Business

భారతీయులకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ-వాణిజ్యం

భారతీయులకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ-వాణిజ్యం

* దేశీయ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దిగ్గజ షేర్లలో కొనుగోళ్ల అండతో బుధవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు దూకుడుగా ప్రారంభించాయి. 200 పాయింట్ల లాభంతో మొదలైన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ ఒక దశలో 300 పాయింట్లకు పైగా దూసుకెళ్లి సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా రికార్డు స్థాయిలో 13,100 మార్క్‌ పైన ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 182 పాయింట్ల లాభంతో 44,705 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 13,110 వద్ద కొనసాగుతున్నాయి.

* గూగుల్‌ పే ప్లాట్‌ఫాం నుంచి చేసే మనీ ట్రాన్స్‌ఫర్‌కు అదనపు రుసుం చెల్లింపులపై వస్తోన్న వార్తలపై ఆ సంస్థ స్పష్టతనిచ్చింది. అది కేవలం అమెరికన్‌ యూజర్లకు మాత్రమేనని.. భారత్‌లో వినియోగదారులు ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేదని స్పష్టంచేసింది. సరికొత్త ఫీచర్లతో గూగుల్‌ పే యాప్‌ను విడుదల చేస్తున్నట్లు ఈ మధ్యే గూగుల్‌ వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే ప్రయోగాత్మకంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సమయంలో గూగుల్‌ పే యాప్‌ నుంచి చేసే తక్షణ మనీ ట్రాన్స్‌ఫర్‌కు అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. తాజాగా దీనిపై గూగుల్‌ స్పష్టతనిచ్చింది. అది కేవలం అమెరికా వినియోగదారులకు మాత్రమేని తేల్చి చెప్పింది. భారత్‌లోని గూగుల్‌ పే, గూగుల్‌ పే-బిజినెస్‌ వినియోగదారులు ఈ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. అయితే, నూతన సంవత్సరం నుంచి అమెరికాలో వెబ్‌ ఆధారిత గూగుల్‌ పే ఉండదని.. కేవలం యాప్‌లో మాత్రమే చెల్లింపులు చేయాలని తెలిపింది.

* మీ ఇంట్లో ల్యాండ్‌ ఫోనుందా? దాని నుంచి మొబైల్‌ నంబర్లకు ఎక్కువగా కాల్స్‌ చేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే! వచ్చే ఏడాది జనవరి 15 నుంచి మొబైల్స్‌కు కాల్స్‌ చేసేటప్పుడు మరో అంకె జోడించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పది అంకెల ముందు ‘0’ను కలపాల్సి ఉంటుంది. డయలింగ్‌ ప్యాట్రన్‌‌ మార్చడం వల్ల భవిష్యత్తు అవసరాల కోసం 2,539 మిలియన్ల నంబర్లు అదనంగా లభించనున్నాయి. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్స్‌ విభాగం వివరాలు వెల్లడించింది. అయితే ల్యాండ్‌ లైన్‌ నుంచి ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ నుంచి ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ టు మొబైల్‌కు కాల్స్‌ చేసేటప్పుడు ‘0’ యాడ్‌ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సున్నా జోడించకుండా ఎవరైనా ల్యాండ్‌ నుంచి మొబైల్‌కు కాల్‌ చేస్తే… ఆ విషయాన్ని సూచిస్తూ ఓ అనౌన్స్‌మెంట్‌ వినిపిస్తుందట. అంటే జనవరి 15 నుంచి మొబైల్‌ నెంబరు 11 అంకెలు ఉంటాయి. అదీనూ ల్యాండ్‌లైన్‌ నుంచి కాల్‌ చేస్తే మాత్రమే.

* అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు బెంబేలెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో ఉత్సాహంగా కొత్త రికార్డులకు ఎగిసిన సూచీలు.. అమాంతం కుప్పకూలాయి. ఫలితంగా ఒక్క రోజులో రూ. 2లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. మదుపర్ల లాభాల స్వీకరణతో బుధవారం నాటి మార్కెట్లో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ ఏకంగా 695 పాయింట్లు పతనమవగా.. నిఫ్టీ 13వేల మార్క్‌ కిందకు పడిపోయింది.

* కొవిడ్‌ భారత్‌లో సరికొత్త యూనికార్న్‌ స్టార్టప్‌ను సృష్టించింది. దిల్లీకి చెందిన ‘కార్స్‌24’ సంస్థ దాదాపు బిలియన్‌ డాలర్ల విలువను సొంతం చేసుకొంది. ఈ సంస్థ సెకండ్‌ హ్యాండ్‌ కార్లను విక్రయిస్తుంటుంది. కొవిడ్‌ మహమ్మారి విజృంభించడంతో దేశీయంగా సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు డిమాండ్‌ పెరిగింది. ప్రజలు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టుకు ప్రత్యామ్నాయ మార్గంగా సెకండ్‌ హ్యాండ్‌ కార్లను ఎంచుకోవడంతో కార్స్‌24కు డిమాండ్‌ పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి సెకండ్‌ హ్యాండ్‌ కార్ల విక్రయాల్లో దాదాపు 20శాతం పెరుగుదల కనిపించింది. ‘‘ఇప్పటి వరకు కార్లు లేని వారు కూడా సొంత వాహనాలపై దృష్టి సారించారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. బైకులు ఉన్న వారు కూడా కార్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. సెకండ్‌ హ్యాండ్‌ కార్లు, బైకుల మార్కెట్‌ ’’ అని సంస్థ సీఈవో విక్రమ్‌ చోప్రా పేర్కొన్నారు.

