ScienceAndTech

లోపభూయిష్టం iOS 14

లోపభూయిష్టం iOS 14

యాపిల్‌ సంస్థ కొద్ది నెలల క్రితం ఐఫోన్‌ యూజర్ల కోసం కొత్త ఓఎస్‌ను విడుదల చేసింది. ఐఓఎస్‌ 14 పేరుతో తీసుకొచ్చిన ఈ అప్‌డేట్‌లో సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉన్నట్లు యూజర్స్‌ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో వాటిని సరిచేస్తూ గత వారం ఐఓఎస్‌ 14.2 వెర్షన్‌ని యాపిల్ విడుదల చేసింది. అయితే ఈ కొత్త అప్‌డేట్‌ వల్ల కొన్ని ఐఫోన్ మోడల్స్‌లో 50 శాతం బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లో ఖాళీ అయిపోతుందట. అంతేకాకుండా ఫోన్ ఉపయోగించకుండానే 8 గంటల స్టాండ్‌బైలో 1-2 శాతం బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోతుందని, కొన్ని సార్లు ఫోన్ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు వేడెక్కుతోందని పలువురు యూజర్స్‌ యాపిల్ డెవలపర్స్‌ ఫోరమ్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. అలానే ఐఫోన్ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్ 6ఎస్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్స్‌లో ఫోన్ రీస్టార్ట్‌ చేసిన తర్వాత బ్యాటరీ ఛార్జింగ్‌ గతంలో కంటే ఎక్కువ చూపిస్తుందని మరికొందరు యూజర్స్‌ ఫిర్యాదు చేశారు. ఇలా తమను గందరగోళానికి గురిచేస్తున్న కొత్త ఓఎస్‌ సమస్యను పరిష్కరించాలని యూజర్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి కారణం యాపిల్ తొందరపాటేనని కొందరు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యాపిల్ కొత్త ఓఎస్‌ను తీసుకురావాలనే తొందర్లో ఐఓఎస్‌ 14, 14.1, 14.2 అప్‌డేట్‌లో లోపాల్ని గుర్తించలేకపోయిందని కొందరు అంటున్నారు. యూజర్స్‌ నుంచి వరుస ఫిర్యాదులు వస్తుండటంతో ఈ సాంకేతిక సమస్యలను సరిచేసి వచ్చే వారం రోజుల్లో యాపిల్‌ కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌ను తీసుకురానుందట. అప్పటి వరకు ప్రస్తుత ఓఎస్‌నే ఉపయోగించాలని టెక్‌ వర్గాలు తెలిపాయి. మీ ఐఫోన్‌లో ఏ ఓఎస్‌ ఉపయోగిస్తున్నారనేది తెలుసుకోవాలంటే.. సెట్టింగ్స్‌ యాప్ ఓపెన్ చేసి అందులో జనరల్ అనే సెక్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత అబౌట్‌ లేదా దాని కింద ఉన్న సాఫ్టవేర్‌ అప్‌డేట్‌ రెండింటిలో ఒక దానిపై క్లిక్ చేస్తే మీరు వాడుతున్న ఐఓఎస్‌ వెర్షన్‌ని చూపిస్తుంది. ఒక వేళ మీ ఐఫోన్‌లో కూడా ఇలాంటి సమస్యే ఉంటే కొత్త అప్‌డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.