WorldWonders

పరిశుద్ధ వివాహంలో అపశృతి. చర్చి ఫాదర్‌కు షాక్.

Bodhan Groom Anupam Kumar Denies Match In Church - పరిశుద్ధ వివాహంలో అపశృతి. చర్చి ఫాదర్‌కు షాక్.

వధూవరులు ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు.. అయితే పీటల మీదికొచ్చేసరికి పెళ్లికొడుకు ట్విస్ట్‌ ఇచ్చాడు.. పెళ్లి ససేమిరా వద్దన్నాడు.. దీంతో పెళ్లి నిలిచిపోయింది. ఈ సంఘటన శుక్రవారం బోధన్‌ పట్టణ కేంద్రంలో జరిగింది. బోధన్‌ పట్టణంలోని శక్కర్‌నగర్‌ కాలనీకి చెందిన యువకుడికి రాకాసీపేట్‌కు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. పట్టణంలోని సీఎస్‌ఐ చర్చిలో ఇరువురికి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. శుక్రవారం ఉదయం ఇరు కుటుంబాలతో పాటు బంధువులు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చర్చికి చేరుకున్నారు. చర్చిలో ఫాదర్‌ మాట్లాడుతూ నీకు అబ్బాయి ఇష్టమా అని అడగగా అమ్మాయి ఇష్టమే అని తెలిపింది. కాని అక్కడే అబ్బాయి మొహం చాటేశాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేది లేదని చెప్పడంతో పెళ్లికూతురు, ఆమె తరపు బంధువులు, పెళ్లి కొడుకు తరపు బంధువులు అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పెళ్లికూతురు తరపు పెద్దలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పెళ్లి నిరాకరణపై ఇరువర్గాల వారు పెళ్లికొడుకును ఎంత సముదాయించినా, మందలించినా ఎలాంటి సమాధానం రాకపోయేసరికి చివరికి పెళ్లిపెద్దలు మాట్లాడుకుని వివాహం క్యాన్సిల్‌ చేసుకుని ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.