Fashion

జిడ్డుచర్మానికి ఉప్పునీటి చిట్కాలు

జిడ్డుచర్మానికి ఉప్పునీటి చిట్కాలు

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరి ముఖం ఎప్పుడూ జిడ్డుగా కనిపిస్తుంది. ఆ సమస్యను అదుపులో ఉంచాలంటే…
* ముఖం కడుక్కుంటున్న ప్పుడు మొదట చల్లని నీరే వాడాలి. చర్మంలోని జిడ్డు, మురికిని తొలగించడంలో ఇదెంతో మేలు చేస్తుంది. ఆ తరువాత గోరువెచ్చని నీటితో మరోసారి కడిగి, పొడి వస్త్రంతో అద్దినట్లు తుడుచుకోవాలి. ఆ వెంటనే చల్లని నీటిని ముఖంపై చల్లుకుంటే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇలా రోజులో రెండుసార్లు చేయగలిగితే ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
* చర్మంలోని అధిక నూనెను నియంత్రించాలంటే ఎప్పటికప్పుడు బ్లాటింగ్‌ లేదా టిష్యూ కాగితంతో ముఖాన్ని అద్దుకోవాలి. వెనిగర్‌ లేదా గ్రీన్‌ టీకి గులాబీ నీరు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది టోనర్‌లా పనిచేసి జిడ్డు సమస్యను అదుపులో ఉంచుతుంది.
* వారానికి రెండు లేదా మూడు సార్లు పాలల్లో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకుంటే జిడ్డు సమస్య చాలావరకూ తగ్గుతుంది.
* సెనగపిండి, పెరుగు కలిపి ముఖానికి పూతలా వేయాలి. పదిహేను నిమిషాలయ్యాక శుభ్రం చేస్తే ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోవడమే కాదు… చర్మం తాజాగా మారుతుంది.
***ఉప్పునీరు
మంచినీటిలో కొంచెం ఉప్పు కలిపి దాన్ని స్ప్రే సీసాలో నింపాలి. ముఖాన్ని శుభ్రం చేసుకుని ఈ ఉప్పునీటిని స్ప్రే చేసుకోవాలి. ఈ నీరు చర్మంలోని జిడ్డును నియంత్రిస్తుంది. ఇలా రోజులో రెండు లేదా మూడు సార్లు చేస్తే కొద్ది రోజుల్లోనే ముఖంపై జిడ్డు దూరమవుతుంది.