వసంత మండపంలో శాస్త్రోక్తంగా అచ్యుతార్చన, గోపూజ
కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా బుధవారం తిరుమల వసంత మండపంలో అచ్యుతార్చన, గోపూజ శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేశారు.
ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ గోవు సకల దేవతా స్వరూపమన్నారు.
గోధూళిని తాకితే వాయువ్య స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, గోదానం వల్ల 14 లోకాల్లోని దేవతల ఆశీర్వాదం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు.
ముందుగా కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి ప్రార్థనా సూక్తం, విష్ణుపూజా మంత్ర పఠనం చేశారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లకు తిరువారాధన చేశారు.
అనంతరం కపిల గోవుకు, దూడకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హారతి సమర్పించారు. గోప్రదక్షిణ చేశారు.
అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ ఎన్ఎకె.సుందరవదనాచార్యులు పాల్గొన్నారు.