Politics

కాదంటున్న కోమటిరెడ్డి..

కాదంటున్న కోమటిరెడ్డి..

ఉత్తమ్‌ కుమార్‌ రాజీనామాతో టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి వర్గంలో ఆశలు చిగురిస్తున్నాయి. పీసీసీ పదవీ బాధ్యతలు రేవంత్‌ను అప్పగిస్తారని ఆయన వర్గం నేతలు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నానాటికీ దిగజారిపోతున్న కాంగ్రెస్‌ పార్టీని ఆయన మాత్రమే గాడిలోపెట్టగలరని, కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురాగలరని బలంగా నమ్ముతున్నారు. అయితే ఇప్పటికే రేవంత్‌కు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని డిసెంబర్‌ 9న దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చసాగుతోంది. ఈ క్రమంలోనే మరో అసమ్మతి వర్గం నిరసన స్వరాన్ని వినిపిస్తోంది. పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న సీనియర్లను కాదని టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు పీసీసీ బాధ్యతలు ఎలా ఇస్తారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి వర్గం బహిరంగంగానే నిలదీస్తోంది. ఈ మేరకు అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. పీసీసీ పదవి తమకే ఇవ్వాలని కోమటిరెడ్డి సోదరులు మీడియా ముఖంగా పలుమార్లు డిమాండ్‌ చేశారు. పదవి తమకు దక్కనిపక్షంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతామని రాజ్‌గోపాల్‌ చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య పెను దుమారాన్నే లేపాయి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌ ఓటమి, ఉత్తమ్‌ రాజీనామా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలను ఆ పార్టీ నేతలు ఏ విధంగా ఎదుర్కొంటారనేది చూడాల్సిఉంది.