* ఫాస్ట్ఫుడ్ వ్యాపారంలో మంచి పేరున్న బర్గర్ కింగ్ సంస్థ భారతీయ మార్కెట్లో ఐపీవోకు వస్తోంది. ఈ ఐపీవో డిసెంబర్ 2న ప్రారంభం కానుంది. దీని షేరు ప్రైస్‌బ్యాండ్ రూ.59-రూ.60 మధ్య ఉంటుందని అంచనావేశారు. ఈ ఐపీవో మొత్తం విలువ రూ.810 కోట్లుగా భావిస్తున్నారు. ఈ ఆఫర్ డిసెంబర్ 4వ తేదీన ముగియనుంది. దీనిలో 10శాతం షేర్లను కంపెనీ రీటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వు చేసింది. మరో 15శాతం నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, మరో 75శాతం క్యూఎఫ్‌ఐలకు కేటాయించనుంది.
* ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)ల మార్కెట్ కళకళలాడింది. డజనుకు పైగా కంపెనీలు రూ.25,000 కోట్లు సమీకరించి అదరగొట్టాయి. అధిక నగదు లభ్యతకు తోడు మదుపర్లు మంచి ఆసక్తి ప్రదర్శించడం కంపెనీలకు కలిసొచ్చిందని, వచ్చ ఏడాది కూడా ఐపీఓ విపణి ఇంతే బలంగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఫార్మా, టెలికమ్యూనికేషన్, ఐటీ, ఆర్థిక సేవలు వంటి వివిధ రంగాల కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రావడం గమనార్హం.
* టెక్ దిగ్గజం యాపిల్ తప్పుదోవ పట్టించే వ్యాపార విధానాలు అనుసరించినందుకు ఇటలీలోని యాంటీట్రస్ట్ అథారిటీ కోటీ 20 లక్షల డాలర్లు జరిమానా విధించింది. ఐఫోన్లకు సంబంధించి ఈ విధానాలు అనుసరించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని అక్కడి నియంత్రణ సంస్థలే ఒక ప్రకటనలో వెల్లడించాయి.
* మహిళలు నిర్వహిస్తున్న సూక్ష్మ వాణిజ్య సంస్థలపై కొవిడ్ ప్రభావం అధికంగా ఉందని, ఇందువల్ల సామాజిక-ఆర్థిక అంతరాలు మరింత పెరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌లోని క్రియా యూనివర్సిటీకి చెందిన లాభాపేక్ష రహిత పరిశోధనా సంస్థ లీడ్, గ్లోబల్ అలయన్స్ ఫర్ మాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (గేమ్) సంయక్తంగా నిర్వహించిన సర్వే తేల్చింది. మేలో ప్రారంభమైన సర్వే జనవరిలో ముగియనుంది. మహిళల నేతృత్వంలోని సంస్థలకు సంబంధించిన వివరాలు జులై-ఆగస్టుల్లో 1800 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో రూపొందించారు. ఉత్తర భారతంతో పాటు, తమిళనాడు, పశ్చిమ రాష్ట్రాలలో కూడా ఈ సర్వే నిర్వహించారు. అందువల్ల ప్రభుత్వాలు, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు మహిళా వాణిజ్యవేత్తల కోసం ప్రత్యేక పథకాలు రూపొందించాల్సి ఉందని నివేదిక సూచించింది.
* సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) ద్వారా దేశంలో ఐదు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. ఈ మేరకు 2020 హొరాసిస్ ఆసియా వర్చువల్ మీటింగ్‌లో మాట్లాడిన ఆయన వచ్చే ఏడాదికల్లా భారత్ అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా రూపుదిద్దుకోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
* 2021లో కొనుగోళ్లు కొవిడ్-19 మునుపటి స్థితికి చేరుకుంటాయని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. గృహ అవసరాలపై 2020లో తగ్గిపోయిన వినియోగదారుల ఖర్చు 2021కి 6.6 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. 2020లో ఇది 12.6% తగ్గిపోయిన సంగతి తెలిసిందే.
* దేశీయంగా ఇంటెగ్రేటెడ్ నావిక్, జీపీఎస్ రిసీవర్ల కోసం చిప్‌ల డిజైన్, తయారీ, సరఫరా, నిర్వహణ కోసం ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖ బిడ్లు ఆహ్వానించింది. 10 లక్షల రిసీవర్ల కోసం వీటిని వినియోగించనున్నారు. భారత ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (నావిక్), జీపీఎస్ రిసీవర్లకు ఇవి వాడతారు. భారత్‌తో పాటు సరిహద్దుల్లోని 1500 కిలోమీటర్ల పరిధిలో కూడా నావిగేషన్ సేవలు అందించడమే లక్ష్యంగా నావిక్‌ను రూపొందించారు. జీపీఎస్ ఒక్కదానికే పనిచేసే చిప్‌ల బదులు నావిక్‌ను కూడా అనుసంధానం చేస్తే, పట్టణాల్లో మరింత కచ్చితంగా నావిగేషన్ సేవలు అందంచే వీలుంటుంది. బిడ్లు సమర్పించేందుకు జనవరి 11ను గడువుగా నిర్ణయించారు.
* భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్‌డీఐ) అమెరికా రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న మారిషస్‌ను వెనక్కి నెట్టింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అమెరికా నుంచి భారీగా పెరిగినట్లు వెల్లడైంది.