* రైతు ఆందోళనలు ఉద్ధృతమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.వ్యవసాయ చట్టాలను సవరించాలని ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పంటల మద్దతు ధరకు హామీ, ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థ బలోపేతంతో పాటు కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించి సమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం కల్పించే అవకాశాలపై కేంద్రం దిగొచ్చే అవకాశముందని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే ఈ విషయంపై న్యాయ శాఖతో కూడా వ్యవసాయ శాఖ చర్చలు జరిపినట్లు సమాచారం. ఐదో విడత చర్చలు శనివారం ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రులు షా, రాజ్‌నాథ్, తోమర్, పీయూశ్ గోయల్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలోనే కేంద్ర వ్యవసాయ చట్టాలను సవరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
* ప్రభుత్వ అనుమతితో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానంపై గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ రాశారు. రాజ్యాంగంలోని 243కె అధికరణ కింద ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉందని.. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం కమిషన్ విధి అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లను సమాన అధికారాలు ఉంటాయని వివరించారు. ప్రభుత్వ అనుమతితో ఎన్నికలు జరపాలని ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని తిరస్కరించాల్సిందిగా గవర్నర్‌ను కోరారు. అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయ నిపుణులను సంప్రదించాలని గవర్నర్‌కు ఎస్‌ఈసీ విజ్ఞప్తి చేశారు.
* హయత్‌నగర్ సర్కిల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దగౌని లక్ష్మీప్రసన్నగౌడ్ ఓటమి ఆసక్తికరంగా మారింది. కుమారుడే తల్లి ఓటమికి కారణమై ఆమె రాజకీయ జీవితానికి ప్రశ్నగా మారాడు. బీఎన్‌రెడ్డినగర్ డివిజన్‌లో లక్ష్మీప్రసన్నగౌడ్ ఉదయం నుంచి బీజేపీ అభ్యర్థిపై 1206 ఓట్లలీడ్‌లో కొనసాగారు. సాయంత్రం వరకు ఫలితాలన్నీ తారుమారయ్యాయి. బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డి చేతిలో 32 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారు. డమ్మీ అభ్యర్థిగా బరిలోకి దిగిన లక్షీప్రసన్నగౌడ్ కుమారుడు రంజిత్‌గౌడ్ ఈ ఓటమికి కారణంగా నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి రంజిత్‌గౌడ్‌కు 39 ఓట్లు పోలయ్యాయి. ఆయన ముందే విత్ డ్రా చేసి ఉంటే బ్యాలెట్ పత్రంలో ఆయన పేరు కన్పించేది కాదు. రంజిత్‌కు పోలైన ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థికి పడే అవకాశముండేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
* ఆంధ్రప్రదేశ్ లో పెంచిన రేషన్ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.కరోనా ప్రభావంతో ఇప్పటివరకు ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేయగా.. ఇక నుంచి సాధారణ పద్ధతిలోరేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది.ఈ మేరకు పెంచిన రేట్ల ప్రకారం రేషన్ పంపిణీ చేయనుంది.కందిపప్పు రేటు రూ.40 నుంచి రూ.67కి, అర కిలో పంచదార ధర రూ.10 నుంచి రూ.17కి ప్రభుత్వం పెంచింది. AAY కార్డులకు కిలో పంచదార రూ.13కు అందజేయనున్నారు.
* ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు జగన్ ప్రభుత్వం మరోసారి గట్టి షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు జగన్ సర్కారు మరోసారి ఊహించని షాకిచ్చింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసింది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా.. ఏపీ అసెంబ్లీ ఆమెదించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని జగన్ ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
* పండుగలు, శుభకార్యాలు, వేసవి సెలవులు వచ్చాయంటే ఒకప్పుడు పిండి వంటల తయారీతోనే సందడి మొదలయ్యేది. ఉరుకులు, పరుగుల జీవితాల్లో ఇంటిల్లిపాదికి నెల రోజులకు సరిపడా పిండి వంటలు తయారు చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈ లోటు తీరేలా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామం సంప్రదాయ పిండివంటల రుచిని అందిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే చాలా శుభకార్యాల్లో అతిథులను వేల్పూరు పిండివంటలు నోరూరిస్తాయి. విదేశాల్లో స్థిరపడిన వారు ఏడాదికోసారైనా వీటిని పంపించాలని ఇంట్లో వారిని కోరతారు. ఇంట్లో చేసినంత నాణ్యంగా అందుబాటు ధరలో ఉండటం వల్ల డిమాండ్ బాగుంటుందని దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు.
* కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ శనివారం నిరసన గళం వినిపించారు. తమిళనాడులోని సేలంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ‘ఈ చట్టాలకు వ్యతిరేకంగా మేం న్యాయస్థానానికి వెళ్లాం. కేరళ, పంజాబ్ ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించాయి. తాను మొదట రైతునని మా ముఖ్యమంత్రి చెప్పుకుంటారు. కానీ, ఆయన ఇంతవరకు ఎందుకు ఎలాంటి చర్యలకు పూనుకోలేదు?’ అని స్టాలిన్ అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
* గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఇప్పటివరకు ఏ పార్టీతో చర్చించలేదని ఏఐఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. మేయర్ ఎన్నికపై ఎవరైనా సంప్రదిస్తే పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గెలుపొందిన కార్పొరేటర్లతో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒవైసీ సమావేశమయ్యారు. సమావేశంలో మాట్లాడిన ఒవైసీ, ఎన్నికల సమయంలో భాజపా ప్రచారం చేసిన తీరుపై మండిపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేసిన వార్డులోనూ భాజపా గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా ప్రజల తీర్పును గౌరవించాలన్నారు. భవిష్యత్తులో జరగబోయే ప్రధాన ఎన్నికల్లో భాజపా అంత ప్రభావం చూపలేకపోవచ్చని అసద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో తెరాసపై ప్రజలకు అభిమానం ఉందని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోల్పోయిన స్థానాలపై ఆ పార్టీ ఆలోచించుకోవాలన్నారు. భాజపాతో ఎంఐఎంకు ఎలాంటి పోటీ లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు.
* కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలతో కేంద్రం చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రైతులు వెనక్కి తగ్గకపోవడంతో చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. డిసెంబర్ 9న మరోదఫా చర్చలకు కేంద్రం ప్రతిపాదించగా.. అందుకు రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో బుధవారం మరో దఫా చర్చలు కొనసాగనున్నాయి. కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవడమే తమ ప్రధాన డిమాండ్ అని చెబుతోన్న రైతు సంఘాలు వెనక్కి తగ్గకపోవడంతో మరింత వివరణతో ముందుకొచ్చేందుకు కేంద్రం సమయం కోరినట్టు సమాచారం.
* పార్లమెంట్ కొత్త భవనం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుత భవనం చాలదన్న ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన ఈ భారీ భవన నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 10న భూమిపూజ నిర్వహించేందుకు ప్రధానిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ఆయన మోదీ నివాసానికి వెళ్లి అధికారికంగా ఆహ్వానించారు. అనంతరం ఓం బిర్లా కొత్త భవనానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు.
* 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాదే విజయమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజపా విజయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీగానీ అడ్డుకోలేరని ఆయన అన్నారు. ప్రజలు అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. మొత్తం 48 డివిజనల్లో భాజపాను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లోనూహైదరాబాద్ ప్రజల ఆశీస్సులు కొనసాగాలని ఆకాంక్షించారు.
* ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2020 జాబితాలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, మాస్టర్‌కార్డ్ సీఈఓ అజయ్ బంగా చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ భారత సంతతికి చెందినవారే కావడం ప్రత్యేకం. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచారు. మస్క్ వరుసగా రెండోసారి ఈ జాబితాలో అగ్రస్థానం పొందడం గమనార్హం. కరోనా సంక్షోభ ప్రభావం ఉన్నప్పటికీ.. ఇతర దిగ్గజ నాయకులు సైతం గణనీయ పనితీరు కనబరిచినట్లు ఫార్చూన్ తెలిపింది.
* కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ శనివారం నిరసన గళం వినిపించారు. తమిళనాడులోని సేలంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ‘రైతులు ప్రధాని మోదీపై యుద్ధం చేస్తున్నారు. తాను పేద కుటుంబం నుంచి వచ్చానని, ఏ ఒక్క రైతూ మరణించకుండా చూస్తానని ఆయన చెప్తుంటారు. కానీ, వాస్తవంగా వేల సంఖ్యలో రైతులు మరణిస్తున్నారు. డీఎంకే దిల్లీలోని రైతుల నిరసనకు మద్దతు ఇస్తుంది’ అని వెల్లడించారు.
* గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ముందస్తుగా నిర్వహించడం కొంత ఇబ్బందికి గురిచేసిందని తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా తెదేపా అధికారంలో లేకపోయినా పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు 106 మంది అభ్యర్థులు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
* సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏర్పాటు చేయబోయే పార్టీపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని కాంగ్రెస్ అభిప్రాయపడింది. పార్టీ సిద్ధాంతం, కార్యక్రమం, ఎన్నికల రోడ్‌మ్యాప్.. ఇలా వేటిపైనా ఒక స్పష్టత రాకుండా వచ్చే ఏడాదిలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావాన్ని అంచనా వేయడం తొందరపాటే అవుతుందని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి, కర్ణాటక పీసీసీ చీఫ్ దినేశ్ గుండూరావు అన్నారు. ఇప్పటికైతే రజనీకాంత్‌తో అనేకమంది భాజపా వాళ్లకు సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
* వైకాపా నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మరోసారి కరోనా సోకింది. ఇప్పటికే ఓసారి కొవిడ్ బారిన పడిన తనకు మరోసారి ఈ వైరస్ సోకినట్టు ఆయన ట్విటర్‌లో ప్రకటించారు. రీఇన్ఫెక్షన్‌కు గురికావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ‘‘జులైలో నాకు కొవిడ్ వచ్చి తగ్గిన సంగతి మీ అందరికీ విదితమే. నిన్న అసెంబ్లీలో కొవిడ్ టెస్ట్ చేయించాను. పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. రీ ఇన్ఫెక్షన్‌కు గురికావడం ఆశ్చర్యం కలిగించింది. అవసరమైతే ఆస్పత్రిలో చేరతాను. మీ ఆశీస్సులతో మరోసారి కరోనాను జయించి మీ ముందుకు వస్తా’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.