సభ్యులుగా చేరాలని , ఎల్లప్పుడూ కలసికట్టుగా ఉండాలని , తెలుగు భవన నిర్మాణ కలను సాకారం చేసుకొనే దిశగా అందరూ తప్పకుండా సహాయ సహకారాలందించాలని విజ్ఞప్తి చేశారు.
STS పూర్వ కార్యదర్శులు మరియు కోశాధికారులు 45 ఏళ్లుగా సమాజంతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ సందేశాలు పంపినందుకు, కార్యక్రమానికి మా వెన్నంటి ఉన్న స్పాన్సర్లు శుభోదయం గ్రూప్ వారికి, లగ్జరీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారికి మరియు హమారా బజార్ వారికి సెక్రటరీ సత్య చిర్ల గారు ధన్యవాదాలు తెలిపారు.
రమ్య బెహెరా పాడిన అమ్మవారి పాటను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించిన శుభోదయం మీడియా వారికి, ఈ కార్యక్రమం విజయవంతం అవటానికి కృషి చేసిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గ సభ్యులకి,కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి కార్యక్రమ నిర్వాహకురాలు కురిచేటి స్వాతి గారు కృతఙ్ఞతలు తెలియజేసారు