బల్దియా ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు కమలదళం సిద్ధమవుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వచ్చి వెళ్లగా.. మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బుధవారం ప్రచారం చేయనున్నారు. ఈ నెల 27, 28, 29.. ప్రచారంలో కీలకమైన చివరి మూడు రోజులు కావడంతో జాతీయస్థాయి అగ్రనేతలను భాజపా హైదరాబాద్‌కు రప్పిస్తోంది. అగ్రనేతలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల పర్యటనకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని మంగళవారం భాజపా ముఖ్యనేతలు నిర్వహించారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, మురళీధర్‌రావులు పాల్గొన్నారు. అగ్రనేతలు పర్యటించే తేదీలు, ప్రాంతాలపై సమావేశంలో చర్చ సాగింది. ముగ్గురు అగ్రనేతలతో నగరంలోని మూడు ప్రాంతాల్లో రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించాలని భాజపా రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అమిత్‌షా కార్యక్రమం బాధ్యతలు కిషన్‌రెడ్డికి, జేపీ నడ్డా పర్యటన బాధ్యతలను మురళీధర్‌రావుకు, యోగి ఆదిత్యనాథ్ పర్యటన బాధ్యతలను లక్ష్మణ్‌కు అప్పగించినట్లు సమాచారం. అగ్రనేతల పర్యటనపై పూర్తి స్పష్టత బుధవారం రానుంది. ఇక మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ బుధ, గురువారాల్లో (25, 26 తేదీల్లో) ప్రచారం నిర్వహించనున్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో విజయంతో గ్రేటర్ హైదరాబాద్‌లో బలం పెంచుకునేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. అమిత్ షా సన్నిహితుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్రయాదవ్‌ను ఇన్‌ఛార్జిగా, మరో నలుగురు నేతలను సహఇన్‌ఛార్జిలుగా జాతీయ నాయకత్వం హైదరాబాద్‌కు పంపింది.
GHMC ప్రచారానికి అమిత్ షా
Related tags :