DailyDose

ఏలూరులో ఏదో జరుగుతోంది! 140మందికి అస్వస్థత-నేరవార్తలు

Crime News - Strange Diseases Spreading In Eluru

* చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం రాత్రి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను ఓ ఎస్‌ఐ బెల్టుతో కొట్టిన ఘటనలో విచారణ కొనసాగుతోంది. ఎమ్మార్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఎస్సై బెల్ట్‌తో తనపై దాడి చేశాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై తిరుపతి అర్బన్‌ ఏఎస్సీ సుప్రజ స్పందించారు. విచారణలో బెల్ట్‌తో కొట్టినట్లు తేలితే ఎస్సైపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చెప్పారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఘటనపై విచారణ చేపట్టిన ఏఎస్పీ సుప్రజ బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ఆందోళన చేస్తున్న రాజకీయపక్షాలు, ప్రజా సంఘాల ప్రతినిధులతోనూ ఆమె మాట్లాడారు. ఎస్సై కొట్టినట్లు బాధితురాలు చెబుతోందని, అదే నిజమని తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

* హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్‌ వద్ద యువతి హల్‌చల్‌ చేసింది. నినాదాలు చేస్తూ గేటు దూకి లోనికి వెళ్లేందుకు యత్నించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకుని బయటకు తీసుకెళ్లారు. యువతిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పరిస్థితులు అంతు చిక్కడం లేదు. శనివారం అస్వస్థతకు గురైన దాదాపు 140 మంది ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. అయితే అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఉదయం నుంచి 46 మంది బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా.. మరో 60 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి లక్షణాలు కనిపించిన వారు ఈ ఉదయం నుంచి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ వ్యాధికి కారణాలు మాత్రం వైద్యులు ధ్రువీకరించలేదు.

* పీసపాడు గ్రామ శివారులోని పారుపల్లిలో తండ్రి కొడుకుపై గొడ్డలితో దాడి చేసి చంపిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్సై శివరామయ్య కథనం మేరకు.. బాజిబాబు (22) గత కొన్ని రోజులుగా పనికి వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండిపోయారు. ఖాళీగా ఉండడం తగదంటూ తండ్రి పారుపల్లి వెంకటేశ్వర్లు కొడుకుని మందలించారు. దీనిపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మద్యం తాగొచ్చిన వెంకటేశ్వర్లు ఇంట్లో నిద్రపోతున్న బాజిబాబు తలపై గొడ్డలితో దాడిచేసి పారిపోయారు. అప్పుడే పనికి వెళ్లి వచ్చిన కుటుంబ సభ్యులు తీవ్ర రక్తస్రావంతో పడిఉన్న బాజిబాబును చికిత్స నిమిత్తం సత్తెనపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పెళ్లీడుకొచ్చిన కొడుకును తండ్రే చంపడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు వారితో వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసుకొని, పారిపోయిన నిందితుడు వెంకటేశ్వర్లు కోసం వెదుకుతున్నారు.

* నగరంలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. హైదరాబాద్‌, కోల్‌కతా, దిల్లీలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో 850 మంది నుంచి రూ.34 కోట్లను మోసగాళ్లు వసూలు చేశారు. మోసపోయామని గ్రహించిన హైదరాబాద్‌ బేగంపేటకు చెందిన ఖయ్యూం అనే వ్యక్తి హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఖయ్యూం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌ సైనిక్‌పురికి చెందిన కౌశిక్‌ బెనర్జీ, రేఖా జాదవ్‌ను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.