Food

ధనియాల కషాయం ప్రయత్నించారా?

ధనియాల కషాయం ప్రయత్నించారా?

జలుబు, జ్వరం, దగ్గు లాంటి సమస్యల్ని నివారించాలంటే… మాత్రలే వేసుకోవాలని లేదు. ఈ వైద్యం ప్రయత్నించి చూడండి. సమస్యలు తగ్గుతాయి. దుష్ప్రభావాలూ ఎదురుకావు.
*దగ్గు
గుప్పెడు తులసి ఆకుల్ని మెత్తగా నూరి రసం తీసుకోవాలి. మూడు చెంచాల రసంలో చెంచా తేనె కలిపి చప్పరించాలి. కరక్కాయ ముక్కను బుగ్గన ఉంచుకుని చప్పరించినా ఫలితం ఉంటుంది. రెండుకప్పుల కిస్‌మిస్‌లను ఓ కప్పులో తీసుకుని అవి మునిగేలా నీళ్లు పోయాలి. అవి బాగా నానాక ముద్దలా చేసుకోవాలి. దీనికి సమానంగా చక్కెర కలిపి ఉడికించాలి. హల్వాలా తయారయ్యాక సీసాలో భద్రపరుచుకోవాలి. దగ్గు వస్తున్నప్పుడు చిన్న ఉండలా చేసుకుని చప్పరించి చూడండి.
*జలుబు
ఒకటిన్నర చెంచాల మిరియాలను పొడిచేయాలి. కప్పు నీటిలో ఆ పొడివేసి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు సగం అయ్యాక వడబోసి కొద్దిగా బెల్లం పొడి కలిపి వేడివేడిగా తాగితే చాలు. జలుబు నుంచి ఉపశమనం ఉంటుంది.
*అజీర్ణం-అతిసారం
మూడు చెంచాల వాము నల్లగా అయ్యేలా వేయించి దానికి గ్లాసు నీరు కలిపి పొయ్యిమీద పెట్టాలి. నీరు సగం అయ్యాక దింపేసి వడబోయాలి. దీన్ని వేడివేడిగా తాగితే అజీర్ణం, అతిసారం తగ్గుతాయి. ఐదారు దానిమ్మ తొక్కలని ఎండబెట్టాలి. కప్పు నీటిలో ఈ తొక్కలు వేసి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు సగం అయ్యాక దింపేయాలి. ఈ కషాయాన్ని కొద్దికొద్దిగా మూడు పూటలా తాగితే అజీర్ణం, అతిసారం తగ్గుముఖం పడతాయి.
*జ్వరం
ఈ కాలంలో ఇది సర్వసాధారణమైన సమస్య. దీన్ని అదుపులో ఉంచాలంటే… రెండు చెంచాల ధనియాలు వేయించాలి. దీనికి కప్పు నీరు చేర్చి పొయ్యిమీద పెట్టాలి. ఆ నీళ్లు మరిగి, కషాయంలా తయారయ్యాక దింపేయాలి. వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ప్రతి నాలుగు గంటలకోసారి కొద్దికొద్దిగా తాగితే ఉపశమనం ఉంటుంది. నేలవేము మొక్కను శుభ్రంగా కడిగి రసం తీసుకుని కొద్దికొద్దిగా తీసుకున్నా వైరల్‌ జ్వరాలు తగ్గుతాయి. తిప్పతీగని నీటిలో మరిగించి కషాయం చేసుకుని చెంచా చొప్పున తీసుకోవాలి. కప్పు నీటిలో గుప్పెడు తులసి ఆకులు వేసి కాచి వేడిగా ఉండగానే తేనె కలిపి తాగినా జ్వరం అదుపులో ఉంటుంది.