* తెలంగాణలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు అరుదైన గుర్తింపు లభించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 16,671 పోలీస్ స్టేషన్లలో అగ్రస్థానంలో నిలిచిన 10 ఉత్తమ పోలీస్ స్టేషషన్ల జాబితాను గురువారం కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. వాటిలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్‌స్టేషన్ 10వ స్థానం దక్కించుకుంది. వివిధ విభాగాల్లో పోలీస్ స్టేషన్ల పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
* నూతన వ్యవసాయ చట్టాలపై ఎనిమిది రోజులుగా పోరు కొనసాగిస్తున్న రైతు సంఘాలతో కేంద్రమంత్రుల చర్చలు మళ్లీ అసంపూర్తిగానే ముగిశాయి. మధ్యాహ్నం 12.30గంటల సమయంలో విజ్ఞాన్‌భవన్‌లో ప్రారంభమైన ఈ చర్చలు దాదాపు ఏడు గంటలపాటు సాగినా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఎల్లుండి (ఈ నెల 5న) మరోసారి రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలుపునిచ్చింది. అయితే, రైతుసంఘాలన్నీ చర్చించుకొని నిర్ణయాన్ని రేపు చెబుతామని చెప్పినట్టు సమాచారం.
* గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఓల్డ్ మలక్‌పేటలో వాయిదా పడిన పోలింగ్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముగిసిన నేపథ్యంలో ఆయా సంస్థలు తమ సర్వే వివరాలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఆరా, జన్‌కీ బాత్ సంస్థలు తెరాసకు మెజార్టీ స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి.
* భారత్‌లో కరోనా వ్యాక్సిన్ పరీక్షలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో డిసెంబరు నెలాఖర్లో లేక జనవరి ప్రారంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరక్టర్ డా. రణ్‌దీప్ గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఓ మీడియా సంస్థతో జరిగిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి పూర్తి అనుమతులు పొందిన తర్వాత అధికారులు ప్రజలకు దాన్ని అందించే ప్రక్రియను ప్రారంభిస్తారన్నారు.
* తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తీసుకున్న నిర్ణయంపై అన్నాడీఎంకే నేత, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం స్పందించారు. రజనీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని అభిప్రాయపడ్డారు. అవకాశం ఉంటే గనక ఆయన పార్టీతో పొట్టు పెట్టుకుంటామంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు, తన పొలిటికల్ ఎంట్రీపై సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తలైవా ఈ రోజు తెరదించారు.
* నేరారోపణలు రుజువైన ప్రజాప్రతినిధులపై జీవితకాలం నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ మేరకు గురువారం అఫిడవిట్ సమర్పించింది. నేరారోపణలు రుజువై శిక్ష పడిన నేతలను ఎన్నికల్లో పోటీచేయకుండా జీవితకాలం నిషేధం విధించాలంటూ ప్రముఖ న్యాయవాది అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. కేంద్రం తమ స్పందన తెలియజేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
* నివర్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. వ్యవసాయం లాభసాటి కావాలనేదే జనసేన ఆలోచన అని చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35వేల పరిహారం చెల్లించాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై మీడియా ప్రతినిధులు పవన్ స్పందన కోరగా.. భారీగా అభిమాన బలం, బలమైన ఆలోచన ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
* అమెరికాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,39,21,374 మంది కరోనా బారిన పడగా.. 2,73,799 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలు సమీపిస్తుండటంతో మహమ్మారి మరింత విజృంభించే అవకాశముంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ స్పందించారు. అత్యంత అవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలని పిలుపు నిచ్చారు.
* మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో చేజార్చుకున్న కోహ్లీసేన ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్ సమరానికి సిద్ధమైంది. ఆఖరి వన్డేలో గెలిచిన మనుక ఓవల్‌లోనే మొదటి టీ20లో తలపడనుంది. తొలి పోరులోనే విజయం సాధించి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. వన్డేల్లో అనేక విభాగాల్లో ఇబ్బందులు పడటంతో టీమ్‌ఇండియా కూర్పు కుదర్లేదు. ప్రస్తుతం యువకుల రాక.. ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉండటంతో 20 ఓవర్ల ఫార్మాట్లో పటిష్ఠంగానే కనిపిస్తోంది.
* ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్-బయోఎన్‌టెక్ సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ మరికొన్ని రోజుల్లోనే బ్రిటన్‌లో అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. దీంతో ఫైజర్ వ్యాక్సిన్‌ను అనుమతించిన తొలి దేశంగా బ్రిటన్ నిలిచింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడానికి ఉన్న అవకాశాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫైజర్ వెల్లడించింది.
* ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నట్టు కనబడుతున్నాయి. తాజాగా 63049మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 664మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 11మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 835మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,02,29,745 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,70,076 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.