వచ్చే నెలలో అధికారాన్ని బైడెన్‌కు అప్పగించనున్న డొనాల్డ్ ట్రంప్.. ఎక్కడ ఉన్నా.. ఏం మాట్లాడినా సెన్సేషనే. ఆయన నోటి నుంచి ఎలాంటి కామెంట్స్ వస్తాయో అంటూ మీడియా ఎదురుచూస్తుంటుంది. గత నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు గట్టిపోటీనిచ్చిన ట్రంప్.. వైట్‌హౌస్‌లో జరిగిన క్రిస్మస్ కార్యక్రమంలో 2024 ఎన్నికల్లో బరిలో నిలుస్తానని తన మనుసులోని మాట చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలయ్యారు. అయితే, తన పరాజయాన్ని అంత తొందరగా అంగీకరించని ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్, మోసం జరిగిందని ఆరోపిస్తూ కోర్టుకెక్కారు. కాగా, క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైట్‌హౌస్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. తన రాజకీయ జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాలుగేండ్లు చాలా అద్భుతంగా గడిచాయి. మరో నాలుగేండ్లు ప్రజలకు సేవ చేయాలని భావించాం. అందుకోసం ఎంతగానో శ్రమించాం. పోరాడాం. దురదృష్టవశాత్తు ఓటమిపాలయ్యాం. మరో నాలుగేండ్ల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను’ అంటూ పరోక్షంగా 2024 ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని వెల్లడించారు. బైడెన్ చేతిలో ఓటమిపాలు కావడంతో ట్రంప్ రాజకీయాల్లో కొనసాగుతారా? లేక తిరిగి వ్యాపార జీవితంలోకి ప్రవేశిస్తారా? అనే అనుమానాలు తలెత్తాయి. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోనే ఉంటారా? అన్న పలువురి సందేహాలకు సమాధానం దొరికినట్లయింది.
2024లో నేను పోటీ చేసి తీరుతాను
Related tags :