* మైనారిటీ వాటాదార్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో భారత స్కోరు ఇటీవలి తగ్గిందని.. ఈ విషయంలో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకుల్లో భాగంగా ఈ స్కోరు వెల్లడైంది. స్వల్పకాల ప్రయోజనాలకు బదులుగా దీర్ఘకాల వ్యూహాలను రచించి మదుపర్లను క్యాపిటల్‌ మార్కెట్ల వైపు ఆకర్షించి, వారు కొనసాగేలా చూడాల్సిన బాధ్యత బ్రోకర్లపైనే ఉందని బీబీఎఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అదనపు కార్యదర్శి ఆనంద్‌ మోహన్‌ బజాజ్‌ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో బ్రోకరేజీ సంస్థలు డిఫాల్ట్‌ అయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం. మైనారిటీ వాటాదార్లను రక్షించడంలో భారత ర్యాంకు గతేడాది 7గా ఉండగా.. 2020 నివేదికలో 13వ స్థానానికి పడిపోయింది. ‘మైనారిటీ వాటాదార్ల ప్రయోజనాలను కాపాడడంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ ఎపుడూ పైనే ఉంటుంది. ఇటీవల కాస్త వెనకబడింది. ఈ నేపథ్యంలో మన సాంకేతికత, ఫిన్‌టెక్‌, ఇతర రకాల సమాచారం ఆధారంగా తిరిగి వారి ప్రయోజనాలను కాపాడడంలో పునరంకితమవుదామ’ని బ్రోకరేజీ సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. అన్ని బ్రోకరేజీ పనులు డిజిటలీకరణ అవుతున్నందున, దశాబ్దం తర్వాత బ్రోకరేజీ పరిశ్రమ భవితవ్యంపై ఇదే కార్యక్రమంలో పాల్గొన్న జెరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్‌ కామత్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

* ద గేట్‌ అకాడమీ(టీజీఏ)ని ఆన్‌లైన్‌లో ఉన్నత విద్య అందించే కంపెనీ అప్‌గ్రేడ్‌ కొనుగోలు చేసింది. ఎంత విలువకు కొనుగోలు చేసింది బయటకు వెల్లడి కాలేదు. తాజా అడుగుతో దేశంలో రూ.40,000 కోట్ల పరీక్ష సన్నద్ధత మార్కెట్లో కంపెనీ బలోపేతం కానుంది. పరీక్ష సన్నద్ధత వ్యాపారంలో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టాలని అప్‌గ్రేడ్‌ భావిస్తోంది. పలు భాషల్లో 20,000 గంటల కంటెంట్‌ను అభివృద్ధి చేయనుంది. తద్వారా ఏటా 10 లక్షల మందికి సేవలందించాలని భావిస్తోంది. బెంగళూరుకు చెందిన టీజీఏకు దేశవ్యాప్తంగా 57 కోచింగ్‌ సెంటర్లు ఉన్నాయి. గేట్‌, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరీక్షల కోసం ఈ సంస్థ సిద్ధం చేసిన వీడియోలను దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు 7.6 కోట్ల గంటల పాటు చూశారు.

* భారత బ్యాంకింగ్‌ రంగంలో నిరర్థక ఆస్తులు పెరుగుతాయని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేస్తోంది. రాబోయే 12-18 నెలల్లో స్థూల రుణాల్లో 11 శాతం వరకు మొండి బకాయిలుగా మారొచ్చని పేర్కొంది. ‘ఈ ఏడాదిలో మొత్తం రుణాలు, నిరర్థక రుణాల (ఎన్‌పీఎల్‌)కు మధ్య నిష్పత్తి తగ్గుతూ వచ్చింది. అయితే భవిష్యత్‌లో ఇదే తీరును కొనసాగించడంలో బ్యాంకులకు ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఆరు నెలల రుణ మారటోరియం కారణంగా మా అంచనాల కంటే మిన్నగా రెండో త్రైమాసికంలో బ్యాంకులు రాణించాయ’ని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ క్రెడిట్‌ అనలిస్ట దీపాలి సేథ్‌ చాబ్రియా పేర్కొన్నారు. ఎస్‌ అండ్‌ పీ ఇతర అంచనాలు…..ఆగస్టు 31, 2020తో మారటోరియం గడువు ముగియడంతో జూన్‌ 30, 2020న 8 శాతంగా ఉన్న ఎన్‌పీఎల్‌ నిష్పత్తి వచ్చే 12-18 నెలల్లో 10-11 శాతానికి పెరగొచ్చు.