DailyDose

భారత్ బంద్…బంపర్ సక్సెస్-తాజావార్తలు

Breaking News - Bharat Bandh Is Grand Success

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు గంటల పాటు బంద్‌ పాటించారు. ఈ బంద్‌కు మద్దతుగా రహదారులపై బైఠాయించిన రైతులు, వారి మద్దతుదారులు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళనకు మద్దతుగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఒకరోజు నిరాహారదీక్షకు దిగగా.. సాగు చట్టాలను రద్దు చేయాలని శిరోమణి అకాలీదళ్‌ వ్యవస్థాపకుడు ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ ప్రభావం కొన్ని రాష్ట్రాల్లోనే కనిపించింది. ఆయా రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. ధర్నాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలు, ప్రదర్శనలతో నిరసనకారులు కదం తొక్కారు. గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో బంద్‌ ప్రభావం పెద్దగా కనబడలేదు.

* రైతుల నిరసనలకు వ్యతిరేకంగా ట్వీట్‌ చేసి తొలగించిన నటి కంగనా రనౌత్‌ ఈసారి భారత్‌ బంద్‌కు వ్యతిరేకంగా ట్వీట్‌ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే దేశం అట్టుడుకుతోందని, బంద్‌తో మరింత తీవ్రతరం చేస్తున్నారంటూ పేర్కొంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటంపై కంగన మొదటి నుంచీ వ్యతిరేకత తెలుపుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మరో ట్వీట్‌ చేసింది. ‘రండి భారత్‌ను బంద్‌ చేసేద్దాం. ఈ పడవకు తుఫాన్ల కొరత లేనట్లు ఇప్పుడు మీరొచ్చి గొడ్డలితో పడవకు రంధ్రాలు చేయండి’ అంటూ నిరసనలకు మద్దతు తెలిపిన బంద్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేసింది. ఆద్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆందోళనలపై మాట్లాడిన ఓ వీడియోను ఆ ట్వీట్‌కు జతచేస్తూ పోస్టుచేసింది.

* దేశంలో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మంగళవారం పసిడి ధర 10 గ్రాములకు రూ. 816 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో 10 గ్రాముల పుత్తడి రూ. 49,430 పలికింది. అటు వెండి కూడా ఇదే బాట పట్టింది. కొనుగోళ్ల కళతో ఒక్కరోజే ఏకంగా రూ. 3,063 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 64,361కి చేరింది.

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌లో తెరాస శ్రేణులు పాల్గొన్నాయి. మంత్రులు సహా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు ఎక్కడికక్కడ బంద్‌లో పాల్గొని రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షాద్‌నగర్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌, తూప్రాన్‌లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో మంత్రి తలసాని, వరంగల్‌ జిల్లా రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, అలంపూర్‌లోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద మంత్రి నిరంజన్‌రెడ్డి, హుజూరాబాద్‌ పరిధిలోని కమలాపూర్‌లో మంత్రి ఈటల, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌, కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, కామారెడ్డి జిల్లా టేక్రియాల్‌లో ఎమ్మెల్సీ కవిత తదితరులు బంద్‌లో పాల్గొని కేంద్రానికి నిరసన తెలిపారు. దాదాపు తెరాస ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో రైతులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

* ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈనెల 10 వరకు హైకోర్టు స్టే పొడిగించింది. ఇటీవల ధరణి నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను సవాల్‌ చేస్తూ న్యాయవాది గోపాల్‌శర్మ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కోరడంతో విచారణను ఎల్లుండి(10వ తేదీ)కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన స్టేను ఎల్లుండి వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

* ప్రపంచంలోనే కొవిడ్‌ టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన 90ఏళ్ల బామ్మ నిలిచారు. యూకేలో ఫైజర్‌ టీకా పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభమైంది. అక్కడి కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీలోని యూనివర్శిటీ హాస్పిటల్‌లో 90ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ తొలి టీకా‌ వేయించుకున్నారు. ఫైజర్‌ టీకాకు క్లినికల్‌ అనుమతి లభించిన తర్వాత అధికారికంగా‌ తీసుకున్న తొలి వ్యక్తి ఈమే కావడం విశేషం. ఇంకో విషయమేంటంటే.. మరో వారంలో ఈ బామ్మ 91వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారట. ఈ సందర్భంగా మార్గరెట్‌ మాట్లాడుతూ.. ‘మొట్టమొదటి టీకా తీసుకోవడం చాలా ప్రత్యేకంగా, ఆనందంగా ఉంది. నా పుట్టినరోజుకు పొందిన గొప్ప బహుమతి ఇదే. ఈ ఏడాదిలో చాలా వరకు నేను ఒంటరిగానే గడిపాను. త్వరలోనే నా కుటుంబం, స్నేహితులతో కలిసి సమయాన్ని గడిపేందుకు ఎదురుచూస్తున్నా’ అని సంతోషంగా చెప్పారు.

* ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. ఈ పరిస్థితుల్లో స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఎస్‌ఈసీకి ఆదేశిస్తూ..తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

* రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. భారత్‌బంద్‌లో భాగంగా విజయవాడలో రైతులకు మద్దతు తెలిపిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధరపై చట్టాలు చేయాలని అన్నారు. కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు తెదేపా సవరణలు సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌యార్డులను నిర్వీర్యం చేస్తోందని దేవినేని విమర్శించారు.

* అన్నదాతల సంక్షేమం కోసం కేంద్రం ఒక చట్టం తీసుకొస్తే.. ప్రతిపక్షాలు మాయమాటలతో రైతులను పక్కదారి పట్టిస్తున్నాయని గోషామహల్‌ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. భారత్ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరేనని మండిపడ్డారు.

* ప్లాస్టిక్‌ వినియోగాన్ని ప్రస్తుతం గ్రామాల్లోనూ నిషేధించాలని జేసీ(అభివృద్ధి) వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. వ్యర్థాలపై వ్యతిరేక పోరాటంపై జిల్లా స్థాయి సమావేశం సోమవారం సాయంత్రం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీవోలతో నిర్వహించారు. జేసీ వీరవబ్రహ్మం మాట్లాడుతూ ప్రభుత్వం వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం సోమవారం నుంచి ఈ నెల 21 వరకు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలు వారి పరిధిలోని గ్రామ సచివాలయాలకు వెళ్లి అక్కడ పంచాయతీ కార్యదర్శులు, మిగతా సిబ్బంది విధి నిర్వహణ, సంక్షేమ ఫలాలు అందుతున్న తీరుపై పరిశీలించాలని, సచివాలయ వ్యవస్థను పటిష్ఠం చేయాలన్నారు. చెత్తనుంచి సంపదను, జిల్లాలోను ఆర్థిక వనరులు పెంపొందించుకుని దేశంలో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎంపీడీవోలపై ఉందని చెప్పారు. పాఠశాలలకు వెళ్లి మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్యం తదితరాలు పరిశీలించాలన్నారు. జేసీ(సంక్షేమం) రాజశేఖర్‌ మాట్లాడుతూ పలు గ్రామాల్లో సచివాలయాలు, ఆర్‌బీకే, విలేజ్‌ క్లినిక్‌లకు భవనాల నిర్మాణాని స్థలాలు లేవని చెబుతున్నారు, అక్కడే వీఆర్వో, సర్వేయర్లు ఉన్నారు వారికి చెప్పి ప్రభుత్వ భూములను గుర్తించి నిర్మాణాలు ఎంపీడీవోలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. జడ్పీ ఇన్‌ఛార్జి సీఈవో ప్రభాకరరెడ్డి, డీపీవో దశరథరామిరెడ్డి, డీఎల్‌డీవోలు ఆదిశేషారెడ్డి, రాధమ్మ, జ్యోతి, డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు పాల్గొన్నారు.

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు గంటల పాటు బంద్‌ పాటించారు. ఈ బంద్‌కు మద్దతుగా రహదారులపై బైఠాయించిన రైతులు, వారి మద్దతుదారులు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు.

* వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతుల్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చర్చలకు ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం 7గంటలకు రైతులు చర్చలకు రావాలని అమిత్‌షా తమను ఆహ్వానించారని.. రైతు సంఘాల నాయకుడు రాకేశ్‌ టికైట్‌ తెలిపారు. ఈ మేరకు షా తమను ఫోన్‌ కాల్‌ ద్వారా సంప్రదించినట్లు రాకేశ్‌ చెప్పారు.

* పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధిబారిన పడుతున్న వారి ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ప్రస్తుతం 120 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ప్రాథమిక నివేదికలో రోగుల శరీరాల్లో సీసం ఉన్నట్లు తేలినప్పటికీ పూర్తి స్థాయిలో నిర్ధారణకు రావాల్సి ఉంటుందని వివరించారు. పరీక్షలకు సంబంధించి కేంద్ర సంస్థల నివేదిక వచ్చాకే పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామన్నారు.

* ప్రపంచంలోనే కొవిడ్‌ టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన 90ఏళ్ల బామ్మ నిలిచారు. యూకేలో ఫైజర్‌ టీకా పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభమైంది. అక్కడి కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీలోని యూనివర్శిటీ హాస్పిటల్‌లో 90ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ తొలి టీకా‌ వేయించుకున్నారు. ఫైజర్‌ టీకాకు క్లినికల్‌ అనుమతి లభించిన తర్వాత అధికారికంగా‌ తీసుకున్న తొలి వ్యక్తి ఈమే కావడం విశేషం.

* మాథ్యూ వేడ్‌ (80; 53 బంతుల్లో, 7×4, 2×6), మాక్స్‌వెల్‌ (54; 36 బంతుల్లో, 3×4, 3×6) అర్ధశతకాలతో చెలరేగడంతో భారత్‌కు ఆస్ట్రేలియా 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన కెప్టెన్‌ ఫించ్‌ను సుందర్‌ ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేర్చాడు.

* ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంగా ప్రఖ్యాతి గాంచిన మౌంట్‌ ఎవరెస్ట్‌ తాజా ఎత్తును నేపాల్‌, చైనా మంగళవారం సంయుక్తంగా ప్రకటించాయి. తాజా సర్వే ప్రకారం ఇప్పుడు ఎవరెస్ట్‌ ఎత్తు 8,848.86 మీటర్లు. 1954లో భారత్‌ కొలిచినప్పటి ఎత్తుతో పోలిస్తే ఈ శిఖరం స్వల్పంగా 86 సెంటీమీటర్లు పెరగడం గమనార్హం.

* పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితులకు సంబంధించి 15 రక్త నమూనాలు వచ్చాయని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. వాంతులు, విరేచనాలకు సంబంధించిన నమూనాలను సంబంధిత అధికారులను అడిగినట్లు చెప్పారు. నమూనాల ద్వారా అన్ని రకాల బ్యాక్టీరియల్‌, వైరస్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే, పరీక్షలకు సంబంధించిన నివేదికలు వచ్చేందుకు వారం రోజుల సమయం పడుతుందని రాకేశ్‌ మిశ్రా తెలిపారు.

* వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇవాళ దేశ వ్యాప్తంగా రైతులు తమ నిరసన గళం వినిపిస్తున్న నేపథ్యంలో తెదేపా ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తితో కలిసి రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళం డీఆర్వో దయానిధికి వినతిపత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల్లో స్పష్టమైన ప్రకటన చేయలేదని ఆయన పేర్కొన్నారు.

* రైతు వ్యతిరేక ఉద్యమాలకు కేసీఆర్ వెన్నెముగా నిలుస్తున్నారని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. గతంలో కిలో పసుపు రూ.55 పలికేదని ఎంపీ అయిన తర్వాత తాను తీసుకున్న చర్యల వల్ల మద్దతు ధర పెరిగిందని అన్నారు. ఇవాళ దిల్లీలో ఆందోళన చేస్తోంది రైతులు కాదని, వారంతా దళారులని అర్వింద్ అన్నారు. కమిషన్‌ ఏజెంట్ల ఉద్యమానికి సీఎం కేసీఆర్‌ మద్దతు పలుకుతున్నాడని విమర్శించారు. వ్యవసాయ చట్టాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, తెరాస సిద్ధంగా ఉందా? అని సవాల్‌ విసిరారు.

* దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దేశీయంగా వడివడిగా అడుగులు పడుతున్న తరుణంలో సూచీలు కూడా లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 181 పాయింట్లు లాభపడి 45,608 చేరగా, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 13,392 వద్ద స్థిర పడింది. విదేశీ మదుపరులు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం, డాలర్‌ బలహీనంగా ఉండటం మార్కెట్‌కు కలిసొచ్చింది. దీంతో ఒకానొక దశలో సెన్సెక్స్‌ 45,742 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది.