కరోనా వైరస్ ధాటికి వణికిపోతున్న యునైటెడ్ కింగ్‌డమ్‌లో వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఫైజర్, బయోఎన్‌టెక్ తయారు చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ అనుమతించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే వ్యాక్సిన్ కంటైయినర్లు సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నాయి. వీటిని ఈ మంగళవారం నుంచే ప్రజలకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సిన్ కార్యక్రమంగా అభివర్ణించిన బ్రిటన్, తొలుత 50 జాతీయ ఆరోగ్య సేవల(ఎన్‌హెచ్‌ఎస్) ఆసుపత్రుల్లో పంపిణీని చేసేందుకు సిద్ధమైంది. మొదటి విడతలో భాగంగా, కరోనా ప్రమాదం పొంచివున్న ఆరోగ్య సిబ్బందికి, 80ఏళ్ల వయసు పైబడినవారితో పాటు అక్కడి కేర్ హోమ్ వర్కర్లకు ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు బ్రిటన్ పేర్కొంది. తొలుత మొదటి డోసు ఇచ్చి, 21రోజుల అనంతరం మరో డోసు ఇస్తామని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, వీరికి ఎటువంటి ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. భారీస్థాయిలో చేపడుతోన్న ఈ వ్యాక్సినైజేషన్ కేంద్రాలకు సోమవారమే టీకాలను చేర్చనున్నారు. యూకేలో ఈ వ్యాక్సిన్ పంపిణీని ఇంగ్లాండ్ ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఈ వారంలోనే దాదాపు 8లక్షల డోసులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తోన్న ఈ వారాన్ని ఎంతో చారిత్రకమైందిగా భావిస్తున్నామని యూకే హెల్త్ సెక్రటరీ మ్యాట్ హ్యాన్‌కాక్ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని..ఈ నేపథ్యంలో స్థానికంగా విధించిన ఆంక్షలను పాటించాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఇదిలాఉంటే, దాదాపు 2కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు 4కోట్ల డోసులను యూకే ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఇక ఫైజర్, బయోఎన్‌టెక్ తయారు చేసిన వ్యాక్సిన్ 95శాతం సమర్థత కలిగివున్నట్లు ఇప్పటికే వెల్లడైన విషయం తెలిసిందే.
ఫైజర్ తయారుచేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి తొలుత బ్రిటన్ ఆమోదం తెలుపగా తర్వాతి రేసులో అమెరికా కొనసాగుతోంది. ఇప్పటికే అమెరికా ఎఫ్‌డీఏను ఫైజర్ అనుమతి కోరగా.. వ్యాక్సిన్ వినియోగానికి ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ అనుమతి ఇస్తే మాత్రం అమెరికాలో ఈ శుక్రవారం నుంచే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని ఎఫ్‌డీఏ వ్యాక్సిన్ సలహాదారుల కమిటీ సభ్యుడు జేమ్స్ హల్‌డ్రెత్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. వ్యాక్సిన్ సమర్థతపై గురువారం జరుగనున్న సమావేశంలో ఎఫ్‌డీఏ వ్యాక్సిన్ అనుమతికే ఓటు వేయనున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ పంపిణీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. వచ్చే వారంలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని జార్జియాలో జరిగిన ర్యాలీలో ఆయన వెల్లడించారు. ఇతర ప్రభుత్వ హయాంలో ఐతే వ్యాక్సిన్ రావడానికి మరో ఐదేళ్లు పట్టేదని.. కేవలం ఏడు నెలల్లోనే మేము వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ఇంత తొందరగా వ్యాక్సిన్ వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరని.. దానిని మేము సాధ్యం చేసి చూపినట్లు ఆయన పేర్కొన్నారు.