WorldWonders

ముంబయిపై దాడి చేసినందుకు పాక్ అత్యున్నత పురస్కారం

ముంబయిపై దాడి చేసినందుకు పాక్ అత్యున్నత పురస్కారం

భారత్‌లో దాడి చేసి అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నందుకు తనకు అత్యున్నత పురస్కారం కావాలని పాక్‌ ప్రభుత్వాన్ని కోరాడట తహవుర్‌ రానా. అలాగే ఆ మారణహోమంలో పాల్గొన్న తొమ్మిది మంది ముష్కరులకు ఏకంగా పాక్‌ అత్యున్నత సైనిక పురస్కారాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడట. ఈ విషయాల్ని అమెరికా ప్రభుత్వం అక్కడి కోర్టుకు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..

భారత్‌లో 2008నాటి ముంబై ఉగ్రదాడుల ఘటనలో దోషి అయిన పాకిస్థాన్‌ సంతతి కెనడా వ్యాపారి తహవుర్‌ రానా ప్రస్తుతం అమెరికాలోని లాస్‌ ఎంజెలస్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఉగ్రదాడుల కేసు నిమిత్తం అతణ్ని తమకు అప్పగించాలన్న భారత్‌ అభ్యర్థన మేరకు రానాను జూన్‌ 10న అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కోర్టులో సమర్పించిన ఛార్జిషీట్‌లో అటార్నీ నికోలా టీ హన్నా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దాడుల్లో రానా హస్తమున్నట్లు ధ్రువీకరించిన హన్నా.. ఆ ముష్కరుణ్ని తమకు అప్పగించాలన్న భారత అభ్యర్థనను సమర్థించారు.

ఛార్జిషీట్‌లోని వివరాల ప్రకారం.. ‘‘రానా, దాడుల్లో మరో కుట్రదారుడు హెడ్లీ, లష్కరే ముష్కరులు సహా మరికొంత మంది దుండగులు కలిసి చేసిన కుట్ర నవంబరు 26, 2008లో ముంబయిలో దాడులకు దారితీసింది. దాడి జరిగిన తర్వాత కూడా హెడ్లీ, రానా తరచూ సంప్రదింపులు జరుపుకొన్నారు. దాడి జరిగిన ప్రదేశాల్ని వీడియో తీయడంతో పాటు డిసెంబరులో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని రానాకు హెడ్లీ తెలియజేశాడు. ఇలా ఇరువురి మధ్య పలుసార్లు సంభాషణలు కొనసాగాయి. ఈ క్రమంలో వీరి సంభాషణల్ని అమెరికన్‌ ఎఫ్‌బీఐ ఛేదించింది. దాడుల్లో మృతిచెందిన 9 మంది ఉగ్రవాదులకు పాకిస్థాన్ అత్యున్నత సైనిక పురస్కారం.. తనకు దేశ అత్యున్న పౌర పురస్కారాల్లో ఒకటి ఇవ్వాలని రానా డిమాండ్‌ చేయడాన్ని ఎఫ్‌బీఐ స్పష్టంగా విన్నది. ఈ విషయాన్ని హెడ్లీ అప్పటికే పాక్‌లోని తమ సభ్యులకు తెలియజేసినట్లు చెప్పడంతో రానా చాలా సంతోషించాడు’’ అని హన్నా తెలిపారు.