* కరోనా వ్యాప్తితో ఎడ్యూటెక్ స్టార్టప్‌ల విలువ రేసుగుర్రాలను తలపిస్తోంది. మూడు నెలల క్రితమే 150 మిలియన్ డాలర్ల నిధులను సేకరించిన సమయంలో ఎడ్యూటెక్ స్టార్టప్ ‘అన్అకాడమీ’ విలువను 1.45 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. తాజాగా మరో విడత నిధుల సేకరణను మొదలు పెట్టిన ఈ సంస్థ భారీ విలువను సొంతం చేసుకొంది. ఈ విడతలో టైగర్ గ్లోబల్, డ్రాగనీర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్‌ల నుంచి వీటిని పొందనుంది. ఈ క్రమంలో కంపెనీ విలువను 2 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. పెట్టుబడి వివరాలు మాత్రం బయటకు రాలేదు.
* లాభాల స్వీకరణతో క్రితం సెషన్లో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు గురువారం బలంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల అండతో నవంబరు డెరివేటివ్ సిరీస్‌ను లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 13వేల మార్క్‌కు చేరువైంది.
* కరోనా మహమ్మారి ప్రభావం నుంచి దేశ ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే ఎక్కువగానే పుంజుకుంటుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అయితే, పండుగల సీజన్ ముగిసిన వేళ.. ఈ కొనుగోలు శక్తి స్థిరత్వంపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫారెన్ ఎక్స్ఛేంజి డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రపంచదేశాల మాదిరిగానే భారత్ కూడా ఆర్థికవృద్ధి క్షీణతను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
* అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కరోనా వైరస్ వ్యాప్తితీవ్రత కారణంగా ఈ నిషేధం డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే, కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదని సంస్థ తెలిపింది. కాగా, ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో మాత్రమే.. ప్రతి ఒక్క సందర్భం, పరిస్థితిని పరీశీలించిన తర్వాతే విమాన సర్వీసులను అనుమతిస్తామని డీజీసీఏ వివరించింది. అంతర్జాతీయ విమానయానం, వీసా నిబంధనలకు సంబంధించి నవంబర్ 30 వరకు ఉన్న నిషేధాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించామని డీజీసీఏ తెలిపింది.
* సరికొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) ప్రాజెక్టులకు సంబంధించి, 2004-15 మధ్య కాలంలో భారత్ నాలుగో స్థానం దక్కించుకుని సత్తా చాటిందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ తమ పరిశోధనా పత్రంలో పేర్కొంది. విలీనాలు-కొనుగోళ్లలో (ఎంఅండ్ఏ) 8వ స్థానంలో నిలిచిందని తెలిపింది. ‘ఫ్యూచర్ ఆప్ రీజనల్ కోఆపరేషన్ ఇన్ ఏషియా అండ్ పసిఫిక్’ పేరుతో రూపొందించిన ఈ పత్రంలో పలు అంశాలను ప్రస్తావించింది. 2004-15 మధ్య కాలంలో భారత్‌కు 8,004 గ్రీన్‌ఫీల్డ్ ఎప్డీఐ ప్రాజెక్టులు లభించాయని అందులో తెలిపింది. అలాగే 4,918 విలీనాలు-కొనుగోళ్లు జరిగినట్లు పేర్కొంది. ఏడీబీ వెబ్సైట్లో ప్రచురించిన పత్రం ప్రకారం, సమీక్షా కాలంలో అత్యధికంగా గ్రీన్‌ఫీల్డ్ ఎఫ్‌డీఐ ప్రాజెక్టుల్ని అమెరికా దక్కించుకుంది. చైనా, యూకే తరవాత స్థానాల్లో ఉన్నాయి. మొత్తం గ్రీన్‌ఫీల్డ్ ఎఫ్‌డీఐ ప్రాజెక్టుల్లో 10 శాతం (13,308) అమెరికాకే దక్కడం విశేషం. వర్ధమాన దేశాల్లో ప్యూపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ), భారత్, రష్యన్ ఫెడరేషన్, బ్రెజిల్, మెక్సికో, వియత్నాం, రొమేనియా, థాయ్‌ల్యాండ్, మలేషియాలు పెద్ద మొత్తంలో గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడులను దక్కించుకున్నాయి. పీఆర్సీ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, భారత్ కూడా వచ్చే కొన్ని దశాబ్దాల్లో ఈ ఘనత సాధిస్తుందని పరిశోధన పత్రం వెల్లడించింది.