* జపాన్, ఆస్ట్రేలియాలతో త్రైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. పరస్పర వాణిజ్యం (మ్యూచువల్ ట్రేడ్), ఇన్వెస్ట్‌మెంట్‌లను (పెట్టుబడులు) ప్రోత్సహించేందుకే ఈ ఒప్పందానికి తెర తీస్తోంది. సరఫరా గొలుసు వ్యవస్థ పునరుద్ధరణ చొరవలో (ఎస్‌సీఆర్‌ఐ) భాగంగా ఈ 3 దేశాలు చైనాతో వాణిజ్యాన్ని సమానంగా తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. 3 దేశాల త్రైపాక్షిక వాణిజ్య సంబంధాల్ని బలోపేతం చేయడానికి, ప్రభుత్వంతో పాటు పరిశ్రమలు, విద్యా సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాలని నిర్ణయించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని తమదైన భావజాలం ఉన్న మిగతా దేశాలు కూడా సురక్షితమైన సరఫరా వ్యవస్థలను నిర్మించడానికి ఈ 3 దేశాలు సహకారం అందిస్తాయి. పారిశ్రామిక పార్కులు, క్రమబద్ధమైన రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ, మెరుగైన సముద్ర, వాయు అనుసంధానతల్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఇవి సంసిద్ధంగా ఉన్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాణిజ్య పత్రాల డిజిటలీకరణ, పారదర్శకతను మెరుగుపర్చడానికి.. నియంత్రణ సమాచార మార్పిడి కూడా త్రైపాక్షిక వాణిజ్య ఒప్పంద అజెండాలో చర్చకు ఉందని పేర్కొన్నాయి.
* కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా మరో 20కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న వారితో కలిపి 2030 నాటికి దాదాపు మొత్తం 100కోట్ల మంది కటిక పేదరికాన్ని అనుభవించే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తంచేసింది. వచ్చే దశాబ్ద కాలంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్న విషయంపై యూఎన్‌డీపీ తాజాగా అంచనాలు వేసింది. ఇందుకోసం యూఎన్‌డీపీతో పాటు యూనివర్సిటీ డెన్వెర్ భాగస్వామ్యంలో ఓ అధ్యయనాన్ని చేపట్టాయి.
* దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వరుసగా అయిదో రోజు కూడా భారత చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై రూ. 28 పైసలు, డీజిల్‌పై రూ. 29 పైసలు పెంచుతూ ఆదివారం ఆయిల్ సంస్థలు ప్రకటించాయి. విదేశీ మారకపు రేటు, అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ఇంధన ధరలను పెంచాయి. పెరిగిన ధరల ప్రకారం.. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.41, లీటర్ డీజిల్ ధర రూ.73.61కు చేరింది. ముంబయిలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 90.05, డీజిల్ ధర రూ. 89.78కు చేరింది.
* ఐఫోన్ 11 మోడల్‌కు సంబంధించి కొన్ని ఫోన్ల తెరలో (డిస్‌ప్లే) సమస్యలు వస్తున్నందున, ఉచితంగా మారుస్తున్నట్లు తయారీ సంస్థ యాపిల్ తెలిపింది. ‘2019 నవంబరు నుంచి 2020 మే మధ్య తయారైన ఐఫోన్ 11 తెరను టచ్ చేసినప్పుడు అది సరిగ్గా స్పందించడం లేదని గుర్తించాం. ఒకవేళ మీ ఫోనులోనూ ఇటువంటి సమస్య ఉంటే.. యాపిల్ వెబ్‌సైట్‌లో ఆ ఫోను క్రమసంఖ్య (సీరియల్ నెంబర్ చెకర్) సాయంతో మీరు తెర మార్పిడి సదుపాయానికి అర్హులో కాదో తెలుసుకోండి. మీరు అర్హులైతే యాపిల్ లేదా యాపిల్ అథీకృత సేవా కేంద్రాలు తెర మార్పిడి సేవను ఉచితంగా అందిస్తాయ’ని యాపిల్ తెలిపింది. తెర సమస్యను ముందుగానే గుర్తించి ఎవరైనా దానిని బాగు చేసుకుని ఉండి ఉంటే.. ఇందుకు చెల్లించిన డబ్బులను రిఫండ్ చేస్తామని పేర్కొంది. ఈ తెర మార్పిడి సదుపాయం కేవలం ఐఫోన్ 11 మోడల్‌కు మాత్రమేనని.. ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ మోడళ్లకు వర్తించదని స్పష్టం చేసింది.
* 2000 మెగావాట్ల సామర్థ్యమున్న సుబాన్‌సిరి హైడ్రోపవర్ ప్రాజెక్టును 2022 మార్చి నాటికి ప్రారంభిస్తామని ఎన్‌హెచ్‌పీసీ వెల్లడించింది. అస్సోమ్‌లోని వివిధ వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతతో సుమారు ఎనిమిదేళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సంజీవ్ నందన్ సహాయ్, అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్, కంపెనీ ఛైర్మన్, ఎండీ ఎ.కె.సింగ్ శుక్రవారం సుబాన్‌సిరి లోయర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించి, పవర్ హౌస్ పనులను పునఃప్రారంభించారని ఎన్‌హెచ్‌పీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత విద్యుత్ శాఖ కార్యదర్శి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారని పేర్కొంది. కంపెనీ చేపడుతున్న నిర్మాణ పనులు, నదీ పరిరక్షణకు సంబంధించి చేపడుతున్న కార్యకలాపాలు తదితర వివరాలను సమావేశంలో వెల్లడించామని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. 2020 మార్చి కల్లా ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలియజేశామని పేర్కొంది. వాస్తవానికి 2012 డిసెంబరులో ఈ ప్రాజెక్టు కార్యకలాపాలు మొదలు కావాల్సి ఉంది. తొలుత ఈ మెగా ప్రాజెక్టుకు నిర్మాణ విలువను రూ.6,285 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పుడు ఎనిమిదేళ్లపాటు పనులు నిలిచిపోవడంతో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.20,000 కోట్లకు పెరిగింది.
* కొత్త ఉత్పత్తులు కొనుగోలు చేయాలన్నా, సరికొత్త సాంకేతికతను ప్రారంభంలోనే అందిపుచ్చుకోవాలన్నా సంపన్న – పట్టణ భారతీయులు అధిక సంఖ్యలో ముందుంటున్నారు. మార్కెట్ రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ సంస్థ యూగోవ్ విడుదల చేసిన శ్వేత పత్రం ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండొనేషియా, యూకే, యూఎస్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 25 మార్కెట్లలో ఆరంభ టెక్ స్వీకర్తల అలవాట్లు, వైఖరులపై యూగోవ్ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.