* ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. టెహ్రాన్‌కు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త మొసిన్ ఫక్రజాదే శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. అయితే తమ శాస్త్రవేత్త హత్య వెనుకు ఇజ్రాయెల్ హస్తముందని ఇరాన్ ఆరోపిస్తోంది. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మొసిన్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్‌కు పరోక్ష హెచ్చరిక చేశారు. ఓ ప్రభుత్వ సమావేశంలో రౌహనీ మాట్లాడుతూ.. ‘మొసిన్ హత్యతో మా అణ్వాయుధ కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరు. శాస్త్రవేత్త హత్యకు సరైన సమయంలో ప్రతిస్పందిస్తాం’ అని చెప్పారు.
* దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 2020 జులై-సెప్టెంబర్ మధ్య ఎఫ్‌డీఐలు 28.1 బిలియన్ డాలర్లకు పెరగడం అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్‌ను గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారనేందుకు సూచికమని పేర్కొన్నారు. 2019, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వీటి విలువ 14.06 బిలియన్ డాలర్లే కావడం గమనార్హం.
* బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ కిశోరీ పెడ్నేకర్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ మండిపడ్డారు. ఆఫీసు కూల్చివేత కేసులో న్యాయస్థానం కంగనకు అనుకూలంగా తీర్చు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును గౌరవిస్తున్నామన్న మేయర్ కిశోరీ పెడ్నేకర్ కంగనను ‘రెండు రకాల స్వభావాలున్న వ్యక్తి’ అని వ్యాఖ్యానించారు. ‘హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ముంబయికి వచ్చి.. ఈ ప్రదేశాన్ని ‘పాక్ ఆక్రమిత భూభాగం’ అనడం పట్ల మేమంతా షాక్ అయ్యాం’ అని చెప్పారు. కంగన ఆ వీడియోను షేర్ చేస్తూ.. ‘గత కొన్ని నెలలుగా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను ఎదుర్కొంటున్న కేసులు, వేధింపులు, అవమానాలు చూస్తుంటే… బాలీవుడ్ మాఫియా, దానికి చెందిన ఆదిత్యా పంచోలీ, హృతిక్ రోషన్ లాంటి వ్యక్తులను మంచివారిగా కనిపిస్తున్నారు’ అంటూ కంగన వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.
* దేశవ్యాప్తంగా మార్పు రావాల్సిన అవసరం ఉందని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు చెప్పారు. 400 ఏళ్లకుపైగా కార్యరూపం దాల్చని అయోధ్య రామమందిర వివాదాన్ని పరిష్కరించుకొని.. ఆలయాన్ని ఇప్పుడు నిర్మించుకుంటున్నామన్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లి నుంచి అల్విన్‌కాలనీ ప్రధాన కూడలి వరకు నిర్వహించిన రోడ్ షోలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. యూపీలో భాజపా 15 లక్షల ఇళ్లను ప్రజలకు ఇచ్చిందని.. మరి ఆరేళ్ల పాలనలో తెరాస ఎన్ని మంజూరు చేసిందో చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆవాస్ యోజన కింద పేదలకు ఎందుకు ఇళ్లు కట్టలేదని ప్రశ్నించారు.
* నాయకుడిగా పవన్‌కల్యాణ్ సొంత పార్టీని స్థాపించి.. భాజపాకు మద్దతు తెలపడం తనకి నచ్చలేదని నటుడు ప్రకాశ్‌రాజ్ విమర్శించిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్, భాజపా గురించి ప్రకాశ్‌రాజ్ పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకాశ్‌రాజ్ చేసిన విమర్శలపై జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయని నాగబాబు అన్నారు. అంతేకాకుండా భాజపా-జనసేన పొత్తు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా తమ సత్తాచాటుతుందని ఆయన పేర్కొన్నారు.
* ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. టెహ్రాన్‌కు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త మొసిన్ ఫక్రజాదే శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. అయితే తమ శాస్త్రవేత్త హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తముందని ఇరాన్ ఆరోపిస్తోంది. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మొసిన్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్‌కు పరోక్ష హెచ్చరిక చేశారు. ఓ ప్రభుత్వ సమావేశంలో రౌహనీ మాట్లాడుతూ.. ‘మొసిన్ హత్యతో మా అణ్వాయుధ కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరు. శాస్త్రవేత్త హత్యకు సరైన సమయంలో ప్రతిస్పందిస్తాం’ అని చెప్పారు.
* జైడస్ బయోటెక్ పార్క్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించడం ప్రేరణనిచ్చిందని ఆ సంస్థ తెలిపింది. వైద్యరంగ అవసరాలను తీర్చాలన్న తమ లక్ష్యానికి, ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఆయన రాక స్ఫూర్తినిచ్చిందని జైడస్ క్యాడిలా పేర్కొంది. జైడస్ కుటుంబంలోని 25,000 మంది ‘ఆత్మనిర్భర్ భారత్’కు అంకితమయ్యారని వెల్లడించింది. కొవిడ్-19ను నిర్మూలించేందుకు సురక్షితం, సమర్థంగా పనిచేసే టీకాలు, వైద్య విధానాలు, గుర్తింపు ప్రక్రియలు కనిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం ఆ సంస్థ రూపొందిస్తున్న జైకోవ్-డి టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది.
* పింఛన్‌దారుల జీవన ప్రమాణ పత్రం (లైఫ్ సర్టిఫికెట్) సమర్పణ తేదీని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పొడగించింది. నవంబర్ 30 నుంచి 2021, ఫిబ్రవరి 28 వరకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కరోనా వైరస్ వల్ల దరఖాస్తు చేయలేకపోయిన 35 లక్షల మందికి పైగా పింఛన్‌దారులకు లబ్ది చేకూరనుంది. వీరందరికీ ఫిబ్రవరి వరకు ప్రతి నెలా ఫించను మంజూరు చేయనున్నారు.
* గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నగరానికి చేరుకున్నారు. భాజపా కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా కూకట్‌పల్లి రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. కూకట్‌పల్లి ఉషా ముళ్లపూడి కమాన్ నుంచి ఆల్విన్ ప్రధాన కూడలి వరకు ఈ రోడ్‌షో కొనసాగుతోంది. రోడ్‌షోలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, నేతలు మురళీధరరావు, పెద్దిరెడ్డి, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నగరానికి చేరుకున్న యోగి ఆదిత్యనాథ్‌కు భాజపా, జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
* భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తెరాస ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని జోస్యం చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అడిక్‌మెట్‌లో నిర్వహించిన రోడ్‌షోలో సంజయ్ పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మళ్లీ జరిగే ఎన్నికల్లో భాజపా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తథ్యమని.. సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపొందేందుకు డివిజన్‌కు కేసీఆర్ రూ.5కోట్లు పంపారని.. రూ.500 కోట్ల వరదసాయం తెరాస కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ తప్పకుండా చేస్తామని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. అభివృద్ధి కోసం భాజపా పరితపిస్తోందన్నారు.
