DailyDose

రేపే GHMC పోరు-తాజావార్తలు

రేపే GHMC పోరు-తాజావార్తలు

* జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు 150 డివిజన్లలో పోలింగ్‌ జరగనుంది. గ్రేటర్‌ పరిధిలో 74,67,256 మంది ఓటర్లు 1,122 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అధికార తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. భాజపా 149, కాంగ్రెస్‌ 146, తెదేపా 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 76, స్వతంత్ర అభ్యర్థులు 415 మంది బల్దియా బరిలో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు 9,101 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.

* రాష్ట్రంలో రైతులు నష్టపోతుంటే ఆ విషయంపై చర్చించకుండా అధికార వైకాపా సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. పంటల బీమా కట్టకపోవడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైతులకు చెందిన పంటల బీమాను ఎందుకు క్లెయిమ్‌ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైకాపా నేతలు అసెంబ్లీలో కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా సభ్యులు సభలో ఇష్టానుసారం వెకిలినవ్వులు నవ్వుతారా? బీ కేర్‌ఫుల్‌! చాలా మందిని చూశానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

* కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ముందున్న మోడెర్నా, తాము రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం సిద్ధమైంది. ఇప్పటికే తాము రూపొందించిన mRNA-1273 వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ నియంత్రణ సంస్థల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

* కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన ఆందోళనల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ నిరసనల్లో పంజాబ్, హరియాణాకు చెందిన రైతులే కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు ఒకవైపు కేంద్రంపై దృఢవైఖరిని ప్రదర్శిస్తూనే..మరోవైపు, సిక్కు మత వ్యవస్థాపకుడు, ప్రథమ గురువు గురునానక్ జయంతిని జరుపుకొన్నారు. తమ తోటివారికి ప్రసాదాలు పంచారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తమను కట్టడి చేస్తోన్న భద్రతాబలగాలనూ ఈ వేడుకలో భాగం చేసుకున్నారు.

* 2021లో కొనుగోళ్లు కొవిడ్‌-19 మునుపటి స్థితికి చేరుకుంటాయని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా వేసింది. గృహ అవసరాలపై 2020లో తగ్గిపోయిన వినియోగదారుల ఖర్చు 2021కి 6.6 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. 2020లో ఇది 12.6% తగ్గిపోయిన సంగతి తెలిసిందే. సాధారణంగా చెప్పాలంటే గృహ అవసరాలపై ఖర్చుల్లో వృద్ధి 2019లో కన్నా 1.2% కాస్త ఎక్కువగా ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది. అంటే 2019లో కొనుగోళ్ల విలువ రూ.121.6 లక్షల కోట్లు ఉంటే 2021లో రూ.123 లక్షల కోట్లుగా ఉండనుంది.

* వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మరో కూటమి పార్టీ నుంచి అసమ్మతి సెగ తాకింది. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఎన్డీయే కూటమి పార్టీ అయిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ(ఆర్‌ఎల్పీ) కోరింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ హనుమాన్‌ బనివాల్‌ కేంద్ర ప్రభుత్వానికి ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీకి కదం తొక్కిన తరుణంలో ప్రభుత్వం తక్షణమే వాటిని రద్దు చేయాలంటూ ఆయన భాజపాను కోరారు.

* సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) ద్వారా దేశంలో ఐదు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వివరించారు. ఈ మేరకు 2020 హొరాసిస్‌ ఆసియా వర్చువల్‌ మీటింగ్‌లో మాట్లాడిన ఆయన వచ్చే ఏడాదికల్లా భారత్‌ అతిపెద్ద ఆటోమొబైల్‌ తయారీ కేంద్రంగా రూపుదిద్దుకోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

* రోహిత్ గాయం గురించి సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ సునిల్ జోషి, ఫిజియో, కోచ్ రవిశాస్త్రి మధ్య సమన్వయం ఉంటే గందరగోళ పరిస్థితి ఎదురవ్వదని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ గురించి ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటే సరిపోతుంది. పరిస్థితులన్ని సాఫీగా సాగుతాయి. ఫిజియో, కోచ్‌, సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్ అతడి గాయం గురించి సమగ్రంగా విశ్లేషించుకోవాలి. అంతేగాక, కోచ్ రవిశాస్త్రి ద్వారా కోహ్లీ ఎప్పటికప్పుడు రోహిత్ గాయం గురించి తెలుసుకోవాలి’’ అని గంభీర్‌ అన్నాడు.

* కన్నడ గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్రంలోని 5,700లకు పైగా ఉన్న గ్రామ పంచాయతీలకు డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎలక్షన్‌ కమిషనర్‌ బి. బసవరాజు సోమవారం తెలిపారు. ఎన్నికల ఫలితాలు 30వ తేదీన వెల్లడించనున్నట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 6,004 గ్రామ పంచాయతీలకు గానూ కేవలం 5,762 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ 162 గ్రామ పంచాయతీల్లో పదవీ సమయం పూర్తి కాలేదన్నారు.

* ఏపీలో కరోనా వైరస్‌ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 381 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40,728 శాంపిల్స్‌ పరీక్షించగా.. 381 మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే, కొత్తగా 934మంది కోలుకోగా.. మరో నలుగురుప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన వాటితో కలుపుకొంటే రాష్ట్రంలో ఇప్పటివరకు కోటికి పైగా శాంపిల్స్‌ పరీక్షించగా.. 8,68,064 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.