చలికాలం చాలా డేంజర్.. ఈ చిట్కాలు పాటిస్తే మీ ఆరోగ్యం సేఫ్!
చలికాలంలో రోగ నిరోధక శక్తి వేగంగా తగ్గిపోతుంది. దీనివల్ల హానికారక వైరస్‌లు సులభంగా శరీరంలోకి చొచ్చుకెళ్తాయి. అలా జరగకుండా ఉండాలంటే.. తప్పకుండా ఈ చిట్కాలు పాటించండి.
చలికాలం వచ్చిందంటే చాలు.. అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. ముఖ్యంగా జలుబు, ముక్కు దిబ్బడ తదితర శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అవి దరి చేరకూడదంటే తప్పకుండా మీరు కొన్ని చిట్కాలను క్రమం తప్పకుండా పాటించాలి. వ్యాయామంతోపాటు కొన్ని ఆహార నియమాలను అలవరుచుకోవాలి. మరి, అవేంటో చూసేద్దామా!
చలికాలంలో చల్లని గాలులు, పొగ మంచులోకి అస్సలు వెళ్లకూడదు. తప్పకుండా వెళ్లాల్సి వస్తే తప్పకుండా ఉన్ని వస్త్రాలను ధరించండి. తల మీద మంచు పడకుండా ఏదైనా వస్త్రం లేదా క్యాప్ ధరించండి. తీవ్రమైన చలిలో శరీరంపై వస్త్రాలు లేకుండా తిరగడం చాలా డేంజర్. తప్పకుండా ఉన్ని వస్త్రాలు ధరించాలి. చెవులు, ముక్కు కవర్ చేసుకోవాలి. చలిగాలి తీవ్రత ఎక్కువగా ముఖం, చేతులు, పెదవులు, పాదాల మీద ప్రభావం చూపుతుంది. చర్మం పొడిబారి దురద వస్తుంది. ముఖం మీద చెమట పొక్కులు, పెదాలకు పగుళ్లు ఏర్పడతాయి. ముఖం బిగిసిపోయినట్లు అనిపిస్తుంది.
పొడి చర్మం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
చలికాలంలో జిడ్డు చర్మం కలిగినవారికి పెద్దగా సమస్యలు ఉండవు. పొడి చర్మం గలవారికే ఎక్కువ సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారకుండా, పగుళ్లు రాకుండా ఉండాలంటే ఉదయం గోరవెచ్చని నీటిలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె చుక్కలు వేసి స్నానం చేయండి. చలికాలంలో సాధారణ సబ్బులకు బదులు గిజరిన్ సబ్బులను వాడండి.
మాయిశ్చరైజర్లు (Moisturizers) తప్పనిసరి:
చలికాలంలో ముఖం అందంగా మెరవాలంటే.. విటమిన్-ఇ ఉండే మాయిశ్చరైజర్లు వాడాలి. రాత్రి నిద్రపోయే ముందు కాళ్లు, చేతులకు వేజలైన్ లేదా కొబ్బరి నూనె రాసుకోవడం మంచిది. పాదాలకు సాక్సులు ధరించండి. వారానికి ఒకసారి గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం మరింత సురక్షితంగా ఉంటుంది.
నీళ్లు ఎక్కువగా తాగండి:
చలికాలంలో మూత్రం ఎక్కువగా వస్తుందనే కారణంతో చాలామంది నీటిని తాగడం తగ్గించేస్తారు. అది అంత మంచి అలవాటు కాదు. అలా చేస్తే శరీరంలో నీటి శాతం తగ్గి చర్మం పొడిబారిపోతుంది. జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. చలికాలంలో కూడా వీలైనంత ఎక్కువ నీరు తాగండి.
వ్యాయామం తప్పనిసరి:
చలికాలంలో నిద్ర లేచిన తర్వాత ఒళ్లంతా పట్టేసినట్లు ఉంటుంది. కొంతమంది ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. రోజూ కనీసం అరగంట వ్యాయామం చేస్తే కండరాలు ఉత్తేజితమవుతాయి. శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరిగి వెచ్చగా ఉంటుంది. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
వెల్లులి మేలు చేస్తుంది:
చలికాలంలో వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది. కాబట్టి.. వ్యాధులు త్వరగా దాడి చేస్తాయి. ఆ సమస్య రాకుండా ఉండాలంటే వెల్లులిని ఎక్కువగా తీసుకోండి. అలాగే సిట్రస్ జాతికి చెందిన పండ్లు తీసుకోండి.
వేడి వేడిగా తినండి:
చలికాలంలో ఆహారాన్ని చల్లబడకుండా చూసుకోండి. వేడిగా ఉన్నప్పుడే తినేయండి. ఏదైనా ఆహారాన్ని తినే ముందు చేతులను శుభ్రం చేసుకోండి.
వీలైనంత తక్కువ తినండి:
చలికాలంలో కడుపు నిండా కాకుండా, వీలైనంత తక్కువ తినడం మంచిది. రాత్రి వేళల్లో అన్నానికి బదులు చపాతీ లేదా పుల్కాలు తినండి. పండ్లు తప్పకుండా తినండి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక పావు లీటరు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి.. అల్లం లేదా పుదినా ఆకులు వేసుకుని తాగండి. నిమ్మరసం వేసుకుని తాగితే మరింత మంచిది.