* మతాన్ని అడ్డం పెట్టుకొని స్వార్థ రాజకీయాలు చేస్తూ నాలుగు ఓట్లు రాల్చుకోవాని భాజపా ప్రయత్నిస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వేర్వేరుగా నిర్వహించిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనం, ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో కేటీఆర్ మాట్లాడారు. జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని చెప్పారని.. ఇప్పటివరకు ఎవరి ఖాతాల్లోనైనా పడ్డాయా అని నిలదీశారు. ఉద్దీపన ప్యాకేజీ కింద రూ.20 లక్షల కోట్లు ఇచ్చామంటున్నారని.. మరి ఆ ప్యాకేజీ ద్వారా ఎవరికైనా ఒక్క రూపాయి లబ్ధి జరిగిందా అని ప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామని ఊదరగొట్టారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా భాజపా, ఎంఐఎం నేతల వ్యవహార శైలిపై కేటీఆర్ మండిపడ్డారు. ఒకరు సర్జికల్ స్ట్రైక్స్ అంటే.. మరొక్కరు సమాధులు కూలుస్తామంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు రావడం కాదు.. ఉన్న ఉద్యోగాలు పోయాయని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలైన ఎయిర్ ఇండియా, ఎల్‌ఐసీని అమ్మేశారని అన్నారు. మత విద్వేషాలు సృష్టించి పిల్లల భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
* ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనపై స్థానిక ఎంపీనైన తనకు ఆహ్వానం కానీ, సమాచారం కానీ లేకపోవడం శోచనీయమని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ ప్రధాని పర్యటన వ్యక్తిగతం కాదు. భాజపా సొంత కార్యక్రమం అంతకంటే కాదు. ఇది ప్రజాప్రతినిధిని తీవ్రంగా అవమానించడమే. ఇది ప్రొటోకాల్ ఉల్లంఘన, సంప్రదాయాలకు విరుద్ధం. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తా.. నా నిరసన తెలియజేస్తా. లోక్‌సభ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతా’’ అని రేవంత్‌రెడ్డి వివరించారు.
* ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్‌ను సందర్శించారు. కరోనా నివారణకు రూపొందిస్తున్న ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్ పురోగతిపై భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలతో మోదీ చర్చించారు. ప్రస్తుతం కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్ జరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ సన్నద్ధత, ట్రయల్స్ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పర్యటన ముగిసిన అనంతరం భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
* ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. డిసెంబర్2న ‘బురేవి తుపాను’ తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ‘టకేటి తుపాను’ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
* కరోనా సమయంలో మోదీ ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించిందని, అది ఎవరికైనా అందిందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. శనివారం బేగంపేట మ్యారీగోల్డ్ హోటల్‌లో అగర్వాల్, మహేశ్వరి, మార్వాడి, గుజరాతీ వ్యాపారవేత్తలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఫలాలు ఎవరికీ అందలేదని వివరించారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నట్లు భాజపా ఆరోపిస్తోందని.. అలాగైతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
* దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ చలికాలంలో వైరస్ వ్యాప్తి క్రమంగా మళ్లీ పుంజుకుంటోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 41,452 కొత్త కేసులు, 615 మరణాలు నమోదయ్యాయి. అయితే, కరోనా తీవ్రత దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌లలోనే అధికం.
* కరోనా వైరస్ చైనా నుంచి వ్యాప్తి చెందలేదని మేము చెప్పడం అత్యంత ఊహాజనితమవుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. గతేడాది డిసెంబర్‌లో చైనాలోని ఆహార మార్కెట్‌లో మొదట ఈ మహమ్మారిని గుర్తించిన సంగతి తెలిసిందే. దానిపై వెంటనే సమాచారం ఇవ్వలేదని ప్రపంచ దేశాలు ఈ కమ్యూనిస్టు దేశంపై విమర్శలు చేస్తున్నాయి. దాంతో ఆరోగ్య సంస్థ చైనాకు వచ్చి కరోనా పుట్టుకపై అధ్యయనం చేయనున్న నేపథ్యంలో..ఆ వైరస్‌కు తమ దేశం జన్మస్థానం కాదంటూ చైనా కొత్త వాదనను ప్రచారం చేస్తోంది.
* వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో డిసెంబర్ 5వ తేదీ నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు తితిదే ధర్మకర్తల మండలి తీర్మానాలను సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం చేయించనున్నట్లు చెప్పారు. నడక దారిలోని గోపురాలకు మరమ్మతులు చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
* బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు. ‘యూపీ చట్టవిరుద్ధ మత మార్పిడుల బిల్లు 2020’కి గవర్నర్ ఆనందిబెన్ పటేల్ శనివారం ఆమోదం తెలిపారు. ఇవాళ్టి నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఇకపై ఎవరైనా వివాహం పేరుతో చట్టవిరుద్ధంగా బలవంతపు మత మార్పిడికి పాల్పడితే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. అంతేకాకుండా రూ.50వేలు జరిమానా విధిస్తారు.