Business

రష్యా టీకా ఉత్పత్తి చేయనున్న హెటిరో-వాణిజ్యం

Business News - Hetero To Manufacture Russian COVID Vaccine

* టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) వృద్ధి దృక్పథాన్ని ఫకీర్‌ చంద్‌ కోహ్లియే నిర్వచించారని టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా ప్రస్తుతించారు. ఐటీ పితామహుడైన కోహ్లీ గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ‘టీసీఎస్‌ వ్యవస్థాపక రోజుల నుంచీ ఆయన ఆధ్వర్యంలోనే నడిచింది. కంపెనీకి ప్రారంభ సంవత్సరాల్లో మార్గనిర్దేశనం చేశారు. వృద్ధికి బాటలు ఎలా వేయాలో నిర్వచించారు. టీసీఎస్‌ ఇలా అత్యద్భుతంగా విజయవంతం కావడంలో ఆయన దృక్పథం, పాత్ర చాలా కీలకమైనవ’ని రతన్‌ టాటా పేర్కొన్నారు.

* దేశంలో ఇంధన ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత తొమ్మిది రోజుల్లో ఎనిమిది సార్లు పెరగడంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.82 దాటేసింది. డీజిల్‌ ధర కూడా రూ. 72 పైకి చేరింది. శనివారం పెట్రోల్‌ ధర లీటర్‌పై 24 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. దీంతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 82.13, డీజిల్‌ ధర రూ.72.13గా ఉంది. ఈ 9 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 1.07, డీజిల్‌పై రూ. 1.67 పెరగడం గమనార్హం.

* రష్యా అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా ‘స్పుత్నిక్‌ వి’ తయారీని హైదరాబాద్‌కు చెందిన హెటిరో గ్రూపు సంస్థ అయిన హెటిరో బయోఫార్మా చేపట్టనుంది. ఈ మేరకు ఆర్‌డీఐఎఫ్‌ (రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌), హెటిరో గ్రూపుల మధ్య ఒప్పందం కుదిరింది. ఏటా 10 కోట్ల డోసుల స్పుత్నిక్‌ వి టీకా తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు హెటిరో గ్రూపు శుక్రవారం వెల్లడించింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి టీకా తయారీ మొదలు పెట్టనున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు నిర్వహించిన క్లినికల్‌ పరీక్షల్లో ‘స్పుత్నిక్‌ వి’ టీకా 90 శాతానికి పైగా సామర్థ్యం కనబరచినట్లు ఆర్‌డీఐఎఫ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ టీకాపై ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ పరీక్షలు బైలారస్‌, యూఏఈ, వెనెజులా, మరికొన్ని దేశాల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల నుంచి 120 కోట్ల డోసుల టీకా సరఫరా చేయాల్సిందిగా ఆర్‌డీఐఎఫ్‌కు విజ్ఞప్తులు వచ్చాయి. దీనికి తగ్గట్లుగా మనదేశంతో పాటు, బ్రెజిల్‌, చైనా, దక్షిణ కొరియా దేశాల్లోని తయారీదార్లతో ఆర్‌డీఐఎఫ్‌ ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా హెటిరో గ్రూపుతో తయారీ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. మనదేశంలో కొవిడ్‌-19 టీకా తయారైతేనే ప్రజలకు త్వరగా అందుబాటులోకి వస్తుందని, అందుకు తాము సన్నద్ధం అవుతున్నట్లు హెటిరో ల్యాబ్స్‌ డైరెక్టర్‌ మురళీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్పుత్నిక్‌ వి టీకాపై మనదేశంలో జరుగుతున్న క్లినికల్‌ పరీక్షల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని అన్నారు.

* భారీ ఆఫర్లతో శుక్రవారం నుంచి నిర్వహిస్తున్న బ్లాక్‌ఫ్రైడే అమ్మకాలు ఆదివారం (ఈనెల 29) వరకు కొనసాగుతాయని స్పెన్సర్స్‌ రిటైల్‌ తెలిపింది. 1500 రకాల ఉత్పత్తులపై 50 శాతం అంతకన్నా అధిక రాయితీ ఇస్తున్నామని, దేశవ్యాప్తంగా 160 విక్రయశాలల్లో ఈ విక్రయాలు సాగుతున్నాయని పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై రూ.750 వరకు నగదు వెనక్కి లభిస్తుందని వివరించింది. విక్రయశాలలు, ఆన్‌లైన్‌, ఫోన్‌ డెలివరీ సదుపాయాలకు ఈ భారీ ఆఫర్లు వర్తిస్తాయని స్పెన్సర్స్‌ రిటైల్‌ అండ్‌ నేచర్‌ బాస్కెట్‌ సీఈఓ దేవేంద్ర చావ్లా వెల్లడించారు.