పేదల ఇళ్ల అంశంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. గృహనిర్మాణంపై చర్చలో భాగంగా టిడ్కో ఇళ్ల అంశంపై సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఇప్పటికే కట్టిన ఇళ్లకు బిల్లులు రావడం లేదని, కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చే పరిస్థితీ లేదని చంద్రబాబు ఆరోపించారు. అనిశ్చిత పరిస్థితి సృష్టించారని విమర్శించారు. ఈ క్రమంలో టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కీమ్‌లు ఉంటాయని.. బాబు స్కీమ్, జగన్ స్కీమ్‌లు ఉండవన్నారు. ఆ మాత్రం ఆలోచన కూడా లేని ముఖ్యమంత్రి ఈయన అంటూ జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైకాపా సభ్యులు విమర్శలు చేయగా.. ఆధారాలతో తాను మాట్లాడతానని ఆయన బదులిచ్చారు. దీనికే ఉలిక్కి పడుతున్నారని.. చెప్పాలంటే ఇంకా చాలా ఉందన్నారు. పేర్లు చాలా పెట్టుకుంటున్నారని.. స్టిక్కర్ సీఎంగా మిగిలిపోతారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము కట్టిన ఇళ్లకి మీ స్టిక్కర్ వేసుకోవడమేంటని ప్రశ్నించారు. రూపాయికే ఇళ్లు ఇస్తామనేది తప్పుడు ప్రచారమని ఆరోపించారు. అనంతరం సీఎం జగన్ లేచి వైకాపా మేనిఫెస్టో చూపిస్తూ ఇంతపెద్ద ఆధారం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం కళ్లార్పకుండా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. తమ మేనిఫెస్టోలో చెప్పినదాన్ని ఆయనకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడతారని ఎద్దేవా చేశారు. 300 అడుగుల ఇళ్లు అని మేనిఫెస్టోలో మేం స్పష్టంగా పేర్కొన్నా చంద్రబాబుకు అది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఒక్కో ఇంటికి రూ.6లక్షల రుణం ఇస్తే అందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.1.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.1.50లక్షలు భరిస్తాయని.. మిగతా రూ.3లక్షల రుణాన్ని తమ ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేస్తుందంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్ వివరించారు. దానికి సంబంధించి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మాట్లాడిన ప్రసంగాన్ని సభలో ప్రదర్శించారు. ఆ తర్వాత మళ్లీ చంద్రబాబు మాట్లాడారు. నేనొస్తాను.. ఇళ్లన్నీ ఉచితంగా ఇస్తానని జగన్ చెప్పారన్నారు. మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట ఓట్లేశారని.. మాట నిలబెట్టుకోవాలని సూచించారు. సీఎం 300 అడుగులు అని చెప్పారా? పేదల పట్ల వివక్ష వద్దు. సభలో ఒకలా.. మేనిఫెస్టోల్లో ఒకలా అంటే ఎలా? మడమ తిప్పకపోతే..మాట తప్పకపోతే పాలకొల్లు సభలో చెప్పినదానికి నిలబడతారా? అని చంద్రబాబు నిలదీశారు. దీనిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చెప్పాలనుకుంటున్నారో చంద్రబాబుకు స్పష్టత లేదన్నారు.
చంద్రబాబుకు స్పష్టత లేదు
Related tags :