Agriculture

వరి రైతులపై పిడుగు…నివర్ తుఫాను!

1000Cr Gone In Andhra Due To Nivar Cyclone

నివర్‌ తుపాను రాష్ట్రంలోని 10 జిల్లాలపై ప్రభావం చూపింది. వ్యవసాయ, ఉద్యానశాఖల పరిధిలో సుమారు 5 లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1,004 కోట్ల పంటనష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరి పైరు నీట మునగడంతోపాటు.. నేల కరవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. భారీవర్షాలు కొనసాగుతుండటం, వరదలు ముంచెత్తడంతో నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఖరీఫ్‌ ఆరంభం నుంచి కురుస్తున్న భారీవర్షాలు, ముంచెత్తుతున్న వరదలతో 20 లక్షల ఎకరాల వరకు పంటలు దెబ్బతిని రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. ప్రస్తుత భారీ వర్షం మరోసారి వారి ఆశల్ని తుంచేసింది. గుంటూరు జిల్లాలో వ్యవసాయ పంటనష్టం అధికంగా ఉంది. ఇక్కడ 2.60 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలోనూ 70 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. ప్రకాశంలో అధికంగా 3,625 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం తలెత్తింది. ప్రస్తుతం ఖరీఫ్‌, రబీలకు సంబంధించి 8 జిల్లాల్లో 47.73 లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయి. ఇందులో 38 లక్షల ఎకరాల వరకు ఖరీఫ్‌ పంటలే సాగవుతున్నాయి. ఇందులో 13.59 లక్షల వరకు వరి ఉండగా.. అధికశాతం కోత దశకు చేరింది. ప్రాథమిక అంచనా ప్రకారం 4.29 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో గుంటూరు జిల్లాలో 2.57 లక్షల ఎకరాలు, కృష్ణా జిల్లాలో 70వేలు, తూర్పుగోదావరి 31వేలు, విశాఖపట్నం 16,300, చిత్తూరు జిల్లాలో 19వేలు, నెల్లూరు 17,900 ఎకరాల వరకు ఉండటం గమనార్హం. విజయనగరం, కడప, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వరి దెబ్బతింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 7వేల ఎకరాల్లో వరి నారుమళ్లు నీట మునిగాయి. గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో వరి కోత దశలో ఉంది. ఈ దశలో ఎడతెరపి లేకుండా రెండు రోజులుగా వానలు కురుస్తుండటంతో పైరు నేల వాలింది. కోత కోసిన ఓదెలు నీటిలో తేలుతున్నాయి. పొలాల్లోకి నీరు చేరడంతో కోతలూ నిలిచిపోయాయి. ఇప్పటికే కోసిన వరి ఓదెలపై నీరు చేరింది.